( అవును.. ఆయనో ప్రజాస్వామ్యవాది!ఆధునిక రాజకీయాలు, రాజకీయపార్టీ పోకడలు, అధినేతల శైలిని దగ్గరగా పరిశీలించి, వాటిని సమగ్రంగా, సూటిగా, నిర్మొహమాటంగా విశ్లేషించగల ‘వశిష్ట పాత్రికేయులు’ పూల విక్రమ్. అనేక పత్రికల్లో పలువురు పాత్రికేయ శిఖరాల వద్ద పనిచేసిన సుదీర్ఘ అక్షరానుభవం ఆయన సొంతం. ఆయనతో నాకు మూడు దశాబ్దాల పరిచయం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం దళపతి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా విక్రమ్ రాసిన వ్యాసమిది. కంభంపాటి రామ్మోహన్‌రావు రాసిన ‘నేను-తెలుగుదేశం’ పుస్తకావిష్కరణకు వచ్చిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి, తన ప్రసంగంలో చంద్రబాబులోని ప్రజాస్వామ్యవాది గురించి చేసిన విశ్లేషణ.. పూల విక్రమ్ గారి కధావస్తువు, ప్రేరణ కావడం చూస్తే.. నిఖార్సయిన జర్నలిస్టుకు ఎంత నిశిత పరిశీలన ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమానికి నేనూ హాజరయ్యా. అందుకే ఇది సందర్భం.
– మార్తి సుబ్రహ్మణ్యం)
రాజకీయ నాయకుల వ్యక్తిత్వాల్ని, వ్యవహారశైలీ విధానాలను పోల్చి అంచనా వేయడానికి విమర్శకులు, విశ్లేషకులు సాధారణంగా సాపేక్ష పద్ధతినే ఎంచుకొంటారు. ప్రజలు సైతం నాయకుల్ని ఎక్కువగా ఆ కోణం నుంచే చూస్తారు. ఎన్నికల సమయంలో అందరిలోకెల్లా ఎవరు మెరుగు?’ అనే అంశం ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకొంటారు.
ఈ ఉపోద్ఘాతం దేనికంటే, తెలుగునాట పేరొందిన జర్నలిస్ట్,జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న కె. శ్రీనివాసరెడ్డి ఇటీవల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ “ఇపుడు అధికారంలో ఉన్నవారిని, గతంలో అధికారంలో ఉన్నవారిని పోల్చి చూస్తే… చంద్రబాబునాయుడు ఈజ్ ఎ గ్రేట్ డెమొక్రాట్” అని అన్నారు. కొనసాగింపుగా “ఎవరికైనా యాక్సిస్ (అందుబాటులో) ఉండే ముఖ్యమంత్రి, నేనెరిగిన చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కరే” అని కూడా వ్యాఖ్యానించారు.
తన వృత్తి జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను అతి సన్నిహితంగా గమనించిన, గమనిస్తున్న అనుభవంతో జర్నలిస్ట్ కె. శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యకు విశేషమైన రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో పరిపాలనా పద్ధతులలో, ప్రజాస్వామ్య విధానాలకు, సంప్రదాయాలకు తిలోదకాలు పలుకుతున్న నేపథ్యంలో జర్నలిస్ట్ కె శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యపై విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి పాలనలో అబ్ సొల్యూట్ టర్మ్ లో ప్రజాస్వామ్యం అడుగడుగునా కనిపించి ఉండకపోవచ్చు. కానీ, చంద్రబాబునాయుడి ఆలోచనలలో, ఆచరణలో, ప్రవర్తనలో, పరిపాలనలో ప్రజాస్వామ్యం ప్రస్పుటంగా కనిపించినట్లు ఆయన విమర్శకులు నేడు చెప్పడం ఓ వాస్తవం, ఓ ఆవశ్యకత, ఓ అనివార్యత.
చంద్రబాబునాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే రాష్ట్ర ఆర్థికరంగంతో సహా వివిధ రంగాల వివరాలను శ్వేతపత్రాల విడుదల ద్వారా ప్రజలకు స్పష్టంగా వివరించారు. పరిపాలనలో దాపరికం లేకుండా పారదర్శకత తేవడానికి కృషి చేశారు. అందుకోసం అన్ని రంగాలలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు తెచ్చినా అందుకు సహేతుక కారణాలను చూపారు.
దానిపై ప్రజలకు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శల్ని, ప్రశ్నల్ని ఎదుర్కొని జవాబిచ్చారు. రాష్ట్ర భ్యవిష్యత్ కోసం కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినపుడు కూడా అందులో లాభనష్టాల కూడికలు తీసివేతలు, అలాగే ఓటు బ్యాంకులను దృష్టిలో పెట్టుకోకుండా ధైర్యంగా, సాహసోపేతంగా మందడుగు వేశారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమర్ధులైన ఉన్నతాధికారుల్ని కీలకస్థానాలలో నియమించి పరిపాలన సజావుగా, వేగంగా, సమర్ధవంతంగా సాగడానికి చర్యలు తీసుకోవడం కనిపిస్తుంది. తన క్యాబినెట్ లోని మంత్రులను విశ్వాసంలోకి తీసుకొని వారికి ప్రాధాన్యత కల్పిస్తూ.. ఆయా శాఖలపై వారు పట్టు సాధించి ఫలితాలు రాబట్టేదిశగా అందర్నీ ప్రోత్సహించడం కనిపించేది. మంత్రులు స్వేచ్ఛతో పనిచేసే అవకాశం ఆయన కల్పించారన్నది ఓ వాస్తవం. చంద్రబాబునాయుడి పాలనలో రాష్ట్రంలో అంతకుముందెన్నడూ కనిపించని ఓ వినూత్న రాజకీయ సంస్కృతి కనబడేది. హంగులు, ఆర్భాటాలు, విందులు, వినోదాలు ఉండేవికావు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా పనితప్ప మరో ధ్యాస కనపడేది కాదు. ఉన్నతాధికారులతో చేసే సమీక్షలు మొక్కుబడిగా ఉండేవికావు. సమగ్ర సమాచారంతో రానివారిని చంద్రబాబు ఉపేక్షించరన్న భయం అధికారులందరితో ఏర్పడింది. దానిని భయం అనేకంటే జవాబుదారీతనం అనాలి. ప్రతి ప్రభుత్వోద్యోగిలో ప్రజల పట్ల జవాబుదారీతనం పెరిగిన దశ అది.
మంత్రులేకాదు.. శాసనసభ్యులు, ప్రతిపక్షనేతలు, వివిధ సంఘాల నేతలకు చంద్రబాబునాయుడిని తరచుగా కలుసుకొనే వెసులుబాటు ఉండటం వల్ల.. వారు క్షేత్రస్థాయి ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని సత్వరం పరిష్కరించుకొనేందుకు కృషి చేసేవారు. వివిధ అంశాల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించడానికి తరచుగా అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసేవారు. తమకంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతలే ముఖ్యమంత్రిని కలిసివస్తున్నారని కూడా అధికార పార్టీ నేతలు అనుకొనేవారు. అసెంబ్లీ సమావేశాలు క్రమం తప్పకుండా జరగడమేకాదు.. ఎంతో సీరియస్ గా సాగేవి. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ నిర్ణయించిన అంశాలనే కాకుండా ఇతరత్రా ప్రజాసమస్యల పై అత్యవసరంగా చేపట్టవలసిన అంశాలను కూడా చర్చకు చేపట్టినట్లు అసెంబ్లీ రికార్డులు తెలియజెబుతాయి. దాదాపుగా ప్రతిరోజూ అసెంబ్లీ నిర్ణీత గడువును దాటి పనిచేసేది. ఎక్కువగా వర్కింగ్ లంచ్ తో అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగేవి. అసెంబ్లీ సమావేశాలు అర్ధరాత్రివరకు జరిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు సజావుగా పని చేశాయంటే అర్ధం – తదనుగుణంగా అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యయుతంగా నడుచుకొన్నారనే.
ప్రభుత్వానికి ప్రజలకు నడుమ పార్టీని వారధిగా చేసి ప్రజలకు ఎక్కువ మరింత మేలు చేయడం అన్నది పార్టీ ప్రజాస్వామ్యంలోని ప్రధాన లక్షణం. ఈ అంశంలో చంద్రబాబునాయుడిని మించిన మరొక నేత భారతదేశంలో కనపడరు. కొత్త పథకాల రూపకల్పనకు, అమలు జరుగుతున్న కార్యక్రమాల సమర్ధ నిర్వహణకు పార్టీ యంత్రాంగం అలోచనలను, శక్తియుక్తులను అద్భుతంగా వినియోగించుకొనే ప్రజాస్వామిక లక్షణం చంద్రబాబు సొంతం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలను, అనుబంధ సంఘాలను భాగస్వామ్యులుగా చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే ప్రక్రియను క్రియాశీలంగా అమలు చేయడం ఆయన పాలనలో మరో విశేషం. ఇక, ప్రభుత్వపరంగా చేపట్టే నియామకాలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి అత్యున్నత పదవులకు చేసే ఎంపిక ఏకపక్షంగాకాక.. పార్టీ ఫీడ్ బ్యాక్ ను అనుసరించి.. పార్టీ అత్యున్నత వింగ్ అయిన పోలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం, అందులో సామాజిక, ప్రాంతీయ సమతులత్యలు పాటించడం వంటి ప్రజాస్వామిక విధానాల్ని అనుసరించినట్లు కనబడుతుంది. నెలకొకసారి చంద్రబాబు అధ్యక్షతన జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజాసమస్యల్ని చర్చించడం, వివిధ ప్రభుత్వ పథకాలలోని మంచిచెడులు పై చర్చ జరగడం వంటి ప్రక్రియ కూడా ప్రజాస్వామ్యంలో ఓ భాగమే. ప్రజలను ప్రతిరోజూ కలవడం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు దినచర్యలో ఓ భాగంగా ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు పూర్తిచేసుకొని అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తనకోసం వేసి చూసే ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం, ఆయా విజ్ఞప్తులను మొక్కుబడిగా కాక క్షుణ్ణంగా పరిశీలించి తన కార్యదర్శి ద్వారా సంబంధిత శాఖలకు పంపడం జరిగేది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రతిరోజూ సగటున కనీసం ఓ వెయ్యి మందిని కలుసుకొనేవారని పత్రికలు పేర్కొనేవి. అలాగే, ఆయన తరచుగా చేసే జిల్లాల పర్యటనలలో కూడా అక్కడి ప్రజలను, పార్టీ నేతలను కలవడం ఆయన విధుల్లో భాగంగా ఉండేది.
ఇక మీడియా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుకు లభించిన పేరు దేశంలోనే వేరొక సీఎంకు లేదనడం అతిశయోక్తి కాదు. చంద్రబాబునాయుడు తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను, పార్టీ చేపట్టే కార్యక్రమాలను విపులంగా చెప్పేవారు. తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పడం ఆయన ఉద్దేశంగా ఉండేది. ఆ క్రమంలో మీడియా ప్రతినిధులు ఎటువంటి చిక్కు ప్రశ్నలు సంధించినా చిరాకుపడటం, వారిపట్ల అసహనం ప్రదర్శించడం ఎన్నడూ చేయలేదు. అటు సచివాలయంలోనో, ఇటు పార్టీ కార్యాలయంలోనో దాదాపుగా ప్రతిరోజూ మీడియా ప్రతినిధులు ఆయనను కలుస్తూనే ఉండేవారు. రెండు, మూడు పత్రికలు పనిగట్టుకొని తన ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసినా.. ఎన్నడూ ఆయన సదరు పత్రికల అధిపతుల్ని లేదా వాటి ప్రతినిధుల్ని కించపరుస్తూ మాట్లాడినట్లు కనపడదు. అంతేకాదు.. ఓ సందర్భంలో తన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న డాక్టర్ ఎన్. శివప్రసాద్.. అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎం. సత్యనారాయణరావును ఉద్దేశించి ఓ అపార్లమెంటరీ పదం ఉపయోగించారని మీడియా ప్రతినిధుల ద్వారా తెలుసుకొని, అదేరోజు డాక్టర్ శివప్రసాద్ తో ఆ మాటలను ఉపసంహరించుకున్నట్లు చెప్పించి రాజకీయాల హుందాతనాన్ని కాపాడారు.
బషీర్ బాగ్ లో ఉద్యమకారులపై కాల్పులు జరిపించారని చంద్రబాబును తరచుగా రాజకీయ ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఆరోజు ఉద్యమకారులు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’కి పర్మిషన్ ఇవ్వొద్దని ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించాయి. అయితే, ఉద్యమకారులకు ఉన్న నిరసన తెలిపే హక్కును కాలరాయడం మంచిదికాదనే ఉద్దేశంతో.. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకొని ఆ కార్యక్రమానికి అనుమతి మంజూరు చేశారు. అయితే, ఇందిరా పార్క్ నుంచి టాంక్ బండ్ వరకు వెళ్లడానికి మాత్రమే ఉద్యమకారులకు అనుమతి ఉన్నప్పటికీ.. దానిని అతిక్రమించి వారు అసెంబ్లీ వైపు దూసుకుపోతున్న క్రమంలో బషీర్ బాగ్ వద్ద వారిపై పోలీసు కాల్పులు జరిగాయి. దీనిని ఎవరూ సమర్ధించరుగానీ… ఇప్పటిలా నిరసన తెలియజేయడానికి కూడా ఉద్యమకారులను అనుమతించకుండా హౌస్ అరెస్టులు చేసేవిధానాన్ని అనుసరించి ఉంటే ఆ దుర్ఘటన జరిగి ఉండేది కాదేమో!
అలాగే, తమ పార్టీని రక్షించుకోవడానికి ఎన్టీఆర్‌ను దించివేసిన సంఘటనను చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధులు ‘వెన్నుపోటు’గా అభివర్ణిస్తుంటారు. తనను వెనుక నుంచి కత్తితో పొడిచిన బ్రూటతో జూలియస్ సీజర్ “నువ్వు కూడానా బ్రూటస్” (యు టూ బ్రూటస్) అని అన్నప్పుడు బ్రూటస్ ఇలా అంటాడు “నేను నిన్ను ప్రేమించడం లేదని కాదు. కానీ.. నీ కంటే ఎక్కువగా రోమ్ ప్రజలని” (ఇట్ ఈజ్ నాట్ దట్ ఐ ల యూ.. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ లవ్ రోమ్ మోర్ దెన్ యూ) అని అంటాడు. చరిత్రలో కొన్ని వాస్తవాలు పాక్షికంగానే కనిపిస్తాయి. ఆనాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడం అన్నది ఓ అనివార్యమైన సంఘటన అని అందరికీ తెలిసినప్పటికీ రాజకీయంగా దెబ్బతీయడానికి చంద్రబాబునాయుడును ప్రతిపక్షాలు ఆ సంఘటనను ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అర్ధసత్యాలే సత్యాలుగా చెలామణి అవుతుంటాయి. అది చరిత్రకున్న లక్షణం.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఆయన పరిపాలన మొత్తం పూర్తి ప్రజాస్వామ్యయుతంగా జరిగి ఉండకపోవచ్చు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుకే అది సాధ్యపడలేదు. అయితే, తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరిలో జర్నలిస్ట్ కె. శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు నారా చంద్రబాబునాయుడు ఓ ప్రజాస్వామ్యవాది. ఇది వాస్తవం. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోతుందా?.