Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్‌ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం

-నాయుడు కొడుకు…నాయకుడై నడిపించాడు
– ఐదు కోట్ల మంది గొంతుక వినిపించిన యువగళం నారా లోకేష్‌

– మూడు ప్రాంతాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల గెలుపు
– ఈ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం వెనుక లోకేష్‌ పాత్ర

మంగళగిరి: వైసీపీ అరాచకపాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వినిపించేందుకు యువగళం పాదయాత్రను 2023 జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి మొదలుపెట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది పాదయాత్ర. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,104 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కిమీ మేర యువగళం పాదయాత్ర సాగింది. ఇప్పటివరకూ సాగిన రాజకీయ నేతల పాదయాత్రలకు విభిన్నమైంది లోకేష్‌ యువగళం పాద యాత్ర. అడుగులు వేసుకుంటూ వెళ్లిపోవడం కాదు.. సమస్యలు ప్రత్యక్ష పరిశీలన, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, సత్వర సాయం, మేథోమధనం, అన్నివర్గాల ఆకాంక్షలు తెలుసుకున్న ఓ రాజకీయ యువపరిశోధకుడు సాగించిన మహా ప్రయాణం ఇది. యువగళం పాదయాత్రలో 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి, 8 రచ్చబండలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో లోకేష్‌ పాల్గొని వివిధ వర్గాలు, ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు 4,353 వినతిపత్రాలు అందజేశారు. పాదయాత్రలో కోటి 50 లక్షల మందితో మమేకయ్యారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో ప్రజాచైతన్యాన్ని మేల్కొలిపారు. అధికారం అండతో వైసీపీ సాగిస్తున్న అణచివేత, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు ప్రశ్నిం చడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో 3 పట్టభద్రుల నియోజక వర్గాల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. యువగళం పాదయాత్రతో ప్రజలకు భరోసా, తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం నింపారు లోకేష్‌. 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయానికి యువగళం పాదయాత్ర కూడా దోహదం చేసింది.

LEAVE A RESPONSE