Suryaa.co.in

Andhra Pradesh

బొప్పూడిలో జన సునామీ వచ్చిందా?

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

బొప్పూడిలో జన సునామీ వచ్చిందా అనేలా ప్రజా గళం సభ ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన మాటలు..

చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో జరిగిన ప్రజాగళం మహాసభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో సభను ఎవరూ నిర్వహించలేదు.. చూడలేదు. 300 ఎకరాల్లో సభకు ఏర్పాటు చేసినా స్థలం చాలక కిలోమీటర్ల పొడవునా 3 రెట్లు ప్రజలు బయటే ఉండిపోయారు. సభా స్థలానికి అటు, ఇటు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సభకు హాజరైన జనసంద్రాన్ని చూసి ప్రధాని మోడీ గారు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ జనసంద్రం జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. సభకు హాజరైనవారి లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, జోష్ ని గమనించిన ప్రధాని దానిపై కూడా వ్యాఖ్యలు చేశారు. లక్షలాదిమంది ప్రజల సాక్షిగా.. ఎన్నికల తరువాత రానున్న ఐదు సంవత్సరాలు నవ్యాంధ్ర భవిష్యత్తుకు చాలా కీలకమని.. డబుల్ ఇంజిన్ సర్కార్ తోడ్పాడుతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని.. రాష్ట్రానికి ప్రజలకు కేంద్రంలో మూడోసారి ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు తాను కూడా అండగా ఉంటానని ప్రధాని హామీ ఇవ్వటం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరటను, సంతోషాన్ని, విశ్వాసాన్ని కలుగజేసింది.

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మోదీగారు తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధికి పూర్తి వ్యతిరేక వాతావరణం నెలకొందని ప్రధాని వ్యాఖ్యానించటంతో జగన్ క్యాంప్ లో కలవరం రేగింది. దీంతో జగన్ బృందం అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఈ ఐదేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన కనుమరుగై.. మంత్రులంతా అవినీతిలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని రాష్ట్రంలో జరుగుతున్న దోపిడిపై ప్రధాని నిశితమైన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువగా బలపడిన ఎన్డీఏ.. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపులో 400కు పైగా లోక్ సభ సీట్లను సాధిస్తుందన్న నమ్మకాన్ని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేయటం.. ఆ దిశగా రాష్ట్రంలో సీట్లన్నీ ఎన్డీఏ కే దక్కుతాయని ఆయన చెప్పటంతో జగన్ క్యాంప్ లో వణుకు చెలరేగింది.

శాసనసభ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి కనీసంగా 165 సీట్లు గెలుస్తుందన్న నమ్మకం మా కూటమికి ఉంది. నేటి ప్రజాగళం సభ సూపర్ హిట్ అవటంతో జగన్ బృందం హతాసులయ్యారు. ఈ విజయం రానున్న ఎన్నికల్లో కూటమి సృష్టించనున్న ప్రభంజనానికి పూర్తి సంకేతం. మేదరమెట్ల సిద్ధం సభ లో.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఎంతో మేలు చేశానని చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. అయినా ఓడిపోయినా పర్వాలేదు అని నిర్వేదంతో మొదటి ముందస్తు ఓటమి సంతకం చేశారు.

శనివారం నాడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ.. 81 శాసనసభ అభ్యర్థులను, 18 మంది లోక్ సభ అభ్యర్థులను మార్చవలసి వచ్చిందని తెలిపి రెండోసారి ముఖ్యమంత్రి ముందస్తు సంతకం చేసి.. రానున్న ఎన్నికల్లో అనివార్యమైన కూటమి భారీ విజయాన్ని ఆయనే అంగీకరించారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో జగన్ బృందం విచక్షణ మరచి ఉన్నవి లేనివి మాట్లాడి తమ నైరాశ్యాన్ని తామే ఎత్తిచూపుకుంటున్నారు. ఈ ఐదేళ్లలో జగన్ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం తెచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జగన్ కు సవాల్ విసిరారు.

LEAVE A RESPONSE