Suryaa.co.in

Political News

అభివృద్ధి వాదం – జాతీయ నాదం !

– 21 వ ప్లీనరీలో కేసీఆర్ నినాదం !

టిఆర్ఎస్ 21 వ ప్లీనరీ జాతీయ రాజకీయాలపైనే కేంద్రీకృతం కానున్నది.ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీగా ప్రసంగాన్ని తయారుచేసుకున్నట్టు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా తెలంగాణ ‘అభివృద్ధి నమూనా’ను అమలు చేయడం,బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వ వివక్ష,బీజేపీ ప్రత్యర్థి పార్టీలను అణచివేసే ధోరణి,సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తున్న తీరు వంటి పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించవచ్చు.

విజయగర్వంతో,విపరీతమైన అధికారం వల్ల సంక్రమించిన ఉన్మాదంతో నరేంద్ర మోదీ,అమిత్ షా… దేశాన్ని ఎట్లా అధోగతిపాలు చేస్తున్నారో,మతం పేరిట,కులాల పేరిట ప్రజల్ని ఎట్లా విభజించి,విద్వేషాలు రగిలించి పబ్బం గడుపుకుంటున్నారో,మతతత్వ రాజకీయాలతో ప్రజల మనసుల్ని ఎట్లా కలుషితం చేస్తున్నారో కేసీఆర్ వివరించనున్నారు.బీజేపీ విద్వేషపూరిత కార్యకలాపాలను ఆయన ఎండగట్టనున్నారు.బీజేపీ లక్ష్యంగానే కేసీఆర్ ప్రసంగం సాగుతుందని టిఆర్ఎస్ వర్గాలంటున్నవి.జాతీయ రాజకీయాల్లో పోషించబోయే పాత్ర గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ‘రోడ్ మ్యాపు’ ను ఈ ప్లీనరీ సమావేశంలో ఆవిష్కరించే అవకాశాలున్నవి.

లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో వివిధ పార్టీలు తమ రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నవి.మిత్రులెవరో,శత్రువులె వరో విభజన రేఖను గీసుకునే పనిలో పడ్డాయి.తెలంగాణ సాధన సమయంలో డిల్లీలో లాబీయింగ్ సందర్భంగా పలు పార్టీలు,నాయకులతో ఏర్పడిన పరిచయాలు, సంబంధాలను కెసిఆర్ ఉపయోగించుకోనున్నారు. జాతీయ రాజకీయాల మెడలో నాలుగేండ్ల కిందటే ‘ఫెడరల్ ఫ్రంట్’ గంట కట్టిన నాయకుడు కెసిఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడుకు బిజెపి, కాంగ్రెస్ వైఫల్యాలే తాత్విక ప్రాతిపదిక. అయితే వివిధ కారణాల వల్ల ‘ఫ్రంట్ ‘ కార్యాచరణను ఆయన వాయిదా వేశారు.

దేశంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు, త్వరలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు వివరించారని సమాచారం అందుతున్నది. 2014, 2019 లలో కేంద్రంలో అద్భుతమైన విజయాన్ని బిజెపి నమోదు చేసుకుంది. 2014 లో కాంగ్రెస్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మోదీ మీద ఉన్న నమ్మకం.. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చినవి.2019 నాటికి కూడా కాంగ్రెస్ పుంజుకోకపోగా,మరింత బలహీనపడుతూ వస్తున్నది.

మోడీ మీద 2014 నాటికి ఉన్న నమ్మకం క్రమంగా తగ్గిపోతున్నట్టు 2019 లో చాలామంది భావించారు.నోట్ల రద్దు, జీయస్టీ లాంటి ప్రయోగాలు మోడీ ప్రతిష్టను పాతాళానికి దిగాజార్చినట్టు అంచనాలు జరిగాయి.ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్దాన్, గుజరాత్, మహరాష్ట్ర,బీహర్, డిల్లీ లాంటి 7 రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలలో బీజేపీ హవా కొనసాగుతోంది.”బీజేపీ,కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీలు.నిజానికవి పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు.కర్ణాటక మినహాయిస్తే తమిళనాడు,కేరళ, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ అడ్రసు లేదు.అడ్డి మార్ గుడ్డి దెబ్బలా తెలంగాణలో 4 లోక్ సభ సీట్లను బీజేపీ గెల్చుకున్నది.

అది ముమ్మాటికీ ఉత్తర భారత పార్టీ. దక్షిణాదిలో ఆపార్టీని ప్రజలు దరిచేరనివ్వరు.మతతత్వ బిజెపిని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆమోదించరు” అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ”హైదరాబాద్ లో కొన్ని శక్తులు మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి.అల్లర్లు సృస్టించి శాంతి – భద్రతలకు భంగం కల్గించాలని కుట్రలు చేస్తున్నాయి. అలాంటి అరాచక మతోన్మాద శక్తులను ఉక్కుపాదంతో అణచి పారేస్తాం” అని కొద్దిరోజుల కిందట ఒక సభలో కేటీఆర్ హెచ్చరించారు.సరిగ్గా ఇదే పద్ధతిలో,ఇదే భాషలో మతతత్వ శక్తులను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం హెచ్చరించారు.తమిళనాడులో ప్రజల్ని మతం పేరిట విభజించి హింసకు పాల్పడాలనుకుంటున్న వారి ఆటలు సాగవని స్టాలిన్ తీవ్ర స్వరంతో అన్నారు.

2024 లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం బీజేపీ,కాంగ్రెస్ లలో దేనికీ రాకపోవచ్చునని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడుతున్నారు. వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల బలాబలాలను శని,ఆదివారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చల సందర్భంగా తన అంచనాలను పీ.కే.పంచుకున్నట్టు తెలుస్తోంది.బెంగాల్ లో మమత, బీహర్ లో లాలూ, తమిళ నాడులో డి.ఎం.కే, తెలంగాణలో కెసిఆర్,ఏ.పీలో జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ కు గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ స్ధానాలు రావచ్చునని పీకే అంచనా.

ఈ వ్యూహకర్త లెక్కల ప్రకారం ప్రాంతీయ పార్టీల ఖాతాలో 150 కి పైగా సీట్లు రావచ్చును.ఆ సంఖ్య 180 దాకా వెళ్ళవచ్చునని కూడా ‘పీకే’ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి,బీజేపీ వ్యతిరేక ప్రాంతీయపార్టీలకు మధ్య ‘అనుసంధానం’ చేసే ‘ఆపరేషన్’లో ఆయన వ్యూహరచన ఏ మేరకు విజయవంతమవుతుందో తెలియదు.అయితే నవీన్ పట్నాయక్ గోడమీది పిల్లి బాపతు రాజకీయం నడుపుతున్నారు.బీజేపీ పట్ల స్టాలిన్, మమతా, కేసీఆర్,ఉద్ధవ్ థాకరే,శరద్ పవార్ వలె ‘కటువుగా’ లేరు .అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా.ఆయన మోడీ అనుకూల వైఖరితోనే ఉన్నట్టు పలు సందర్భాలు రుజువు చేస్తున్నవి.మోడీ ప్రభుత్వానికి జగన్ ‘వెలుపలి’ నుంచి మద్దతునిచ్చే అవకాశాలను కొట్టిపారవేయలేం.మోదీ ఎ.పి.నుంచి “కొత్త మిత్రుడు’గా జగన్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సొంతంగా 100 నుంచి 150 కి పైగా సీట్లు గెలవవలసి ఉన్నది. అప్పుడే ప్రాంతీయ పార్టీల బలాన్ని కూడగట్టి అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడవచ్చు.కేంద్రప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించే అవకాశాలకు ఈ లెక్కలు,అంచనాలే ప్రాతిపదిక. ప్రాంతీయ పార్టీల హవాకు అవకాశం ఉందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ వంటి వారు 2019 ఎన్నికలకు ముందు చేసిన అంచనాలు తప్పాయి. ప్రధానస్రవంతి మీడియా ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయినందున సోషల్ మీడియా ప్రత్యామ్నాయ పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

కాగా భారత రాజకీయాలను శాసిస్తున్నవి రెండే అంశాలు.ఒకటి జనాకర్షణ,రెండవది డబ్బు.ఆరెండు ఒకే చోట ఉండడం అరుదు.అవి రెండు ఉంటే ఆవ్యక్తి తిరుగులేని రాజకీయశక్తి అవుతారని చెప్పడానికి కేసీఆర్, జగన్,మోడీ వంటి వారే సాక్ష్యం. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటుకు గాను 2014 కు ముందువరకు తమిళనాడు,యూ.పి, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్ నితీష్ కుమార్ వంటి వారే కీలకపాత్ర పోషిస్తున్నారు. జగన్ ,కేసీఆర్ కొత్తగా ఈ బృందంలో చేరారు.భారత దేశం దశ,దిశను శాసిస్తు వస్తున్నఅతిరథులలో తమ రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా వారు ‘విధేయత’ ను మార్చుకుంటున్నారు.కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి తన ‘కష్టార్జితం’తో ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు.అలాగే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఎన్సీపీ స్థాపించిన శరద్ ప వార్, మమతాబెనర్జీలే ఇప్పుడు కాంగ్రెస్ కు ఊపిరిపోయాలన్నా,తీయాలన్నా ‘ప్రధాన భూమికలు’గా మారారు.

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ముగిసిన వేళ ‘కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం’ ప్రతిపాదన వీగిపోవడం వెనుక దిగ్విజయ్ సింగ్,జైపాల్ రెడ్డి వంటి హేమాహేమీలున్నారు. కేసీఆర్ ‘షరతుల’ను కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించడం వెనుక కొందరు తెలంగాణ నాయకులు కూడా కారణమే! దీంతో కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోగా తెలంగాణలో మిణుకు,మిణుకు మంటున్నది.

ఇదిలా ఉండగా బీజేపీకి మిత్రపక్షం కాకపోయినా అంతకంటే ఎక్కువగానే కెసిఆర్ గతంలో వ్యవహరించారు. నోట్ల రద్దు వ్యవహారంలో ఆయన మోడీని గట్టిగా సమర్థించారు.జీఎస్టీ విషయంలో అందరికంటే ముందు సమర్థించి ఆ తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.రాష్ట్రానికి రావలసిన నిధులలో భారీగా కొత్త పెట్టడం, విభజన హామీలేవీ అమలు చేయకపోవడం,రాష్ట్రాల హక్కులను హరిస్తున్న వైనంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కు చాలా కాలంగా ఆసక్తి ఉన్న విషయం కొద్ది మందికే తెలుసు. ”తెలంగాణ మైదానం నా లాంటి వాడికి చాలా చిన్నది. మైదానం ఇంకా మరింత విశాలంగా ఉండాలి” అని కొందరు నాయకులతో 2015 లోనే వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆయన ముందు చూపు అర్ధమవుతున్నది. ‘ఫెడరల్ స్ఫూర్తి’ని దెబ్బతీస్తున్న బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం వెనుక చాలా కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి?ఎలా మారబోతున్నాయి? అన్నదానిపై కేసీఆర్ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ వస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలన్ని జట్టుకడితే జాతీయ పార్టీల పెత్తనాన్ని నిలువరించవచ్చునన్నది ఆయన భావన.ఆ దిశగా కేసీఆర్ ప్రయత్నాలు సాగుతున్నవి.కాంగ్రెసేతర,బిజెపియేతర ‘కూటమి’ నిర్మాణము కోసం ఆయన ఆలోచనలు చేశారు.కానీ శరద్ పవార్,మమతా బెనర్జీ,స్టాలిన్,అఖిలేశ్ యాదవ్ వంటి నాయకులంతా ‘కాంగ్రెస్ రహిత’ జాతీయ కూటమి సాధ్యం కాదని ఖరాఖండిగా చెబుతున్నందున టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ ఆలోచనలోనూ మార్పు రాక తప్పదన్న వాదన ఉన్నది.

దేశవ్యాప్త రైతు సమస్యల పరిష్కారం, రాష్ట్రాల అధికారాలను కాపాడుకోవడం వంటి ‘ఫార్ములా’ తో కేసీఆర్ జాతీయ రాజకీయాల నినాదం చేబట్టారు.కేసీఆర్ టార్గెట్ మోదీ.కేసీఆర్ బిజెపికి ‘రహస్య మిత్రుడు’ అంటూ కాంగ్రెస్ చాలాకాలం నుంచే ఆరోపణలు గుప్పిస్తున్నది.ఆ ఆరోపణలను తిప్పిగొడుతూ మోడీని పలు సందర్భాలలో చెండాడుతున్నారు.అందుకు అవసరమైన ‘లాజిక్’ను కూడా కేసీఆర్ వాడుతున్నారు.

మొత్తంమీద జాతీయ రాజకీయాలలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నవి.జాతీయ రంగస్థలాన్ని కుదిపేయడానికి కెసిఆర్ తన చాణక్యాన్ని,చాకచక్యాన్ని,వ్యూహ చతురతను ఎట్లా ప్రదర్శించనున్నారన్నా అంశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నవి.

– ఎస్.కె. జకీర్
ఎడిటర్, బంకర్‌న్యూస్

LEAVE A RESPONSE