– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పులివెందుల : వచ్చే విద్యా సంవత్సరం నాటికి అసంపూర్తిగా నిలిచిపోయిన తొండూరు ఎంజేపీ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు.
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పులివెందుల టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి బీటెక్ రవితో కలిసి తొండూరు ఎంజేపీ స్కూల్, బాలికల జూనియర్ కళాశాలను మంత్రి సవిత మంగళవారం పరిశీలించారు. ప్రతి భవనం, ఇతర గదులను క్షుణ్నంగా పరిశీలించారు. ఎంతమేర పనులు జరిగాయి.
నిధులు ఏ మేరకు అవసరమో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల విద్యకు అన్న ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కార్పొరేట్ కు ధీటుగా బీసీ విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యంతో ఎంజేపీ స్కూళ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
2014-19 మధ్య కాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందలున్నా, 65 ఎంజేపీ స్కూళ్లను సీఎం చంద్రబాబునాయుడు మంజూరు చేశారన్నారు. ఆనాడు మంజూరు స్కూళ్లల్లో తొండూరు ఎంజేపీ కళాశాల ఒకటన్నారు. వెయ్యి మంది విద్యార్థులు విధ్య అభ్యసించేలా విశాల ప్రాంగణంలో స్కూల్, కళాశాల నిర్మాణం చేపట్టామన్నారు. 2019 తరవాత వచ్చిన జగన్ పట్టించుకోకపోవడంతో, తొండూరు ఎంజేపీ కళాశాల అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఇదే విషయమై అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించామన్నారు.
రూ.10 కోట్లు మంజూరుకు కృషి
తొండూరు ఎంజేపీ కళాశాల పూర్తికి రూ.10 కోట్లు అవసరమని అధికారులు తెలిపారని మంత్రి సవిత వెల్లడించారు. ఇదే విషయమై సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన తొండూరు ఎంజేపీ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇటీవల అసంపూర్తిగా నిలిచిచిపోయిన కొన్ని ఎంజేపీ స్కూళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
బీసీ విద్యార్థులను గాలికొదిలేసిన జగన్
నా బీసీలు…అంటూ వెనుబడిన తరగతుల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్, వారిని పట్టించుకోవడం మానేశాడని మంత్రి సవిత మండిపడ్డారు. చివరికి బీసీ విద్యార్థులను, వారి చదువులను సైతం గాలికొదిలేశారన్నారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఎంజేపీ స్కూళ్లు నిర్మాణ పనులు పూర్తి చేయకుండా పట్టించుకోలేదన్నారు.
సొంత నియోజక వర్గంలోని తొండూరు ఎంజేపీ కళాశాల నిర్మాణం కూడా పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, రోడ్లు భవనాల శాత ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈ మాధవి, డీఈ జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ, బీసీ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.