Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పాల‌న‌లో అడుగ‌డుగునా అన్యాయం

– ధాన్యం రైతులకు రూ.1,250 కోట్ల బ‌కాయిలు
– మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లయిస్ విభాగానికి ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు నెలలుగా బకాయిల చెల్లింపులను నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1250 కోట్లు రైతులకు చెల్లించాల్సిన బాయిలను పెండింగ్‌లో పెట్టి, యోగా డే వంటి పబ్లిసిటీ ఈవెంట్‌లకు రూ.వందల కోట్లు ప్రభుత్వం దారాళంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. విక్రయించిన ధాన్యంకు గానూ 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామన్న సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట ఏయ్యిందని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే…

రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా, ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా కూటమి ప్ర‌భుత్వం వేధిస్తోంది. పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదు­ర్కొంటున్నారు. రైతులన్నా, వ్యవ‌సాయ‌మ‌న్నా చంద్ర‌బాబుకి అస‌హ్యం. ఆయ‌న దృష్టంతా రికార్డుల పేరుతో పబ్లిసిటీ చేసుకోవ‌డం పైనే ఉంటుంది. రైతుల ధాన్యం డ‌బ్బులు చెల్లించ‌డానికి మీన‌మేషాలు లెక్కిస్తున్న ఈ ప్ర‌భుత్వం, యోగాంధ్ర పేరుతో ఒక్క‌రోజులో రూ. 300 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు. అమ‌రావ‌తికి మ‌ళ్లీ మళ్లీ శంకుస్థాప‌న‌ల పేరుతో రూ.700 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇప్పటివరకు రబీలో రెండు లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు రూ.1,250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది.

LEAVE A RESPONSE