Suryaa.co.in

Editorial

డీజీపీ గారూ.. మీకు వినిపిస్తోందా?

– దువ్వాడ సారు హెచ్చరిక విన్నారా?
– ఆంధ్రాలో ఇది ఇక మామూలేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతా. అలా కొట్టకపోతే నేను దువ్వాడ శ్రీనివాసునే కాదు. అచ్చెన్నను తన్నడానికి ఒక్క నిమిషం చాలు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆహుతి సినిమాలో విలన్ని కొట్టినట్లు తరిమి తరిమి కొడతా. ఖబడ్దార్‌’
– ఇదేదో బాలకృష్ణ సీమ సినిమా డైలాగనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే.
ఇది స్వయంగా ఏపీలో అధికార వైసీపీ శాసనమండలి సభ్యుడయిన, దువ్వాడ శ్రీనివాస్‌ అనే మాననీయ ప్రజాప్రతినిధి ఓపెన్‌గా చేసిన హెచ్చరిక. ఇది ఇప్పటికిదాకా డీజీపీ గారికి వినిపించకపోవడమే ఆశ్చర్యం.

సీ న్‌ కట్‌ చేస్తే..
సోషల్‌మీడియాలో ఎవరైనా ఔత్సాహికుడు ఏపీ సర్కారును విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, వాటిని లైక్‌ చేసి షేర్‌ చేసినా.. ఆంధ్రా పోలీసు దళం బెజవాడ నుంచి దండయాత్రగా బయలుదేరి, ఆ పనిచేసిన వ్యక్తి ఏ రాష్ర్టంలో ఉన్నా ఆగమేఘాలపై వెళ్లి అతగాడిని అరెస్టు చేసి తీసుకువెళ్లిన దృశ్యాలు చాలా చూశాం. కారణం ప్రభుత్వాన్ని, అందులో ఉన్న వ్యక్తులను విమర్శించడమే.

ఇప్పుడు మళ్లీ సీన్‌ కట్‌ చేస్తే…
దువ్వాడ శ్రీనివాస్‌ అనే ఎమ్మెల్సీ.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూడా అయిన అచ్చెన్నాయుడిని తన్ని తరిమేస్తానంటూ తొడ కొట్టడాన్ని ప్రపంచమంతా చూసింది. మామూలుగా ‘దేశభక్తులయిన పోలీసులు’ తమ సహజశైలి ప్రకారమయితే, ఇప్పటికే జగన్‌ సూసైడ్‌ స్వ్కాడ్‌ కమాండరయిన మాననీయ ఎమ్మెల్సీ దువ్వాడపై సుమోటోగా కేసు నమోదు చేసి, అచ్చెన్నకు రక్షణ కల్పించాలి. లేదా.. అచ్చెన్నాయుడు అనే ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ దువ్వాడ నుంచి ప్రమాదం ఉంది కాబట్టి, సదరు అచ్చెన్నాయుడుకు ఇప్పుడున్న పోలీసుభ ద్రతయినా పెంచాలి. ఇప్పటివరకూ ఈ రెండూ జరగలేదు. సాధారణంగా అయితే దువ్వాడ చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఆయనపై ఐపిసి సెక్షన్‌ 506, 290 సెక్షన్లతో కేసు పెట్టాల్సి ఉంది. ఇప్పటిదాకా అచ్చెన్నాయుడు కూడా దువ్వాడపై ఫిర్యాదు చేసినట్లు లేదు. అయినా కనిపించని నాలుగో సింహమయిన పోలీసు, కర్తవ్య దీక్షతో తనంతట తాను స్పందించి దువ్వాడపై కేసు నమోదు చేయాలి. మరి ఏపీ డీజీపీ ఇప్పటివరకూ ఇవేమీ చేయలేదంటే.. బహుశా ఆయనకు దువ్వాడ వ్యాఖ్యలు వినిపించకపోయి ఉండాలి. లేదా ఆయనకు ఆ సమాచారమయినా చేరకపోయి అయినా ఉండకపోవచ్చు.

అయినా.. ఏపీలో ఇవన్నీ మామూలయిపోయాయి కాబట్టి, డీజీపీ కూడా దువ్వాడ వ్యవహారాన్ని అంతపెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుని ఉండవచ్చు. ఒకవేళ దువ్వాడపై కేసు పెట్టాలన్న చిత్తశుద్ధి ఉన్నప్పటికీ.. పైనుంచి ఆదేశాలు రానందున, మనకెందుకొచ్చిన పితలాటకం అని మౌనంగానయినా ఉండవచ్చు. కానీ.. దువ్వాడ వ్యాఖ్యలు డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి గారికి వినపించలేదన్నది మాత్రం అర్ధమవుతోంది.

LEAVE A RESPONSE