Suryaa.co.in

Andhra Pradesh

జగన్ లా మడమతిప్పే వ్యక్తినికాదు!

అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చేసి చూపిస్తా
ఆగిన అమరావతి పనులను పరుగులు తీయిస్తాం
మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్

మంగళగిరి: జగన్ మాదిరి మాటతప్పి మడమతిప్పే వ్యక్తిని కాదు, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇచ్చిన మాట ప్రకారం అహర్నిశలు కష్టపడి మంగళగిరిని దేశంలోనే రోల్ మోడల్ గా అభివృద్ధి చేసి చూపిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి కొత్తపేట రామమందిరం సెంటర్, 13వవార్డు, ఆత్మకూరు వడ్డెరపాలెం సెంటర్లలో ఏర్పాటుచేసిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పనిచేసే మనసుంటే అభివృద్ధి సాధ్యం. ఆర్కే మాదిరి నటన ఎందుకు? మంగళగిరి అభివృద్ధికి జగన్ 1200 కోట్లు ఇస్తానని 12కోట్లు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రెండునెలల తర్వాత మళ్లీ ఆ పార్టీలో చేరి ఇప్పుడు చెల్లెమ్మను వెంటబెట్టుకుని ఓట్లు అడగానికి వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? 2019లో ఓడిపోయినా సొంతనిధులతో 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నా. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన అమరావతి పనులను పరుగులు తీయిస్తాం. సింహాచలం తరహాలో అటవీ భూములను డీనోటిఫై చేసి శాశ్వత పట్టాలు ఇప్పిస్తాం. మైనారిటీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం.

25ఏళ్లుగా ఒక్క ఇంటిపట్టా ఇచ్చారా?

ప్రజలు 25సంవత్సరాలుగా రెండు కుటుంబాలకు అవకాశమిచ్చారు. మంగళగిరి ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పువచ్చిందా? సమస్యలు పట్టించుకున్నారా? ఒక్కరికైనా ఇంటిపట్టా ఇచ్చారా? ఎన్నికల్లో గెలిచాక ఎప్పుడైనా ముఖం చూపించారా? రెండునెలలు ఓపికపట్టండి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గత 25 ఏళ్లుగా నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని భర్తచేసి, మంగళగిని అభివృద్ధి పథంలో నడిపిస్తా. భూగర్భ డ్రైనేజితో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. కృష్ణానది నుంచి పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. నియోజకవర్గ పరిధిలో అన్నిరోడ్లు నిర్మిస్తాం. మంగళగిరికి పరిశ్రమలు తెచ్చి యువతక ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, ఎంతఎక్కువ మెజారిటీ ఇస్తే చంద్రబాబుతో అంత బలంగా పోరాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తెస్తానని లోకేష్ పేర్కొన్నారు.

2014,19లో ఎందుకు బిసిలను నిలబెట్టలేదు?

జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈరోజు జగన్ మంగళగిరిలో బిసి అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చామని చెబుతున్నారు, 2014,19 ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనుభవం, విజన్ ఉన్న చంద్రబాబు అవసరమని అన్నారు. మంగళగిరి టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ… ఒక్కచాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ మహిళలు, యువతను దారుణంగా మోసగించారు. జె-బ్రాండ్ల మద్యంతో అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. కరెంటు, నిత్యావసర ధరలను విపరీతంగా పెంచారు. ఈ అన్యాయపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని కోరారు. బిజెపి పట్టణాధ్యక్షుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ… అయిదేళ్ల అరాచకపాలనలో రాష్ట్రప్రజలంతా నరకం చూశారని అన్నారు. రాక్షసపాలననుంచి విముక్తి కోసం కూటమి అభ్యర్థి లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

లోకేష్ ఎదుట మంగళగిరి వాసుల సమస్యలు

రచ్చబండ సందర్భంగా మంగళగిరి కొత్తపేట వాసులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. గత అయిదేళ్లుగా మహిళలకు భద్రతలేదు. పట్టపగలు రోడ్లపైకి వెళ్లాలన్నా యువతులు భయపడే పరిస్థితి నెలకొంది. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య ఉంది, గుంటూరు-విజయవాడ, గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచాలి. వారానికి రెండురోజులు మాత్రమే కుళాయిల్లో తాగునీరు వస్తోంది. అదేమని కార్పొరేషన్ అధికారులను అడిగితే మోటార్లు పాడైపోయాయని చెబుతున్నారు. చెత్తపన్ను వసూలు చేస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే ఉంచుతున్నారని వాపోయారు. మంగళగిరి పాతబస్టాండు సెంటర్ వాసులు తమ సమస్యలను విన్నవిస్తూ డిఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేయాలి. మైనారిటీ విద్యార్థుల డ్రాపవుట్స్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుచేయాలి. ముస్లిం మహిళలకు సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలు అందించాలి. ప్రైవేట్ టీచర్లకు జీతాలు తక్కువగా ఉన్నాయి. తాగునీటి సమస్య, దోమలబెడద ఎక్కువగా ఉంది. ఇళ్లులేని వారికి ఇళ్లస్థలాలు ఇవ్వాలి. లోకేష్ స్పందిస్తూ… కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం, కిస్మత్ బ్యాంకు తరహాలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేస్తాం. పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. మెగా డిఎస్సీతో పోటు పెండింగ్ పోస్టులు భర్తీచేస్తామని అన్నారు. కార్పొరేషన్ ను మున్సిపాలిటీగా మార్చి పన్నుల భారం తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

 

LEAVE A RESPONSE