Suryaa.co.in

Andhra Pradesh

స్మార్ట్ మీటర్లను అపార్టుమెంట్లకు అనుమతించకండి

– అపార్టుమెంట్‌ వాసులకు విజ్ఞప్తి
-అపార్టుమెంట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తున్నారు. అనుమతించకండి.
– అనుమతిస్తే ఇరుక్కున్నట్లే
– మన కష్టార్జిలతాలను కొల్లగొట్టడానికి ప్లాన్లు వేస్తుంటే చూస్తూ ఊరుకుందామా?
– అదానీ దోపిడీని మన ఇంట్లో ప్రవేశపెడితే చూస్తూ ఊరుకో వద్దు
– అదానీ మీటర్ల మిషయంలో జగన్మోహన్‌ రెడ్డి – కూటమి ఒకటే

మితృలారా,

నివాసగృహాలకు కూడా స్మార్ట్‌ మీటర్లు బిగించటం ప్రారంభం అయింది. అయోధ్య నగర్‌ లో బిగించటం ప్రారంభించారు. స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్న వారు ఆదానీ మనుషులు. కాని కరెంటు డిపార్టు మెంట్‌ వాళ్ళమని మాయమాటలు చెప్పి వస్తున్నారు. మీటర్లు మార్చటం చేస్తున్నారు. మీటర్లు మార్చటం మాతమ్రే కాదు. వాళ్ళేదో మనకు ఉపకారం చేస్తున్నట్లు మీటరు మార్చామని చెప్పి రు.200, రు.300లు మామూళ్ళ పేరుతో వసూలు చేస్తున్నారు.

ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తరువాత కమర్షియల్‌ కనెక్షన్లకు ( అంటే పరిశ్రమలకు, షాపులకు) బిగించారు. ఇప్పుడు నివాస గృహాలకు వస్తున్నారు. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లు పెట్టిన షాపులు వాళ్ళకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులను చూచి గుండెలు బాదుకుంటున్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకు అప్పగించటం కోసం ముందస్తు చర్యగా స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్నారు.

స్మార్ట్‌ మీటర్లు బిగించాలంటే మన అనుమతి కావాలి. ఒక సారి స్మార్ట్‌ మీటరు బిగిస్తే మనం అనుమతించినట్లే. క్రమేణా మన కరెంటు కనెక్షన్‌ ఆదానీ చేతికి పోతుంది. అందువలన దయచేసి అనుమతించవద్దు. అపార్టుమెంట్లకు మీటర్లు క్రింద స్టిల్ట్‌ ఫ్లోర్‌ లేక సెల్లార్‌లో ఉంటాయి. చెప్పా పెట్టకుండా బిగించి వెళ్లి పోయే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తతో గమనించండి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును అడ్డుకోండి.

స్మార్ట్‌ మీటర్లు వలన నష్టమేమిటో ఈ క్రింద వివరిస్తున్నాము.

01. ఈ మీటరు ఖరీదును మనమే భరించాలి. సింగిల్‌ ఫేజ్‌ మీటరు ఖరీదు రు.8,927లు. త్రిఫేజ్‌ మీటరు ఖరీదు రు.17,286లు. ఈ మొత్తాన్ని 93 నెలల పాటు ఇన్‌స్టాల్‌ మెంట్లుగా బిల్లుతో బాటు వసూలు చేస్తారు.

02. మీటరు అంటే ఒక దానిని కొలవటానికి ఉపయోగపడేది. అంతేగాని నియంత్రిం చే పరికరం కాదు. కాని స్మార్ట్‌ మీటర్‌ మామూలు విద్యుత్‌ మీటర్‌ మాదిరిగా విద్యుత్‌ వాడకాన్ని రికార్డు చేయటానికి మాత్రమే ఉపయోగించే పరికరం కాదు. ఈ మీటరును రిమోట్‌నుండి ఆపరేట్‌ చేయవచ్చు. నియంత్రించవచ్చు. అందుకోసం దీనిలో 2 ఏర్పాట్లు ఉంటాయి.

మొదటిది AMI:-AMI అంటే Advanced metering infrastructure అని అర్ధం. ఈ సదుపాయం ద్వారా మన ఇంట్లో మీటరు ఎక్కడో ఉన్న బ్యాక్‌ ఆఫీసుకు వైర్‌ లెస్‌ ద్వారా కనెక్షన్‌ ఉంటుంది. ఎక్కడో ఉండి ఇక్కడ మీటరును ఆపరేట్‌ చేయవచ్చు. ఇది చాలా ప్రమాదం. విద్యుత్‌ మీటరు అంటే మనం ఎంత విద్యుత్‌ వాడాము అన్న దానిని రికార్డు చేసే పరికరంగా కాక, రిమోట్‌ నుండి ఆపరేట్‌ చేసే పరికరంగా ఈ స్మార్ట్‌ మీటర్‌ ఉపయోగపడుతుంది.

రెండవది AMR:- AMR అంటే Automatic Meter reading. ఏ సమయానికి ఎంత విద్యుత్‌ వాడుకున్నారన్నది ఇది రికార్డు చేస్తుంది. పీక్‌ సమయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేయటానికి విద్యుత్‌ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఉదాహరణకు ఉదయం 6 నుండి 10 గంటవరకు, సాయంత్రం 6 నుండి 10 గంటలవరకు పీక్‌ సమయంగా ప్రస్తుతం నిర్ణయించారు. ఈ సమయంలో ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఏర్పాటు చేశారు.ఇది ప్రజలకు భారం అవుతుంది.

ఈ రెండు ఏర్పాట్లు చాలా ప్రమాద కరమైనవి.

03. ఈ మీటర్లు ప్రీ పెయిడ్‌ మీటర్లు. సెల్‌ ఫోన్‌ మాదిరిగా ముందుగా రీ చార్జీ చేసుకోవాలి.

04. ప్రస్తుతం ఉన్న పోస్ట్‌ పెయిడ్‌ విధానంలో బిల్లు చెల్లించటానికి 15 రోజులు గడువు ఉంటుంది. బిల్లుచెల్లించడానికి, చెల్లించకపోతే పెనాలిటీతో చెల్లించటానికి, అప్పటికీ చెల్లించకపోతే, కనెక్షన్‌ కట్‌ చేయటానికి నిర్ధిష్టమైన గడువు ఉంటుంది.

బిల్లు చెల్లించటానికి వినియోగదారునికి వెసులుబాటు ఉంటుంది. ఈ గడువు వరకు వినియోగదారునికి విద్యుత్‌ సరఫరా గ్యారెంటీ ఉంటుంది. ప్రీ పెయిడ్‌ విధానంలో అది ఉండదు. ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు కనెక్షన్‌ కట్‌ అవుతుంది.

05. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు లక్షలలో విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుంటాయి. వాడుకున్న తరువాత చెల్లించే బిల్లు నిర్ధిష్టంగా ఉంటుంది. అదే మొత్తాన్ని ముందుగా ఊహించి చెల్లించాలంటే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు వర్కింగ్‌ కేపిటల్‌ పెరుగుతుంది.

06. వర్కింగ్‌ కేపిటల్‌ భారాన్ని విద్యుత్‌ జనరేషన్‌ కంపెనీలు మరియు డిస్కంల మీదనుండి వినియోగదారుని మీదకు నెట్టివేయబోతున్నారు. దీనివలన కొన్ని పరిశ్రమలు మూతబడతాయి. ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది.

07. వాడుకున్న తరువాత పేపరు మీద బిల్లు ఇస్తే ఎంతవాడామో, ఏరేటు చెల్లిస్తున్నామో నిర్థిష్టంగా ఉంది. ప్రీ పెయిడ్‌ అయితే యూనిట్‌కు ఎంత వసూలు చేస్తున్నారో వినియోగదారునికి తెలియదు.

08. విద్యుత్‌ ఉపకరణాలతో పని చేస్తున్నప్పుడు కరెంటు పోతే, సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే చేసే పనులుకూడా ఆగిపోతాయి.

09. పైన చెప్పిన విధంగా స్మార్ట్‌ మీటరు ఖరీదును, దానికి అనుబంధంగా వాడే పరికరాల ఖర్చును వినియోగదారుడే భరించాలి. ఇది వినియోగదారునికి భారం

10. సేవలు పొందిన తరువాత వినియోగదారుల నుండి ఛార్జీలు వసూలుచేసే విధానం నుండి, వినియోగదారుడు ముందుగానే చెల్లించి సేవలు పొందే విధానంలోనికి మార్పుచేసే ప్రక్రియే ఈ స్మార్ట్‌ మీటర్ల ప్రతిపాదన. ఈ విధానం వలన అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారులను విద్యుత్‌ సరఫరాకు దూరంచేసే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ మీటర్లు కేవలం మనం వాడిన విద్యుత్‌ను కొలవటానికి మాత్రమే ఉద్దేశించినవి కావు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు వారికి, ముఖ్యంగా ఆదానీకి అప్పగించటానికి ఉద్ధేశించినవి. ఈనాడు బయటకు మనకు కనుపిస్తున్న విద్యుత్‌ స్థంభాలు, తీగెలు, ట్రాన్స్‌ఫారాలు, సబ్‌ స్టేపన్లు, భవనాలు అన్నీ మన డబ్బుతో నిర్మించినవి. వీటిని ఈనాడు అక్రమంగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? మన కష్టార్జిలతాలను కొల్లగొట్టడానికి ప్లాన్లు వేస్తుంటే చూస్తూ ఊరుకుందామా?

విద్యుత్‌ అనేది ప్రజలకు ప్రభుత్వాలు కల్పించే సౌకర్యం. వ్యక్తి ఆర్ధికాభివృధ్ధికి, దేశ ఆర్ధికాభివృధ్ధికి కీలకం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం.అంతే కాని విద్యుత్‌ అనేది ప్రజలను పిండుకునే వ్యాపారం కాదు. కాని మన పాలకులు విద్యుత్‌ను సరుకుగా మార్చి వ్యాపారం చేశారు.

ఇప్పుడు వ్యాపార దశనుకూడా దాటి, దోచుకు తినటానికి ప్లాన్లు వేస్తున్నారు. దానికోసమే విధానాలను రూపొందిస్తున్నారు. మొత్తం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించటం కోసం వేగంగా పావులు కదుపుతున్నారు. అందుకోసమే తొలిమెట్టుగా స్మార్ట్‌ మీటర్లు అమలు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ మీటర్లు అన్ని విధాల నష్టం. అందువలన ఈ స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేకించాలి.

జగన్మోహన్‌ రెడ్డి గారికి, కూటమి నాయకులకు రోజూ తగాదే. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నట్లుగా కనుపిస్తుంది.కానీ ఆదానీ విషయంలో,అదానీ మీటర్ల మిషయంలో వీరంతా ఒకటే. ఆనాడు జగన్‌ ప్రభుత్వం ఖరారు చేసిన ఆదానీ కంపెనీకి చెందిన స్మార్ట్‌ మీటర్లను నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దుచేయలేదు. పైగా బిగించటానికి అనుమతించి, ఈ విషయంలో ఇద్దరూ ఒకటేనని నిరూపించారు.

ఎన్నికలకు ముందు స్మార్ట్‌ మీటర్లను పెడితే పగులగొట్టమని పిలుపునిచ్చారు. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్‌ మీటర్లను మన ఇళ్ళకు బిగించమని ఆదేశాలిచ్చారు. ఆనాడైనా, ఈనాడైనా పడే భారం మనమీదనే. అడ్డుకోవాల్సింది మనమే. మోడీ ఆదేశాల మేరకు, అదానీకి మన విద్యుత్‌ సంస్థలను అప్పగించటం కోసం మన ఇళ్ళలో ఈ స్మార్ట్‌ మీటర్లను బిగిస్తున్నారు.

స్మార్ట్‌ మీటర్లు పెట్టిన షాపుల వాళ్ళకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులను చూచి గుండెలు బాదుకుంటున్నారు. ఇన్ని చూచిన తర్వాత మనం స్మార్ట్‌ మీటర్లను అనుమతిద్దామా? అదానీ దోపిడీని మన ఇంట్లో ప్రవేశపెడితే చూస్తూ ఊరుకో వద్దు. ప్రతిఘటిద్దాం. స్మార్ట్‌ మీటర్లు రాకుండా అడ్డుకుందాం.

– విద్యుత్‌ వినియోగదారుల ఐక్య వేదిక
విజయవాడ

LEAVE A RESPONSE