Suryaa.co.in

Features

రాష్ట్ర బడ్జెట్‌లో కౌలురైతులకు భరోసా ఏదీ ?

వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులతో కౌలువ్యవసాయమే కీలకంగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయ మంటే కౌలు వ్యవసాయమే. ఈ ప్రభుత్వం ఆ దృష్టితో చూడకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఐదేళ్ల పాలనలో కౌలురైతులకు చేసిందీ చాలా తక్కువ. చేసుకున్న ప్రచారమేమో ఎక్కువ.

ఆ విషయం బడ్జెట్‌లోని అంశాలు స్పష్టంచేస్తున్నాయి. రైతుల జీవనోపాధి బలోపేతానికి, వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించడానికి తద్వారా రైతులు ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడానికి ఒక సమగ్రమైన వ్యూహాన్ని రూపొందించామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-2025 (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌) బడ్జెట్‌ను రూ.2లక్షల86వేల 389 కోట్లతో ప్రవేశ పెట్టారు. ఇందులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అనేక ప్రవచనాలు, వ్యాఖ్యానాలు, అంతులేని సామెతలతో ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు.

ధరల స్థిరీకరణనిధి, విపత్తులనిధి ఒకటేమిటి అనేక పథకాలు అమలు చేసి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని మధుర స్వప్నాలను వెల్లడించారు. పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించి వ్యవసాయానికి స్థిరమైన, సురక్షితమైన వాతావరణ కల్పించామని ప్రగల్భాలు పలికారు. అంత ఘనంగా చర్యలు చేపడితే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?. ఒకపక్క రాష్ట్రబడ్జెట్‌ ప్రవేశ పెడుతుంటే మరోపక్క అదే రోజు ముగ్గురు కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఐదేళ్లలో 4300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజధానికి ప్రాంతంలోని అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఎనిమిది మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. సత్తెనపల్లిలో నియోజకవర్గంలో 40 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. రాయలసీమ జిల్లాలో ఈ ఆత్మహత్యల కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. వైఎస్‌ఆర్‌ జలకళ పథకం అమలు చేయడంలేదు. బోర్లు వేయడం లేదు. డ్రిప్‌ సిస్టమ్‌, తదితర వాటి కోసం అధిక పెట్టుబడులు పెడుతున్నారు. ఏదో ఒక రకంగా పంటలు పండిరచాలన్న లక్ష్యంతో రైతులు అప్పులు చేస్తున్నారు.

తీరా బోర్లు పడకపోవడం, పండిన పంటకి గిట్టుబాటు ధరలు దక్కక పోవడం, వడ్డీల మీద వడ్డీలు పెరిగి సాగు భారంగా మారింది. పాల రైతులకు ఇస్తామన్న బోనస్‌ ఇవ్వక పోగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారు. పశుపోషణ దారులకు పశు నష్ట బీమా పరిహారం ఎగవేశారు. ఆక్వా రంగాన్ని పట్టించుకోలేదు. అన్ని రకాలుగా నష్ట పోతున్న రైతాంగానికి ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి తోడ్పాటు లేకపోవడంతో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది.

జాతీయ నేర గణాంకాల వివరాలు ప్రకారం దేశంలోనే రైతాంగ ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలోను, కౌలురైతుల ఆత్మహత్యలలో రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరం. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి రైతులసంక్షేమానికి, వారి ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి దయనీయమైన స్థితిలో ఎందుకు ఉందనేదీ ప్రశ్నార్థకంగా మారింది.

దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు ప్రతి రైతుకుటుంబంపైన సాగు కోసం చేసిన అప్పులు సగటున రూ.75 వేలు ఉంటే, మన రాష్ట్రంలో సగటున రూ.2.45 వేల అప్పుల్లో ఉన్నారు.

అటు రాష్ట్రంలో 80 నుంచి 93 శాతం రైతులు, కౌలురైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకపోయారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గడపగడపకు తిరిగినప్పుడు రైతుల కుటుంబాల నుంచి ఏమి అడిగి తెలుసుకున్నారో అంతు చక్కని ప్రశ్నలాగే మిగిలి పోయింది.

వాస్తవంగా వ్యవసాయ శాఖకు కేటాయించిన నిధులు ఖర్చు చేస్తున్నారా అని పరిశీలిస్తే విస్తుబోయే పరిస్థితి కన్పిస్తుంది. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ లో కేటాయించిన నిధుల్లో సుమారు రూ.26వేల కోట్లు ఖర్చు చేయలేదని వాస్తవ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వ్యవసాయ రంగానికి అధిక ప్రధాన్యత నిచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉంది.

గతేడాది వ్యవసాయ రంగానికి రూ.11,681.63 కోట్లు కేటాయించగా, రాబోయే 2024-2025 సంవత్సరానికి రూ.11,424.51కోట్లు అంటే రూ.257 కోట్లు తగ్గించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు 2024-2025లో రూ.13,552కోట్లు కేటాయించారు. ఇది గతంకంటే కొంచెం రూ.400 కోట్లు ఎక్కవ. ఈ సంవత్సరం ప్రారంభంలోని ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల సుమారు 30లక్షల ఎకరాల్లో అసలు పంటలే వేయలేదు. వేసిన 60లక్షల ఎకరాల్లో 40శాతం పంట ఎండిపోయాయి. గడ్డి కూడా మిగల్లేదు. అనేక వ్యయ ప్రయసలు పడి ఉన్న పంటను కాపాడుకున్నారు.

తీరా పంట చేతికి వచ్చే సమయానికి మించిగ్‌ తుపాన్‌ల వల్ల ఉన్న పంట అంతా ఊడ్చుకు పోయింది. రబీలో 52 లక్షల ఎకరాలు సాగు కావలసి ఉండగా 17 లక్షల ఎకరాలు బీడు భూమిగా మారింది. ఇప్పటికీ వర్షాభావ పరిస్థితి కొనసాగుతోంది. రెండు సీజన్లలో సుమారు 40 లక్షల ఎకరాల్లో పైగా పంట నష్టం వాటిల్లింది. దీంతోపాటు కల్తీ విత్తనాలు, ఎరువుల విచ్చలవిడిగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కోట్లాది రూపాయలు సాగు కోసం పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్ట పోయారు. ఇంతవరకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందలేదు.

ఈ తరుణంలో కేటాయింపులు పెంచి సాయం అందించాలేగానీ, సవరించిన అంచనాలు పరిశీలిస్తే ప్రస్తుత సంవత్సరంలో కేటాయింపులలో 80 శాతమే ఖర్చు చేశారు. వర్షాలు, వరదలు, తుపాన్‌లు, కరవు ప్రభావంతో రైతులు అల్లాడుతుంటే వ్యవసాయ వార్షిక వృద్ధిరేటు 13శాతం సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటు. సాగు తగ్గి పంట ఉత్పత్తి పడిపోతుంటే వృద్ధి రేటు ఎలా పెరుగుతుందినేది కనీసం ఆ మాత్రం అవగాహన కూడా ప్రభుత్వం లేకపోవడం ఆశ్చర్యకరం.

రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి చూస్తే మరింత దారుణంగా మారింది. కనీసం ప్రభుత్వ కొనుగోలు సంస్థలలో పంటల ఉత్పత్తులను అమ్ముకొనే వెసులుబాటూ లేదు. గుర్తింపు కార్డు లేకపోవటం, ఈ-క్రాప్‌ బుకింగ్‌ లో నమోదు కాకపోవటం వలన ఐనకాడికి తక్కువ ధరకు మధ్య దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ శాఖ నుంచి మించింగ్‌ తుపాన్‌ సూచనలు ముందస్తుగా వచ్చినప్పటికీ వెంటనే కల్లాల్లో, పొల్లాల్లో ఉన్న పంటనంత కొనుగోలు చేస్తామని, మార్కెట్‌ యార్డులకు తరలించి పంటలను కాపాడుతామని ,రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు నిబంధనలు సడలించి కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు చేతులు ఎత్తేసింది.

మధ్య దళారులకే తక్కువ రేట్లకు తెగనమ్మకున్నారు.ఇంత దోపిడీ జరుగుతుంటే కనీసం ప్రభుత్వం ఎక్కడా విచారణ చేపట్టలేదు. పైపెచ్చూ ఏ ఒక్క రైతు నష్టపోకుండా పంటలు కొనుగోలు చేశామని బుకాయించటం హాస్యస్పదంగా ఉంది.
దాదాపు ఐదేళ్లలో కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలను పరిశీలిస్తే ఖర్చుపెట్టిన కొంతమేరకైనా ఆ నిధులు సాగు చేయని భూ యజమానులు, భూస్వాములకే ఎక్కువగా తరలిపోతున్నాయి.

రైతు భరోసాను పరిశీలిస్తే ఆర్థిక శాఖ మంత్రి చెప్పినట్లు 2019 నుంచి ఇప్పుడు వరకు కేవలం లక్షా 60వేల మందికే అందించామని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. భూమి లేని కౌలురైతులే 8లక్షల పైగా ఉంటే వారి పరిస్థితి ఏమిటీ?, ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలు పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. కౌలురైతులకు మాత్రం కేవలం రూ.350 కోట్లు ఇచ్చి వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడేలా చేస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో సున్నా వడ్డీ పథకాన్ని పరిశీలిస్తే కౌలురైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలకి వడ్డీరాయితీ కింద చెల్లించిందీ…30వేల మందికి కేవలం రూ.6 కోట్లు. అంటే వడ్డీ వ్యాపారస్తుల కనుసనల్లోనే కౌలు వ్యవసాయం సాగుతుందనే విషయం అర్థమవుతోంది.

ఇన్‌ పుట్‌ సబ్సిడీ కింద రెండు లక్షల 34 వేల మందికి రూ.246 కోట్లు ఇచ్చారు. పంటల బీమా పరిహారం 3లక్షల మందికి రూ.487 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియానూ కౌలురైతులకు గుర్తింపు కార్డులు లేవని ఎగనామం పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలు లేవు సూక్ష్మ పోషకాలు గాని, పచ్చిరొట్ట విత్తనాలు గాని, వ్యవసాయ యంత్రం పరికరాలు గాని, పవర్‌ స్పేర్స్‌, టార్పాలిన్‌ పట్టాలూ ఇవ్వలేదు. రోజురోజుకు వ్యవసాయ రంగంలో సాంకేతిక ప్రాధాన్యత పెరుగుతోంది.

ఇవేమీ అందించకుండానే ప్రగతి బాటలో వ్యవసాయ రంగం ఉందని చెప్పుకోవడం ఇంతకన్నా ఘోరం మరొకటి లేదు. నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడంలోను, ప్రాజెక్టులకు నిధుల కేటాయిండలోను, వాటిని ఖర్చు పెట్టడంలోను బాధ్యతా రహితంగా వ్యవహరించింది. నిరంతరం దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిలిచిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. పోలవరం ప్రాజెక్టు అతి గతీ లేదు.

ఎంతవరకు మాటల్లో రైతుల సంక్షేమం, రైతుల అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ, స్థిరమైన ఆదాయాలు కల్పించామని భాకాలు ఊదటం మినహా, ఈ ప్రభుత్వానికి మరొకటి లేదు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనేదీ మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి. వ్యవసాయ అభివృద్ధికి, విస్తరణకు సాగునీరు ప్రాజెక్టులకు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో నిధులు కేటాయించి సక్రమంగా ఖర్చుపెట్టి వ్యవసాయంలో రైతులను నిలబెట్టి వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగాను స్థిరమైన ఆదాయాలు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

ముఖ్యంగా కౌలురైతులకు వారి దామాషా బట్టి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. కౌలురైతులకు భరోసా కల్పించాలి. వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రమైన కౌలు విధానం రూపొందించాలి. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు, మార్కెట్‌ అధికారులతో గ్రామస్థాయిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి.

పి.జమలయ్య
ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం
9490098050

LEAVE A RESPONSE