– విద్యార్థులు కృషి,పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్.
కాజులూరు : విద్యార్థులు కృషి పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించి, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శుక్రవారం కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు దాత, క్షత్రియ పరిషత్ సభ్యులు జంపన శ్రీనివాసరాజు సమకూర్చిన రూ. 3 లక్షలతో నూతనంగా నిర్మించిన భోజనశాల, సరస్వతీ దేవి విగ్రహాన్ని విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు మంచి క్రమశిక్షణతో, ఉత్తమ విద్యతో, ప్రణాళికలతో లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక విద్య విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం గొప్ప కలలను కని వాటి సాకారానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యుత్తమ బోధన, మెరుగైన సౌకర్యాలు అందించేందుకు విశేష కృషి జరుగుతుందన్నారు.
రూ. 3 లక్షలు వెచ్చించి విద్యార్థుల కోసం భోజన శాల నిర్మించిన క్షత్రియ పరిషత్ సభ్యులు జంపన శ్రీనివాసరాజును మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వానికి దాతల సహకారం తోడైతే విద్యారంగం మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను అన్ని విధాలుగా ప్రగతి పథంలో నడిపిస్తుందన్నారు.
అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ కు అనుకుని ఉన్న చెరువును ఆట స్థలంగా అభివృద్ధి చేయాలని, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి డేవిడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంసన్, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.