Suryaa.co.in

Telangana

ఇదేనా మీ తెలివి?

– ఉన్నవాటిని వాడుకునే సోయి లేదా?
– రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది?
– దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు
– ఏప్రిల్‌ 6న వరి పంటకు బోనస్‌ కోసం దీక్షలు
– బోనస్‌ ఇచ్చే దాకా కాంగ్రెస్‌ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదు
– వరి పంటకు రూ.500 బోనస్‌ ఇయ్యాలె
– వాళ్లకు తెలివిలేదు
– నాలుగు నెలల తర్వాత నా గొంతు విప్పుతున్నా
– రేవంత్ సర్కారుపై నిప్పులు కురిపించిన కేసీఆర్

నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ సర్కారుపై గళం విప్పిన కేసీఆర్.. తెలంగాణ సర్కారు వైఫల్యాలను తూర్పారపట్టారు. ‘‘ఉన్న వాటిని వాడుకునే తెలివి కాంగ్రెస్‌కు లేదు. పాత వ్యవస్థలను వినియోగించుకునే సోయి లేదు. రాజకీయం తప్ప అభివృద్ధి లేదు. రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది చెప్పరు’’ అంటూ రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
వరికి బోనస్ కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పోలీసులు అతి చేస్తున్నారని కన్నెర్ర చేశారు. నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన అనంతం కేసీఆర్ సూర్యాపేటలో ప్రెస్‌మీట్ పెట్టారు. నాలుగేళ్లలో కేసీఆర్ నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్ ఇదేకావడం విశేషం.

సూర్యాపేట : కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత్ కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రేవంత్ సర్కారుపై కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. . అధికారం ఎవరికీ శాశ్వతం కా దు. అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదు. రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్‌ చేసినట్లుగా ఎందుకు మాయమైంది? ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత తప్ప మరేం కారణం కాదు.

ప్రజాస్వామ్యంలో ప్రజలుంటరు. ప్రజలకు బాధలుంటయ్‌. ప్రజాస్వామ్యంలో అతిగా పోవద్దని పోలీస్‌ మిత్రులకు చెబుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేం గూడా పదేళ్లు అధికారంలో ఉన్నం. పదేళ్లలో మేం ఇదే దురుసు ప్రవర్తనకు పోతే కాంగ్రెస్ నశ్యానికి కూడా మిగలకుండె. పదేళ్లు మేం ప్రజల సంక్షేమానికి పనికొచ్చే పనులు చేసినం. ఉన్నోన్ని లేనోన్ని కడుపుల పెట్టుకుని కంటికిరెప్పలా చూసుకున్నం. అదే ప్రజలను ఇప్పుడు మీరు మోసం చేస్తమంటే ఊరుకోం.

రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది? ఎందుకు స్పందిస్తలేరు? ఎప్పటికల్లా చేస్తరో ఎందుకు చెప్తలేరు..? బ్యాంకులు రైతులకు నోటీలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపరు? దానికి సమాధానం కావాలి. మేం ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన అడుగుతున్నం

ప్రభుత్వం వరి పంటకు రూ.500 బోనస్‌ ఇయ్యాలె. రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలంటూ ఏప్రిల్‌ 2న బీఆర్‌ఎస్‌ శ్రేణులు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమొరాండం సమర్పించండి. అదే రోజున శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులం హైదరాబాద్‌లో ప్రభుత్వానికి మెమొరాండం ఇస్తం. ఏప్రిల్‌ 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వరి పంటకు బోనస్‌ కోసం దీక్షలు చేయండి.

బోనస్‌ ఇచ్చే దాకా కాంగ్రెస్‌ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైతులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎప్పుడూ ఈ అసమర్థ పాలనే ఉండదు. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడుతం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. వాళ్లు ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చే దాకా వెంటపడి తరుముదాం. దయచేసి ఆత్మస్తైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా

మీ అందరికి సమాచారం కోసం చెబుతున్నా. హైదరాబాద్‌కు పెట్టుబడులు, ఐటీరంగంలో పెట్టుబడులు వచ్చిన తర్వాత.. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా మార్చాం. ఎలాంటి పరిస్థితిని తీసుకువచ్చామంటే.. ఐటీ కంపెనీలు, ఇంటర్నేషన్‌ దిగ్గజాలు సైతం న్యూయార్క్‌, లండన్‌లో పవర్‌ పోతుంది కానీ.. హైదరాబాద్‌లో పోదు అనే స్థితికి తీసుకువచ్చాం. స్టోరీలాగా చెప్పడం లేదు.

ఈ ప్రభుత్వం పట్టించుకోని చేస్తలేదు కానీ.. యాదాద్రిలో ఒకటో రెండో యూనిట్లలో కరెంటు వచ్చేది. ఇందులో తెలంగాణకే.. బయటకు ఇచ్చే అవసరం ఉండదు. 1500-1600 మెగావాట్ల కరెంటు వస్తుండే. మరి ఇంత ఉజ్వలంగా తయారైన పవర్‌ సిస్టమ్‌ ఇవాళ ఇబ్బందిపడుతుంది. ఇది పరిపాలకుల అసమర్థత అవునా? కదా? మీరే ఆలోచన చేయాలి. పని చేయలేనటువంటి.. చేతగానటువంటి ప్రభుత్వ విధానమనుకోవాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

లేక దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు.. ఉండి దరిద్రం ఎందుకు? ఏ కారణం ? ఇంత అద్భుతమైన పవర్‌ సిస్టమ్‌ ఫెయిల్‌ అవుతుంది రాష్ట్రంలో. ఏడు సంవత్సరాలు నడిచిన సిస్టమ్‌.. అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ఛాప్‌ చేసినట్లుగా ఎందుకు మాయమైంది. దీనికి ఎవడు సమాధానం చెప్పాలి.. ఎవడు బాధ్యత వహించాలి. ఇది క్రాస్‌ టాక్‌ కాదు. ఏడు ఏడున్నరేళ్లు బ్రహ్మాండంగా నడిచిన సిస్టమ్‌ నడవడం లేదంటే ఎవరి అసమర్థత? ఎవరి వైఫల్యం’ అంటూ

వందకు వందశాతం నేను ఆరోపిస్తున్నా.. అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత. మరేం కాదు. వాళ్లకు తెలివిలేదు పాపం. పవర్‌ సిస్టమ్‌లో ఐఏఎస్‌ ఆఫీసర్లను తొలగించి టెక్నోక్రస్ట్‌ను పెట్టాం. వాళ్ల ఆధ్వర్యంలోనే నడిపాం. కాబట్టే సమర్థవంతంగా నడిచింది. వీళ్లు ఐఏఎస్‌ ఆఫీసర్లను తెచ్చిపెట్టారు. వానికి పట్టదు.. నా మంత్రులకు పట్టదు. తీరిక లేదు మంత్రులకు. రాజకీయాల కోసం తీరిక ఉన్నది కాని.. ప్రజల అవసరాల కోసం తీరిక లేదు.

రైతుబంధు వేయడానికి తీరిక లేదు. మేం రైతుబంధు వేస్తే వారం పదిరోజుల్లోనే వేసేవాళ్లం. వీళ్లు అనుమానాలు కలిగించి.. ఐదెకరాలు, మూడెకరాలు.. ఏడెకరాలకు వేస్తమని.. ఏదో విజయం సాధించామని తోకమట్ట. అదేదో గొప్ప ఢంబాచారమని.. అదో వేస్ట్‌ పథకం అన్నట్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. ఇది నాలుగో నెల. ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నా గొంతు విప్పుతున్నా.

ఎవరైనా కొత్తగా గెలిస్తే సమయం ఇస్తాం. రెండు మూడు నాలుగు నెలలు సమయం ఇస్తం. వాళ్లు సర్దుకోవాలి. అవగాహన చేసుకోవాలి కదా. ఐదేళ్లు అద్భుతంగా నడిపాం. బ్రహ్మాండంగా మిషన్‌ భగీరథలో నీళ్లు ఇచ్చాం. రాలేదా? హైదరాబాద్‌ నగరంలో బయట గ్రామాల్లో ఒక్కనాడు ఒక్క ట్యాంకర్‌ కనిపించిందా? ఇవాళ ట్యాంకర్‌ కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ సమర్థులు ఎవరు. ఇవాళ ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కాదా?

ఒక అగ్రగామి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది ఇయ్యాల. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏందీ? దీంట్లో ఉన్న తమషా ఏందీ ? కొత్తగా నడిపించేది ఏమీ లేదు.. కొత్తగా మొద్దులు మోసేది లేదు.. కట్టెలు కొట్టేది లేదు. కొత్త గడ్డపారలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్లు నడిపించలేని అసమర్థత ఏందీ? అశక్తత ఏందీ?

కట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా? దాన్నే నడిపించే తెలివిలేకపోతే ఎలా? మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే.. ఇప్పుడున్న, రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువ తనం, అవగాహనా రాహిత్యం, దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం మనకు కనిపిస్తుంది. ఉన్న కరెంటును, మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేదు.

అద్భుతంగా వచ్చే హైదరాబాద్‌ నీళ్లు లేవు. మళ్లీ వాటర్‌ బిల్స్‌.. ట్యాంకర్ల వ్యాపారం జరుగుతుంది. కొనలేక జనం చస్తున్నరు. మళ్లీ జనరేట్లర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్‌. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది

బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 రాష్ట్రాలు కొనియాడి అమలు చేసుకుంటున్న పథకం మిషన్‌ భగీరథ. రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత రావాలి ?

LEAVE A RESPONSE