– ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పరికరాలు అందిస్తాం
– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం : సర్వ శిక్షా అభియాన్( ఎస్ ఎస్ ఏ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లోని మానసిక దివ్యాంగ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించి తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. శుక్రవారం రామచంద్రపురం లోని భవిత కేంద్రాన్ని మంత్రి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మానసిక విద్యార్థుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను భవిత విద్య ఉపాధ్యాయులు మోర్త బాబు, చామర్తి నాగమణి లను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి సుభాష్ మాట్లాడుతూ భవిత కేంద్రంలో ఉన్న విద్యార్థుల కోసం త్వరలోనే సి ఎస్ ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు ద్వారా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీకు అవసరమైన పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం రెండు ఆటోలు కొనుగోలు చేసి రవాణా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పుట్టుకతో ప్రత్యేక అవసరాలు కలిగిన భవిత విద్యార్థులను పూర్తిగా సంరక్షిస్తామని మంత్రి సుభాష్ అన్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ లు వీర రాఘవరెడ్డి, వాసంశెట్టి నాగేశ్వరీలు భవిత కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. రామచంద్రపురం నియోజవర్గంలో మండలానికి ఒకటి చొప్పున 3 భవిత కేంద్రాలు ఉన్నాయన్నారు. రామచంద్రపురం మండలంలో 173 మంది మానసిక దివ్యాంగ విద్యార్థులను(ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు) గుర్తించామని, వీరిలో 50 మంది భవిత కేంద్రంలో ఉన్నారని, మిగిలినవారు ఆయా స్కూళ్లలో ఉన్నారన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం మానవతా దృక్పథంతో సహకరించేందుకు ముందుకు వచ్చిన మంత్రి సుభాష్ కు ఎంఈఓ లు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.