మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని జబ్బలు చరుచుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం దగ్గర అప్పు పుడితే చాలు సంస్కరణల పేరుతో రైతులకు ఉరితాళ్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర సంవత్సరాల క్రింద అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి ఆర్థిక, సాంకేతిక, సుస్థిరమైన శక్తివంతమైన సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలి అన్న మాటలకు విరుద్ధంగా పనిచేస్తున్నది.
మొదట్లో మేకపోతు గంభీర్యం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలల్లో భాగమయ్యింది. నిర్దేశిత మూడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి, మధ్యప్రదేశ్ తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తద్వారా జీఎస్‌డీపీలో 0.15 శాతం మేర అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందింది.
కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జీఎస్‌డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు పరిమితిని పెంచింది. అయితే ఇందులో 1 శాతానికి షరతులు విధించింది. పౌర కేంద్రీకృత సంస్కరణలు అమలు చేస్తే ఈ 1 శాతం రుణ పరిమితినీ వాడుకోవచ్చని పేర్కొంది. విద్యుత్ సంస్కరణలు మూడింటిలో ఒకటైన విద్యుత్ సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీని 2020 డిసెంబర్ 31లోపు ఒక్క జిల్లాలోనైనా పూర్తి చేస్తే జీఎస్‌డీపీలో 0.15 శాతం మేర అదనపు రుణాలకు అర్హత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్కరణను అమలు చేసింది.
2020 సెప్టెంబర్ నుంచి విద్యుత్ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని జిల్లాల్లో ఇలాగే అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఏపీతోపాటు పది రాష్ట్రాలకు అదనంగా అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది.
విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించింది. మొత్తంగా పది రాష్ట్రాలకు రూ. 28,204 కోట్లు అదనపు అప్పులు చేయడానికి అనుమతి ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఎప్ఆర్‌బీఎం పరిమితి అరశాతం పెంచినట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. అదనంగా అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా, విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సుమారు 25వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ తాము కేంద్ర విద్యుత్ సంస్కరణలను అమలు చేయలేమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అదనంగా అప్పులు చేసుకునేందుకు అనుమతిచ్చిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేదని తెలుస్తోంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు ముందుకు రాని రాష్ట్రాలకు రుణాలివ్వడం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఆదేశించింది. తెలంగాణ జెన్‌కోకు జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుత్ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ)ల నుంచి రూ.20 వేల కోట్ల రుణాల పంపిణీ నిలిచిపోయింది.
కేంద్ర ప్రభుత్వ నూతన సంస్కరణలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు అందుతుండడంతో ఈ సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రుణాల కోసం ఈ నిబంధనలు తప్పనిసరిగా మారాయి. ఇన్నాళ్లు రైతులకు ఉచిత విద్యుత్ అందగా కేంద్ర సంస్కరణలతో మోటార్లకు మీటర్లు బిగించనున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్‌కు ఇక నుంచి లెక్క పక్కా కానుంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ లెక్కను తేల్చేపనిలో నిమగ్నమయ్యాయి.
ఇప్పటికే వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ అందించే ట్రాన్స్‌ఫార్మర్‌లకు మీటర్ల బిగింపు కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బోర్లకు మీటర్లను బిగిస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందా? లేదా? మీటర్లు బిగిస్తే రైతులు బిల్లులు చెల్లించాల్సిందేనా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లకు మీటర్లు బిగిస్తే ఒక్కో బోరు మోటారు ఎంత విద్యు త్‌ను వినియో గిస్తోందన్న లెక్కలు తేలడంతో పాటు అందుకు సంబంధించిన బిల్లులు సైతం రానున్నాయి. దీంతో రైతులకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. గతంలో 2004కు మునుపు రైతులు సర్‌చార్జీలు, ఇతర చార్జీలను వ్యవసాయ బోర్లకు చెల్లించేవారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ పేరిట అన్నింటినీ మాఫీ చేసింది.
2004 నుంచి ఇప్పటి వరకు రైతులకు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతూ వస్తో ంది. వ్యవసాయ బోర్లకు రైతులు నయా పైసా చెల్లించకుండా పంటలు పండించుకుంటున్నారు. కానీ, అలాంటిది తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ట్రాన్స్‌ఫార్మర్‌లకు మీటర్లను బిగించే ప్రక్రియ మొదలై రైతులకు ఇబ్బందిక రంగా మారుతోంది. ఈ కొత్త నిబంధనలు ఉచిత విద్యుత్‌కు దూరం చేస్తా యా? అన్న సందేహాలను కలిగిస్తున్నాయి. కేంద్రం తానా అంటే రాష్ట్ర ప్రభుత్వం తందానా అంటున్నది. రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేయకుండా బిల్లులభారం తప్పదని ప్రజలు గ్రహించాలి. మీటర్ల బిగింపు ప్రక్రియ మొదలు కావడంతో రైతుల్లో దడ మొదలైంది.
అయితే, ఉచిత విద్యుత్‌కు బ్రేకులు పడితే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఎంతైనా ఉంది. బీజేపీ ప్రభుత్వం గద్దె నెక్కేందుకు బూటకపు హామీలు ఇచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా నడుచుకుంటుంది. పెట్రోలు, డీజిల్, రవాణా రేట్లు, వ్యవసాయ పెట్టుబడి రెట్టింపు అయ్యాయి, దిగుబడి, గిట్టుబాటు ధరలు తగ్గాయి. రాబోయే రోజులలో వ్యవసాయం కష్టంగా మారనున్నది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మరోవైపు అతివృష్టి అనావృష్టితో పంట నష్టం ఎక్కువగా ఉంది, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించేందుకు సిద్ధమవ్వడం దుర్మార్గమైన చర్య. రైతులు వినియోగించే విద్యుత్‌కు అయ్యే ఖర్చును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. రైతులకు 9 గంటలు విద్యుత్ అందించాల్సిందిపోయి, 7 గంటలు మాత్రమే అందిస్తున్నారు. రైతులు విద్యుత్ సంస్కరణలు క్షున్నంగా అధ్యయనం చేసి వాటిని ఉపసంహరించుకునే వరకు ఉద్యమ బాట పట్టాలి.