-
సాక్షిలో ఒకే హత్యపై రెండు కథనాలు
-
తెలంగాణ ఎడిషన్‌లో భూతగాదాల్లో అల్లుడు హత్య చేశాడని వార్త
-
ఏపీ ఎడిషన్‌లో పెన్షన్ కోసం వస్తే టీడీపీ చేతిలో హత్య అంటూ కథనం
-
హత్యల్లో కూడా తేడాలుంటాయా జగనూ?
-
ఇదేనా జగన్ ఫ్యామిలీ నడిపే సాక్షి జర్నలిజం?
-
విరుచుకుపడతున్న జర్నలిస్టులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
చిన్నప్పుడు చూసిన బ్లాక్ వైట్ పౌరాణిక సినిమాల్లో.. ఆకాశం నుంచి రాక్షసులు కిందకు చూస్తూ, నరవాసన నరవాసన అంటూ.. గాలి లోపలికి పీలుస్తుంటారు. అంటే నరవాసన ఎక్కడున్నా వాలిపోతుంటారన్న మాట. సీన్ కట్ చేస్తే.. వైసీపీ నాయకులు.. ఆ పార్టీ అధినేత జగన్‌కు.. శవాలు దొరికినా.. పిల్లలు దొరికినా పండగ అన్నది విపక్షాలు, , సోషల్‌మీడియా యాక్టివిస్టులు ఇప్పటికీ సంధించే వ్యంగ్యాస్త్రాలు.
శవం దొరికితే వెంటనే అక్కడికి వాలిపోవడం, ఓదార్పుతో దానిని శవరాజకీయం చేయడం వైకాపేయులకు ‘పుట్టుక’తో వచ్చిన విద్య అని.. అసలు పెద్దాయన చావుతో పుట్టి, చిన్నాయన హత్యతో అధికారంలోకి వచ్చిన పార్టీ అన్నది, దానిపై ఉన్న ‘చెరగని’ ముద్ర.
అదే సమయంలో ఎవరైనా చిన్నారులు దొరికితే, జగనన్న కాన్వాయ్ ఆపి ముద్దులు పెట్టడం, ఆ బాలనటులేమో.. జగనన్న లేని రాజ్యంలో ఉండలేకపోతున్నామంటూ కళ్లు నులుముకుంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం ఫ్యాషయినపోయింది. అందుకే జగనన్న పర్యటనల్లో ఈమధ్య, బాలనటులకు గిరాకీ పెరిగిందన్నది ఒక టాక్. ఇక శవాలు దొరికితే వెయ్యేనుగల బలం వచ్చే వైసీపీ.. అలవాటు ప్రకారం చేసిన పొరపాటు ఒకటి బూమెరాంగయిన ముచ్చట ఇది.
ఉమ్మడి రాష్ట్రంలో సాక్షి వెలుగుచూడనంతవరకూ పాత్రికేయం మరీ నిటారుగా కాకున్నా సక్రమంగానే సాగింది. అఫ్‌కోర్స్.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ 5 వంటి మీడియా సంస్థలకు సొంత అభిప్రాయం, ప్రత్యేక కోణం, రాజకీయ పక్షపాతం ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదు. తాము కొమ్ముకాసే పార్టీలను భుజాన మోయడమో, అందుకు తమకు గిట్టని వారిని లక్ష్యంగా చేసుకుని వార్తలు రాయడమో చేసేవి తప్ప.. మరీ నైతికంగా పతనమైన సందర్భాలు లేవు. నిజానికి వాటిలో చాలావరకూ అబద్ధాలు ఉండేవి కావు. తాము అభిమానించే పార్టీ పల్లకీ మోయడం తప్ప!
కానీ వైఎస్ తనయుడు జగన్ ఏ ముహుర్తాన ‘సాక్షి’కి ఊపిరిపోశారో, అప్పటినుంచి జర్నలిజం పతనం ప్రారంభమయింది. ఫలానా మీడియా మా పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పడం మొదలయింది. ఫలానా వారు మాత్రమే అర్హులన్న సూత్రం ప్రారంభిస్తే, టీడీపీ, టీఆర్‌ఎస్ వాటిని అనుసరించడం మొదలెట్టాయి. ఫలితంగా.. ఆయా పార్టీలు నిర్వహించే ప్రెస్‌కాన్ఫరెన్సుల్లో ప్రశ్నించే వారు మాయమయ్యారు. ఒకవేళ ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేస్తే, మరుసటి రోజు నుంచి వారికీ బహిష్కరణ శిరచ్ఛేదనమే. అలాంటి దరిద్ర పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటమే విషాదం.
అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం, విపక్ష నేతగా ఉన్నప్పుడు వార్త, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలు టీడీపీ- చంద్రబాబుకి వ్యతిరేకంగా రాసేవి. కానీ ఏ సందర్భంలో కూడా చంద్రబాబు వారిని కనీసం హెచ్చరించిన సందర్భాలు లేవు. వారిని పార్టీ ఆఫీసుకు రావద్దని హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు కూడా లేవు. తమకు వ్యతిరేకంగా రాసినప్పటికీ, ఆ పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు రాసిన పుస్తకాలు ఆవిష్కరించిన రోజులూ.. ఆ ఎడి టర్లను ఇంటికి పిలిచి గౌరవించిన సందర్భాలూ లేకపోలేదు.
పైగా అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు జరిగిన సందర్భాల్లో పక్కనే ఉన్న టీడీఎల్పీకి వచ్చి కాంగ్రెస్ వార్తలు కవర్ చేసిన చాలామంది విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు భోజనం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇవన్నీ గతం. ప్రస్తుతం ఆ విలువలూ లేవు. ఆ నాయకులున్నా పాత పద్ధతులు పాటించే రోజూలూ లేవు. ఎందుకంటే.. ఇప్పుడెవరూ స్వతంత్రులు కాదు కాబట్టి! ఇప్పుడు పార్టీలు-నేతలూ సిలబస్ మార్చేశారు!
కానీ.. ఒకటి మాత్రం నిజం. సాక్షి వచ్చిన తర్వాత మీడియాలో గుత్తాధిపత్యం పోయింది. అంతకుముందు కొన్ని మీడియా సంస్థలు చెప్పిందే నిజమని నమ్మే పరిస్థితి. వాటి మెదళ్లతోనే ఆలోచించే పరిస్థితి. సాక్షి వచ్చిన తర్వాత జనాలకు రెండోవైపు వాదన కూడా వినడం అలవాటయింది. ఫలితంగా.. ఏ పత్రిక-ఏ చానెల్ ఏ పార్టీ కొమ్ముకాస్తున్నాయన్నది జనాలకు తెలిసిపోయింది. సాక్షి రాకతో జరిగిన మేలు అదొక్కటే. విలేకరి కనిపిస్తే మీది ఏ పార్టీ అని అడుగుతున్న దౌర్భాగ్యం!
ఏమాటకామాట. సాక్షి వచ్చిన తర్వాతనే, జర్నలిస్టుల వేతనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన మాట నిజం. అంతకుముందు వారి జీతాలు దారుణాతి దారుణంగా ఉండేవి. దానితో మోతుబరి మీడియా సంస్థలు కూడా, జర్నలిస్టులకు జీతాలు పెంచడం అనివార్యమయింది. ఈ ఒక్క విషయంలో మాత్రం జర్నలిస్టులు సాక్షికి రుణపడి ఉండాలి. సాక్షి వచ్చి ఉండకపోతే జర్నలిస్టులు, ఇంకా జానాబెతె్తడు జీతాలతో జీలతాలు లాగించేవారు. అది వేరే విషయం.
వైఎస్ వివేకానందరెడ్డి సొంత కుటుంబసభ్యుల చేతులో హత్యకు గురైతే.. దానిని ‘నారాసుర రక్త చరిత్ర’ అని రాసిన సాక్షి బరితెగింపు చూసి జర్నలిజం ఉలిక్కిపడింది. నిజానికి అంత దారుణమైన రాతలు గతంలో ఎవరూ చూసి ఉండరు. చివరకు వివేకా హత్యలో ఎవరి హస్తాలున్నాయన్నది.. ఆయన కూరుతు డాక్టర్ సునీత, అన్న బిడ్డ షర్మిల బహిరంగంగానే వెల్లడించారు. అది వేరే విషయం. చివరాఖరకు అందులో పనిచేసే పాత్రికేయులను సైతం, పార్టీ కార్యకర్తల్లాగా మలిచిన వైనం మరీ దారుణం. తర్వాత అదే పనిని సాక్షి ప్రత్యర్ధి మీడియా కూడా ప్రారంభించింది. ఇవన్నీ ఎవరూ చెప్పనవసరం లేని కఠోర వాస్తవాలు.
అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకు, వైసీపీకి కొమ్ముకాసిన జర్నలిస్టులకు సర్కారీ పదవులిచ్చి, జనం డబ్బును పప్పు బెల్లాల్లా దోచిపెట్టిన వైనం దాచినా దాగని నిజం. అలాంటి ధైర్యం చేసేందుకు టీడీపీకి కొన్ని వందల ఏళ్లు పట్టవచ్చు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పత్రికకు సమాచారశాఖ నిధులు అప్పనంగా దోచిపెట్టినట్లే.. తాను కూడా అదే పద్ధతిలో సాక్షికి దోచిపెట్టానని, ఇటీవల సమాచారశాఖ మాజీ బాసు విజయకుమార్‌రెడ్డి నిర్భయంగా సీఐడీకి చెప్పారట. దీన్నిబట్టి మీడియా సంస్థలు సమాచారశాఖ నిధులను ఎంత నిర్లజ్జగా భోంచేస్తున్నారో సుస్పష్టం.
ఇప్పుడు అధికారం పోయిన వైసీపీ. సాక్షి ద్వారా కూటమి సర్కారును అప్రతిష్ఠపాలు చేస్తూనే ఉంది. అది సహజం. ఎందుకంటే అది దాని బాధ్యత కాబట్టి! కానీ జరగని విషయాలను కూడా జరిగిందన్న అభూతకల్పనలు అల్లుతున్న వైనమే, విమర్శలకు-ఛీత్కారాలకు గురవుతోంది. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక హత్యోదంతమే దీనికి నిదర్శనం. ఒక హత్యను రెండు రకాలుగా రాసిన సాక్షి పత్రిక.. దాని యజమాని జగన్ ఇంకా విలువలు, విశ్వసనీయత, వంకాయలంటూ నీతిసూత్రాలు వల్లించడమే అనైతికం.
‘సాగర్‌లో కిడ్నాపయిన వ్యక్తి హత్య’ అని తెలంగాణ నల్లగొండ జిల్లా ఎడిషన్‌లో ఒక వార్త సాక్షిలో దర్శనమిచ్చింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే… పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర అనే వ్యక్తిని, పాత కక్షల కారణంగా సొంత అల్లుడు బెజవాడ బ్రహ్మం, నాగార్జున సాగర్ హిల్‌కాలనీలో కిడ్నాప్ చేసి.. మామ హరిశ్చంద్ర సొంత గ్రామమైన పశువేములలోని ఆయన సొంత పొలంలోనే హత్య చేశాడు. తర్వాత తానే తన మామ హరిశ్చంద్రను హత్య చేశానని అల్లుడు బ్రహ్మం పొలీసు విచారణలో అంగీకరించాడు. ఇదీ క్లుప్తంగా ఆ వార్త సారాంశం. ఇదంతా సాక్షి తెలంగాణ ఎడిషన్‌లో అచ్చేసిన వార్తనే.
సీన్ కట్ చేస్తే.. అదే వార్తను.. అదే సాక్షి ఏపీ ఎడిషన్‌లో ‘పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య’ పేరుతో, తెలంగాణ ఎడిషన్‌కు భిన్నంగా రాసింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే.. హరిశ్చంద్ర అనే వ్యక్తి పశువేములలో వైసీపీ నాయకుడట. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతల వేధింపులకు తాళలేక, నల్లగొండ జిల్లాలో తలదాచుకుని, నెలనెలా పెన్షన్ కోసం మాత్రం వచ్చేవాడట. ఇటీవల పెన్షన్ కోసం వచ్చిన హరిశ్చంద్రను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసి, పాశవికంగా హత్య చేశారని ఇదే సాక్షి తన కథనంలో రాసింది. ఈ హత్య వార్త తెలిసిన మాచర్ల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటిన హరిశ్చంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు ప్రాణరక్షణ లేకుండా పోయిందని టన్నుల కొద్దీ కన్నీరు కార్చారు. ఇదీ.. సాక్షిలో ఒక హత్యపై రాసిస రెండు భిన్న కథనాలు!
మరి ఇందులో తెలంగాణ సాక్షి రాసింది నిజమా? ఆంధ్రా సాక్షి రాసింది నిజమా? అంటే రాష్ట్రాల వారీగా కథనాలు మారుతుంటాయా? అన్నదే ప్రశ్న. పాఠకుల అదృష్టవశాత్తూ హతుడి పేరు మార్చలేదు. సంతోషం. ఒకవేళ ఎవరైనా తిక్కశంకరయ్య.. తాను రెండు రాష్ట్రాల్లో ఈ హత్యకు సంబంధించి వచ్చిన కథనాన్ని చదివి గందరగోళానికి గురయ్యానని, తాను మానసిక వేదన కమ్ మోసానికి గురయ్యాను కాబట్టి.. తనను మోసం చేసిన సాక్షి పై చర్యలు తీసుకోవాలని కోర్టుకెక్కినా వింతేమీ ఉండదు.
నిజానికి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది నెలల నుంచి సాక్షి వైపు చూసే పాఠకుల సంఖ్య పెరిగింది. సబ్‌స్ర్కైబర్లను పక్కనపెడతే..పాన్‌డబ్బాల్లో లూజ్ సేల్స్ బాగా పెరిగినమాట నిజం. టీడీపీ అగ్రనేతలు సహా, మంత్రుల చాంబర్లలో కూడా సాక్షి దర్శనమిస్తోంది. సాక్షిని చదవద్దని పైకి చెబుతున్న టీడీపీ నేతలే ఆ పత్రికను ఆసాంతం చదువుతున్న వాస్తవం. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు సాక్షి రిపోర్టర్లతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. ఈ పరిస్థితిలో ఇలాంటి విలువ-విశ్వసనీయత లేని వార్తలు వండివారిస్తే, ఇక సాక్షిని నమ్మేదెవరు?