– రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు..
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి చివరకు వారిని నట్టేట ముంచాయి. తాజాగా ఆ లిస్టులోకి మరో కంపెనీ యాడ్ అయ్యింది. మాదాపూర్ లో ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ పేరిట ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ అవుతుంది. ఉద్యోగం లేనివారికి మంచి అవకాశమని, రెండు లక్షలు కడితే జీవితం సెట్ అవుతుందని నిరుద్యోగులను నమ్మించారు.
ఇక వారు కూడా మంచి కంపెనీ అని నమ్మి రెండు లక్షలు కట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కంపెనీ రెండు నెలలు వారికి ఎటువంటి అనుమానము రాకుండా జీతాలు ఇచ్చింది. ఇక రెండు వారాల క్రితం ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ తమ అధికారిక వెబ్సైట్, మెయిల్స్ ను బ్లాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఉద్యోగులు వెంటనే ఏమైందో అని ఆరాతీశారు.
అయితే అప్పటికే కంపెనీ తట్టాబుట్టా సర్దుకొని చెక్కేయడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 800 మంది ఉద్యోగులు నడిరోడ్డుపై పడ్డారు. సంస్థపై ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని సోమవారం వారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో ఈ విషయం బట్టబయలు అయ్యింది.