Suryaa.co.in

Andhra Pradesh

ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదు

విజ్ఞాన సముపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం
సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

నరసరావుపేట: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదు. విజ్ఞాన సముపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సీనియర్ హైకోర్టు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ ఏమన్నారంటే… నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం శుభ పరిణామం. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించాలని, ఈ పాఠశాల ఏర్పాటు చేయడం హర్షనీయం. భావితరాల భవిష్యత్తు అనేది విద్య మీదనే ఆధారపడి ఉంటుంది.

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, అత్యుత్తమ ఉద్యోగాలు సంపాదించి, ఉన్నత స్థాయికి ఎదిగిన మూలాలు మరిచిపోకూడదు. మన సంస్కృతి, భాష, సంప్రదాయాలను గుర్తించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది విద్యాసంస్థలే. దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో స్థిరపడిన స్వదేశం స్వగ్రామం మీద మమకారం మరువరాదు. ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోంది. అందులో యువత, విద్యార్థులే కీలకపాత్ర పోషించనున్నారు.

LEAVE A RESPONSE