అదేమిటోనండీ… కోడిగుడ్డును శాకాహారం అని అంటూ ఉంటారు. నేను కూడా అలానే భావిద్దాం అని అనుకుంటాను గానీ, ఆ గుడ్డు పైపొరను పగలగొట్టుకొని అలా ఒక తలకాయ్ బైటకి పొడుచుకువచ్చి దాని చిన్ని చిన్ని రెక్కలతో చిట్టి పొట్టి కాళ్ళతో గెంతులేసుకుంటూ పెరిగి పెరిగి పెద్దదై పందెపు పుంజుగానో, గుడ్లు పెట్టే పెట్టగానో ఎదిగిపోతోంది. అప్పుడు దాని పీకను లటుక్కున పట్టుకుని చటుక్కున తిప్పేసి ఈకలు పీకి ముక్కలు కోసి మసాలా పెట్టి వండుకు తింటే మాత్రం ‘నువ్వు మాంసాహారం తింటున్నావ్’ అంటారేమిటో!
అందుకే, అలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ కోడి గుడ్డుతో ఎంచక్కా ఆమ్లెట్ వేసుకుంటాను.
కోడిగుడ్డు శాకాహారం అని నిరూపించడానికి కొందరు ‘మేము మా కోడికి కేవలం శాకాహారమే ఇస్తున్నాం కనుక, అది పెట్టే గుడ్డు కూడా శాకాహారమే!’ అని అనడం ఎంతో హాస్యాస్పదం.
నిజానికి చేపలు, కోళ్ళు, మేకలు వంటి వాటిలో వున్నట్లు మాంసం, కండ వంటివి ఏమీ గుడ్డులో ఉండకపోవడంతో దీనిని శాకాహారంగా పేర్కొనడం జరిగింది.
మరయితే, ‘కోడి గుడ్డు మాత్రమే శాకాహారమా లేకపోతే అన్ని జీవాల గుడ్లూ ఇలానే శాకాహారమా’ అనేది తెలుసుకుంటే అప్పుడు ‘పాపం పసివాడు’ సినిమాలో పిల్లవాడు ఆస్ట్రిచ్ గుడ్డుని ఆమ్లెట్ వేసుకుని తిన్నట్లు ఇంట్లో అందరం నిప్పు కోళ్ళను పెంచుకుని వాటి గుడ్లను తింటే సరిపోతుంది. ఎందుకంటే, ఆ ఒక్క గుడ్డు పాతిక కోడి గుడ్లతో సమానం!
అదే సమయంలో మరికొన్ని ప్రాణుల గుడ్లతో జాగ్రత్తగా కూడా ఉండాలి.
నాకైతే, కోడి గుడ్డు శాకాహారం అని అనడంలో ఒక గొప్ప మార్కెటింగ్ వ్యూహం వుందని అన్పిస్తోంది. భారతదేశంలో వారం పొడవునా అందరూ గుడ్లను తినేలా ప్రోత్సాహించడానికి ఇలా చెప్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోనే అత్యధికంగా 38% శాతం మంది శాకాహారులు వున్నారు.
వీళ్ళలో మళ్లా రెండు రకాలున్నారు. పూర్తి శాకాహారులు. పాక్షిక శాకాహారులు. పూర్తి శాకాహారులతో మనకి పని లేదుగానీ, ఈ పాక్షిక శాకాహారుల విషయానికి వస్తే, వాళ్ళలో ఒక్కో ప్రాంతంవారూ ఒక్కొక్క రకమైన సెంటిమెంట్ ను కలిగి వుంటారు. ఉదాహరణకు కొందరు శివుడికి మొక్కుకొని సోమవారం మాత్రం నాన్ వెజ్ తినకపోతే కొందరు శనివారం వెంకన్నస్వామికి దణ్ణమెట్టుకుని మాంసం ముట్టరు.
ఇలా ఎవరికి తోచినట్లుగా వారు వారంలో రోజులని పంచుకుని ఆ రోజులలో శాకాహారులుగా బ్రతికేస్తూ మాంసాహారం తినేరోజు ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తూ వుంటారు. చాలామందికి ఆదివారం అంటే భలే ఇష్టం. సెలవు దినం కావడంతో ఆరోజున చికెన్, మటన్, బీఫ్, పోర్క్ షాపుల ముందు మామూలు జాతర వుండదు.
ప్రజలు మాంసాహారాన్ని తినకుండా ఇన్ని రకాల ఆంక్షలు పెట్టుకుంటే సేల్స్ పడిపోతాయి కదా! గుడ్డు పెట్టే కోడికి నొప్పి తెలుస్తుందో లేదోగానీ, ఆ గుడ్డుని కొనేవాడు లేకపోతే అమ్మేవాడికి బాగా నొప్పి పెడుతుంది.
మరో కోణంలో చూస్తే, కోడి గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో ఎన్నో రకాల ప్రొటీన్లను, విటమిన్లను శరీరానికి అందిస్తుంది.
గుడ్డు ద్వారా మనకందే పోషకాలను వివరంగా చూస్తే —
క్యాలరీలు: 70-80, ప్రోటీన్లు : 6 గ్రాములు, క్రొవ్వులు: 5 గ్రాములు, కొలెస్టిరాల్: 190 గ్రాములు, నీరు: 87%, గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.
అలాగే, కోడి గుడ్డుని తినడం వలన కలిగే ఉపయోగాలను చూద్దాం:
* కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
* గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.
* బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు… అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు.
* గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనం వల్ల వెల్లడయ్యింది. వాస్తవంగా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపో వటం లేదా గుడెజబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.
* మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్ ప్రాత్ర వహిస్తుంది.
* గుడ్డులో ఉన్న ఐరన్ శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్ర్తీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
* గుడ్డును ఆహారంగా తీసుకోవటానికి, కొలెస్టరాల్‌కి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టరాల్ పెరుగుతుందని తేలింది.
* స్ర్తీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో… వారంలో 6 రోజులు గుడ్డు ఆహారంగా స్ర్తీలకు ఇచ్చారు… అప్పుడు వారిలో రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం 44 శాతం తగ్గినట్లు తేలినది.
* గుడ్డు వలన శిరోజాల ఆరోగ్యం పెరుగుతాయి. గుడ్డులో ఉన్న సల్ఫర్, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.
* గుడ్డులోని ప్రోటీన్ల వల్ల యవ్వనంలో కండరాలకు బలం, చక్కని రూపం ఏర్పడుతుంది.
* ఎదిగే పిల్లలకి గుడ్డు మంచి పౌష్టికాహారం. దీర్ఘకాలిక వ్యాధుల వలన త్వరగా శరీరం అలసిపోకుండా త్వరగా బలం చేకూరడానికి ప్రతి రోజూ గుడ్డుని తినమని డాక్టర్లు చెబుతారు.
ఐతే, పాక్షిక శాకాహారులు వారాలు పాటిస్తూ రోజూ గుడ్డుని తినిపించకపోతే అది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని భావించి ‘కోడిగుడ్డు శాకాహారం’ ‘రోజుకో గుడ్డు – వెరీ గుడ్డు’ అనే నినాదాలను ముందుకు తీసుకొచ్చారు.
కోడి గుడ్డు శాకాహారం అన్నది కేవలం వ్యక్తిగత భావనే తప్ప అందులో నిజం లేదు. రోజుకొక కోడి గుడ్డుని ఎందుకు తినాలో పెద్దలకి, పిల్లలకి అర్ధమయ్యేలా చెప్తే అప్పడు వాళ్ళే కచ్చితంగా తింటారు. ఇలా అబద్ధాలను మాత్రం ఎప్పుడూ ప్రచారం చెయ్యకూడదు.
– వికటకవి శ్రీనివాస్