(బీఆర్కే)
‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడో గొప్పోడ’దన్నది.. పిఠాపురం ఎమ్మెల్యే కమ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన, ‘అత్తారింటికి దారేది’ సినిమా డైలాగ్. మరిప్పుడు అదే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆ సూత్రం పాటిస్తారా? లేదా? ఇదీ ఇప్పుడు హాట్‌టాపిక్.
నిజానికి కూటమి అధికారంలోకి వచ్చాక.. టీడీపీ నాయకత్వం-నాయకులకు సమన్వయం నెరిపి, ఎన్నికల ముందు కీలక ఆపరేషన్లు చేసిన చంద్రబాబు రాజకీయ కార్యదర్శి టిడి జనార్దన్‌కు, పవన్‌కు సీటు త్యాగం చేసిన మాజీ వర్మకు, జగన్‌పై ఐదేళ్లు అలుపెరుగని పోరాటం చేసిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు, కాపులలో ఇమేజ్ ఉన్న వంగవీటి రాధాకు, టికెట్ దక్కకుండా పోయిన దేవినేని నెహ్రుకు పదవులతో పెద్దపీట వేస్తారని క్యాడర్ ఆశించింది. కానీ తొమ్మిదినెలలయినా వీరికి న్యాయం జరిగింది లేదు.
గుడ్డిలో మెల్ల మాదిరిగా.. అసలు టీడీపీ-జనసేన కంటే ముందుగానే, జగన్ సర్కారుపై ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన రఘురామకృష్ణంరాజుకు, మంత్రి లేదా స్పీకర్ పద వి ఇస్తారని ఆశించినప్పటికీ, డిప్యూటీ స్పీకర్‌తో సరిపెట్టారు. ఫలితంగా వీరిపై మరింత సానుభూతి పెరిగింది. అందువల్లనే వీరు ఎక్కడకు వెళ్లినా జనం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.
అయితే వీరందరిలో అందరికంటే ఎక్కువ సానుభూతి పొందుతున్న నేత పిఠాపరం వర్మ. నిజానికి కూటమి గెలిచిన స్వయంగా పవన్ చొరవ తీసుకుని, తానే అన్నట్లు.. పిఠాపురంలో తన విజయానికి దోహదపడ్డ వర్మకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తారని చాలామంది ఆశించారు. కానీ ఇప్పటివరకూ అది జరగకపోగా, ఆయన తన సోదరుడికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు. అప్పటి వరకూ బాగానే ఉంది.
కానీ నాగబాబు ఒక సందర్భంలో వర్మ నుద్దేశించి ‘వాళ్ల ఖర్మ’ అంటూ చేసిన వ్యాఖ్య మాత్రం, వర్మకు ప్రత్యర్ధుల్లోనూ సానుభూతి సంపాదించి పెట్టింది. మళ్లీ తాజాగా నాగబాబు పిఠాపురం పర్యటనలో టీడీపీ-జనసేన కార్యకర్తల బాహాబాహీ. తర్వాత టీడీపీ కార్యకర్తలపై కేసులు. మరిప్పుడు వర్మ ఏం చేస్తారు? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ మాదిరి తగ్గుతారా? సమయస్ఫూర్తికి బదులు సమరం సాగిస్తారా? దానివల్ల ఆయన సాధించేదేమిటి? కోల్పోయేదేమిటి? ఇప్పుడు పిఠాపురం వ ర్మ కేంద్రంగా జరుగుతున్న చర్చ ఇది.
నేరుగా కాకున్నా.. పరోక్షంగానైనా పిఠాపురం వర్మ.. జనసేనానితో యుద్దానికి కాలు దువ్వుతున్నట్టే కన్పిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు.. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు.
కానీ పవన్ కల్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో.. అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్దానికి దిగేటంతటి రేంజీకి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.
దాదాపు ఇదే రకమైన అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే వర్మ విషయంలో టీడీపీ అధిష్టానం.. కేడర్లో సాఫ్ట్ కార్నర్ నెమ్మదిగా తగ్గుతోందనే చర్చ మొదలైంది.
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా.. ఒకసారి.. రెండుసార్లు వరకు ఫర్వాలేదు కానీ.. ప్రతి విషయంలోనూ అదే పనిగా పిఠాపురంలో జనసేనను వెంటాడుతూ రాజకీయం చేస్తే.. అధిష్టానం కూడా సీరియస్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన వర్మ.. ఇగోలకు పోతున్నారా..? లేక పక్కనున్న వాళ్లు ఎవరైనా రెచ్చగొడుతున్నారా..? అనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయాలను విశ్లేషిస్తే.. వర్మ సైలెంటుగా ఉండడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే మంచిదంటున్నారు. ప్రస్తుతానికైతే.. టీడీపీ-జనసేన విడిపోవడమనేది కలలో మాట. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో మళ్లీ వర్మకు సీటు దక్కడం కూడా కలేనని చెప్పాలి. ఒకవేళ టీడీపీ-జనసేన విడిపోయి.. వర్మ ఆశించినట్టు టిక్కెట్టు దక్కినా.. అక్కడి నుంచి పోటీ చేసే పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించ లేరు.
నా బలం సంగతి తెలీదా.. ఇండిపెండెంటుగా గెలిచిన వ్యక్తిని అని వర్మ భావిస్తే.. అది పప్పులో కాలేసినట్టేనని అంటున్నారు. ఇండిపెండెంటుగా అంతగా బలం లేని నాటి టీడీపీ అభ్యర్థిని ఓడించి.. తాను గెలవడం వేరు.. పవన్ను ఓడించడం వేరనే విషయాన్ని వర్మ గుర్తించకుండా.. తనకేదో అపారమైన బలం ఉందని అంచనా వేసుకుంటే ఎలాగనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఒకవేళ వర్మ అంచనా వేసుకున్న విధంగా బలమున్నా.. అది పవన్ కళ్యాణ్ను ఓడించడానికి సరిపోతుందేమో కానీ.. తాను గెలవడానికి ఎంత మాత్రమూ కలిసి రాదనేది ఖాయం అంటున్నారు. అసలు వర్మ పొలిటకల్ ఫ్యూచర్ బ్రైటుగా ఉండాలంటే పిఠాపురం రాజకీయాల నుంచి వర్మ నిష్క్రమించడం బెటర్ అంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితులకు తగ్గట్టు తెలివిగా వ్యవహరించకుండా.. మొండిగా వర్మ వెళ్లడం కరెక్ట్ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇక పార్టీలో కూడా వర్మ వైపు బలంగా నిలబడే వారు ఎవరైనా ఉన్నారా..? వర్మ ఫీలింగ్సును అధిష్టానం వద్ద ప్రస్తావించి.. ఒప్పించే వారు ఎవరైనా ఉన్నారా..? అంటే లేరనే సమాధానమే వస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో వర్మకు అండగా నిలిచి.. వర్మకు అధిష్టానం వద్ద ఓ ఇమేజ్ వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడు చాలా ప్రధాన పాత్ర పోషించారు.
ఇప్పుడు యనమలకు కూడా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ టైంలో వర్మ రాజకీయ ప్రాప్తకాలజ్ఞతను ప్రదర్శించకుండా మొండిగా పోతే ఎలాగనేది ఓ చర్చ. ఏదో ఓసారి ఇండిపెండెంటుగా గెలిచినంత మాత్రాన మళ్లీ స్వతంత్రంగా పోటీ చేస్తా.. గెలిచేస్తాననేది కేవలం అపొహేనంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయి.
అప్పటికే వర్మ టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి.. అక్కడి నుంచి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచారు. అదే వర్మ 2019 ఎన్నికల్లో ఓడిపోలేదా..? అంటున్నారు. వర్మకు అంత బలమే ఉంటే.. 2019 ఎన్నికల్లో కూడా గెలిచి ఉండాల్సింది కదా అంటున్నారు.
23 మంది గెలిచినప్పుడు.. వర్మ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా వర్మ మంచి లీడరే.. కానీ టీడీపీ అనే ప్లాట్ ఫారం ఉండి తీరాల్సిందేననే విషయాన్ని గుర్తెరిగి రాజకీయం చేయాల్సిన అవసరం వర్మకే ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. వర్మ తెలివిగా ఆలోచిస్తే.. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా ఉండే వాటిని ఎంచుకుని.. అక్కడ టిక్కెట్ సంపాదించుకోవచ్చు. వర్మ లాంటి లీడరుకు టిక్కెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధినాయకత్వం కచ్చితంగా అంగీకరిస్తుంది. ఈ తరహాలో ఆలోచించకుండా.. ఇగోలకు పోయి వ్యవహరాన్ని రచ్చ చేసుకుంటే నష్టపోయేది వర్మేనని గుర్తించాలనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.