Suryaa.co.in

Editorial

జగన్ ‘భూ’కైలాస్ డ్రామా బట్టబయలు

– వైసీపీ ‘భూమి’ బద్దలయింది!
– వైసీపీ గుండెల్లో మళ్లీ ‘భూ’కంపం
– బీజేపీని బద్నామ్ చేసే జగన్ వ్యూహం బూమెరాంగ్
– ల్యాండ్ లైటలింగ్ యాక్టును బీజేపీపై నెట్టేసిన జగన్ అండ్ కో
– సాక్షి ఢిల్లీ ప్రతినిధి ఆర్‌టీఐతో వెలుగులోకి వచ్చిన వాస్తవం
– ఆ యాక్టు గురించి తమకు తెలీదన్న నీతి ఆయోగ్
– ఇప్పటిదాకా నీతి ఆయోగ్ పేరుతో డ్రామాలాడిన వైసీపీ
– దానినే సోషల్‌మీడియాలో తిప్పిన అతి తెలివి
– చివరకు బీజేపీపైనే ఎదురుదాడి చేసిన తెగింపు
– ఇప్పుడు ఇరకాటంలో వైసీపీ వ్యూహబృందం
– వైసీపీని చిక్కుల్లో నెట్టిన సాక్షి ప్రతినిధి
( మార్తి సుబ్రహ్మణ్యం)

చెడపుకురా చెడేవు.. తెలివి ఒకరి సొమ్మా.. తొండెపి సుబ్బమ్మా.. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుందన్నది మనకు తెలిసిన పాత సామెతలు. ఇప్పుడు వైసీపీ పుణ్యాన ‘అంతకుమించిన’ మరో సామెత వెతుక్కోవలసిన వైచిత్రి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గుండెల్లో ‘భూ’ కంపం సృష్టించిన ల్యాండ్‌టైటలింగ్ యాక్టుపై జగన్, సజ్జల, అజయ్‌కల్లం, విజయసాయిరెడ్డి, బొత్స అండ్ అదర్స్ చేసిన ఓవరాక్షన్‌ను.. వైసీపీ అధికార మీడియా ప్రతినిధే బట్టబయలు చేసి, జగనన్నను జనంలో ముద్దాయిగా నిలిపేందుకు చేసిన ప్రయత్నం, అడ్డం తిరిగిన వైనం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్. అంటే ‘లేపి తన్నించుకోవడం’ అన్నమాట!

ప్రైవేటు వ్యక్తుల భూములను హక్కుభుక్తం చేసుకునే మాయోపాయంతో, జగన్ రూపుదిద్దిన ల్యాండ్ టైటలింగ్ యాక్టు ఎన్నికల ప్రచారంలో ‘భూ’కంపం సృష్టించింది. చంద్రబాబునాయుడు-పవన్-లోకేష్ .. ఆ చట్టం వల్ల వచ్చే ప్రమాదాన్ని, కాళ్లకుబలపాలు కట్టుకుని తిరిగి మరీ ఓటర్లను చైతన్యం చేశారు. ఫలితంగా ప్రజలు సైతం.. జగన్ సర్కారు తమ భూములకు జిరాక్సు కాపీలిచ్చి, అసలు కాపీలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటున్న భావన కల్పించారు.

అటు ప్రజలు కూడా జగన్ మళ్లీ సీఎం అయితే తమ భూములను స్వాధీనం చేసుకుని, వాటిని గ్యారంటీలుగా చూపించి బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటుందని భయాందోళనకు గురయ్యారు. కారణం.. అప్పటికే జగన్ సర్కారు, సచివాలయ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడమే. పైగా సర్కారు ఇచ్చే జిరాక్సులతో, బ్యాంకులు తమకు రుణాలివ్వవని గ్రహించారు. దానితో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్‌రోజున, వైసీపీపై ఆగ్రహంతో మూకుమ్మడిగా కూటమికి ఓటెత్తి జైకొట్టారు.

అయితే.. ల్యాండ్ టైటలింగ్ యాక్టు తమ కొంప కొల్లేరు చేయబోతోందని గ్రహించిన వైసీపీ వ్యూహబృందం, కూటమిపై ఎదురుదాడి చేసింది. ‘ఇది కేంద్రంలోని బీజేపీ తెచ్చిన చట్టం. చంద్రబాబుకు దమ్ముంటే ఈ చట్టం గురించి అమిత్‌షా ఎదుట మాట్లాడగలరా?’ అని జగన్ ఎదురుదాడి చేశారు. సలహాదారు సజ్జల, విజయసాయిరెడ్డి, బొత్స అండ్ అదర్స్ సైతం.. భూములు కొన్న చంద్రబాబు-పవన్-పురందేశ్వరికి ప్రభుత్వం ఒరిజనల్స్ ఇచ్చిందా? జిరాక్సు కాపీలిచ్చిందా? అని అర్ధం లేని ప్రశ్నలు సంధించారు.

అసలు ఈ చట్టంతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా రూపొందించిందని బట్టకాల్చి బీజేపీ నెత్తిన వేశారు. దానితో తెరపైకొచ్చిన బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఈ చట్టంతో బీజేపీకి సంబంధం లేదని, జగన్ అక్రమాలను బీజేపీపైకి నెట్టి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సర్కారుకు దమ్ముంటే నీతిఆయోగ్ సిఫార్సులను బయటపెట్టాలని, దినకర్ చేసిన సవాలుకు వైసీపీ గళధారుల నుంచి ఇప్పటిదాకా జవాబులేదు.

ఈ వాద ప్రతివాదాల నడుమ పోలింగ్ కూడా ముగిసింది. అయితే కొద్దిగా ఆలస్యంగానయినా.. వైసీపీ ఆడిన ‘భూ’కైలాస్ డ్రామా అడ్డం తిరిగింది. దానికి కారణం ఎవరో కాదు. ఆ పార్టీకి చెందిన సాక్షి మీడియాలో పనిచేస్తున్న ఓ ఢిల్లీ జర్నలిస్టే! నీతిఆయోగ్‌ను అడ్డుపెట్టుకుని, కూటమిని ఇరుకునపెట్టి ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టే అతుత్సాహంతో, సదరు జర్నలిస్టు నీతిఆయోగ్‌కు ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు చేశారు. ఒకవేళ ఈ చట్టాన్ని తామే సిఫార్సు చేశామని నీతిఆయోగ్ చెబితే, దాన్ని అడ్డుపెట్టుకుని కూటమిని దెబ్బకొట్టాలన్నదే ఆ శునకానందం అన్నమాట! అయితే వైసీపీ మీడియా ఉత్సాహం బూమెరాంగయింది. అదెలాగంటే..

ఏపీలో నీతియోగ్ సిఫార్సుల మేరకు తీసుకువచ్చిన ల్యాండ్‌టైటలింగ్ యాక్టు చట్టం ఎలా ఉందని ఢిల్లీ సాక్షి టీవీ ప్రతినిధి వెంకటేష్ నాగిల్ల ఆర్టీఐ కింద ప్రశ్న వేశారు. అందుకు మాదగ్గరఎలాంటి సమాధానం లేదని నీతిఆయోగ్ స్పష్టం చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటలింగ్ యాక్టు అమలకు నీతి ఆయోగ్-కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని అని ప్రశ్నించారు. దానికి ‘నీతి ఆయూగ్ భూవనరుల విభాగంతోపాటు అన్ని రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను మాత్రమే పంపించామని’’ సమాధానమిచ్చింది.

రైతులు తమ భూములు అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమా? అన్న మరో ప్రశ్నకు.. ‘‘అక్కడి ల్యాండ్‌టైటలింగ్‌యాక్టులో ఏముందో మాకు తెలియదు. దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర లేద’’ని చెప్పింది. అంటే ఏపీలో జగన్ సర్కారు తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్టు గురించి, తమకు ఏమీ తెలియదని అదే నీతిఆయోగ్ చెప్పడంతో.. వైసీపీ గళధారులు ‘‘పిత్తిన పేరయ్యల్లా’’ గమ్మున కూర్చోవలసి వచ్చింది.

నిజానికి నీతి ఆయోగ్ ఈ డ్రాఫ్టును, ఏపీకి 2019 డిసెంబర్ 26న పంపించింది. అయితే జగన్ సర్కారు ఈ బిల్లును 2019 జులై 26న కేంద్ర ఆమోదానికి పంపింది. అంటే ల్యాండ్ టైటలింగ్ యాక్టును ముందే రూపొందించి, అసెంబ్లీలో ఆమోదించిన జగన్ సర్కారు.. ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి, బాబు-పవన్‌ను పేల్చే మాయోపాయానికి తెరలేపినట్లు స్పష్టమయింది.

ఇదంతా సాక్షి ప్రతినిధి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయకపోతే, నిజాలేమిటన్నది ప్రజలకు తెలిసేది కాదు. ‘ఇది కేంద్రం పంపించిన బిలే’్లనంటూ సలహాదారు సజ్జల, అజయ్‌కల్లం జమిలిగా చేసిన విమర్శలను, మేధావి వర్గం తొలుత నిజమేనని నమ్మింది. అందుకుతగినట్లుగానే వైసీపీ సోషల్‌మీడియా సైన్యం కూడా, కేంద్రం రాష్ట్రానికి పంపిన ముసాయిదాని సోషల్‌మీడియాలో తిప్పింది. దానితో మేధావులు కూడా నిజమే కామోసనుకున్నారు.

కానీ చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచారసభలో.. ఆ యాక్టుతో వచ్చే ముప్పును వివరించి, ఆ కాపీలను తగలబెట్టడంతో భూములున్న ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రగిలేందుకు కారణమయింది. సో.. ల్యాండ్ టైటలింగ్ యాక్టు వెనుక నిజాలు బయటపెట్టేందుకు సహకరించిన, వైసీపీ మీడియా ఢిల్లీ ప్రతినిధికి.. ఎన్డీయే కూటమి కృత జ్ఞతలు చెప్పకపోతే కళ్లుపోతాయి మరి!

LEAVE A RESPONSE