Suryaa.co.in

Editorial

జగన్ మాయ్య..భల్లే భల్లే !

  • కాళ్లకు చెప్పుల్లేకుండా వచ్చిన ఓ విద్యార్ధి

  • హెలిప్యాడ్ వద్దకు ఫొటో కోసం వచ్చిన షరీఫ్

  • ఏడుస్తూ జగన్ వద్దకు వెళ్లిన విద్యార్ధి

  • జగన్‌తో ఫొటో కోసమంటూ మారాం

  • దగ్గరకు తీసుకుని ఫొటోకు ఫోజిచ్చిన జగన్ మాయ్య

  • బాగా చదువుకోవాలని బుగ్గలు పిసికిన జగన్

  • పైసా ఇవ్వకుండానే పంపేసిన మేనమామ

  • చెప్పుల కోసం డబ్బులిస్తారనుకున్న నేతలు

  • హెలిప్యాడ్ దగ్గరకు బాలనటుడిని ఎలా అనుమతించారో?

  • ఇది బెజవాడ-2 అంటూ సోషల్‌మీడియాలో ఎకసెక్కాలు

  • బాలనటుల కాన్సెప్టు బూమెరాంగవుతోందంటూ తలపట్టుకుంటున్న వైకాపేయులు

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ మాయ్య మామూలోడు కాదు. వేలాదిమంది జనం అటు ఇటు నిలుచున్నా.. తన కోసం ఏడ్చేవాళ్లు చిట్టచివరలో ఉన్నా, జనం మధ్యలో ఉన్నా ఠక్కున గుర్తించి, కాన్వాయ్ ఆపేస్తారు. రెండు చేతులూ బారచాపి రమ్మంటూ పిలుస్తారు. అంతే.. గుక్క పెట్టి ఏడ్చే ఆ చిన్నారుల ఏడుపు మంత్రం వేసినట్లు ఆగిపోతుంది. వెంటనే జగన్ మాయ్య వాళ్ల బుగ్గలు పిసుకుతారు. నెత్తిన చేయి పెడతారు. నుదుటన ముద్దులు పెడతారు.

ఫైనల్‌గా వాళ్లతో సెల్ఫీ తీసుకుంటారు. వెయ్యేనుగుల బలంతో ఆ బాలనటులు ‘జై జగన్ మాయ్య.. మాకు అమ్మఒడి రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. నాన్న తడికి రేట్లు పెరిగాయి. నాకు జగన్ మాయ్యంటే యమా ఇష్టం’ అంటూ ఆస్థాన మీడియా ముందు జాతినుద్దేశించి బోల్తుంటారు. దానిని ఆస్థాన మీడియా పొద్దున నుంచి రాత్రి వరకూ, చూసిందే చూడండి అంటూ వెనుక బీజీలతో హడావిడి చేస్తుంటుంది. జగన్ మాయ్యతో టై అప్ ఉన్న మిగిలిన మిత్ర మీడియా కూడా, యధాశక్తిన ‘శ్రమదానం’ చేస్తుంటాయి. ఇవన్నీ కొన్నేళ్ల నుంచి చూసి చూసీ విసిగిపోయిన పాత దృశ్యాలే. ఇన్లేళ్లయినా కాన్సెప్ట్ మారదు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో కూడా షేమ్ టు సేమ్ సీన్లే!

కొద్దిరోజుల క్రితం జగన్ మాయ్య బెజవాడ జైల్లో.. మంచం గట్రా సౌకర్యాలు ఏర్పాటుచేసుకున్న, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్లారు. బయటకు వచ్చి మళ్లీ తాడేపల్లికి వెళుతున్న జగన్ మాయ్యకు, ఓ చిన్నారి రెడ్డమ్మ ఏడుస్తూ కనిపించింది. అన్ని వందలమందిలోనూ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న చిన్నారి రెడ్డమ్మను, జగన్ మాయ్య తన దివ్యదృష్టితో కనిపెట్టేశారు.

దానితో కారు ఆపి, చిన్నారి రెడ్డమ్మను పిలిచి ముద్దు పెట్టి సెల్ఫీ తీసుకోవడంతో, చిన్నారి రెడ్డమ్మ మురిసి ముక్కలయింది. తర్వాత ఆ సీను కోసమే కాచుకున్నట్లు.. అక్కడున్న వైసీపీ మీడియా ఆ చిన్నారి రెడ్డమ్మ ముందు గొట్టం పెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావ న్న సదరు గొట్టం రిపోర్టరుకు.. ‘నాకు జగన్ మాయ్యంటే ఇష్టం. నాకు అమ్మఒడి రాలేదు. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది’ అని భోరున ఏడ్చేసింది.

అంతటితో ఆగని ఆ గొట్టం రిపోర్టరు రెడ్డమ్మ ఇంటికీ వెళ్లి, ఏడుస్తున్న చిన్న రెడ్డమ్మను ఎందుకేడుస్తున్నావని అడిగాడు. ‘అక్క నాకు తెలియకుండా జగన్‌మాయ్యను కలిసింది. నాకు జగన్ మాయ్య అంటే ఇష్టం’ అని కళ్లు నలుముకుంటూ ముద్దుముద్దుమాటలతో చెప్పింది.

సరే.. ఈ రిహార్సల్ జగన్ మాయ్య సమక్షంలో జనం ముందు రక్తికట్టినా, దాని వెనుక కథ మాత్రం గంటల్లో జనాలకు తెలిసిపోయింది. ఆ చిన్నారి రెడ్డమ్మ నాయనకు బెడవాడలో పేద్ద బంగారు షాపు ఉందని.. ఆ రెడ్డమ్మ లక్షలు పోసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతుందని…కేవలం ‘ఏడాదికి 15 వేలు ఇచ్చే అమ్మఒడితో చిన్నారి రెడ్డమ్మ అంత రిచ్ స్కూల్లో ఎలా చదువుతుందన్న చిన్న లాజిక్ ఎలా మిస్సయార’ంటూ .. సోషల్‌మీడియాలో సంధించిన ప్రశ్నాస్త్రాలకు, జగన్ మాయ్య ఇమేజ్ ఢామ్మని బర్త్‌డే బూర మాదిరిగా పగిలిపోయింది. బాల నటి.. భలే భలే!

ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. సేమ్ సీన్. బట్ క్యారెక్టర్ ఛేంజ్. మిగిలినదంతా షేమ్ టు సేమ్.
జగన్ మాయ్య అసెంబ్లీ ఎగ్గొట్టి పులివెందుల పర్యటనకు వెళ్లారు. పులివెందుల హెలీప్యాడ్ వద్ద ఏడో తరగతి చదువుకునే మహబూబ్ షరీఫ్ అనే విద్యార్ధి.. సేమ్ మన బెజవాడ రెడ్డమ్మ అన్నయ్య మాదిరిగానే, కళ్లు నులుముకుంటూ గుక్కలు పెట్టి ఏడుస్తున్న విషాద దృశ్యం జగన్‌మాయ్య కంట్లో పడింది. సేమ్ బెజవాడ జైలు దగ్గర చిన్నారి రెడ్డమ్మను దగ్గరకు పిలిచినట్లే.. పులివెందుల షరీఫ్ అనే బాలనటుడిని దగ్గరకు పిలిచారు.

‘ఏం నాయన. ఏమైంది? యామి. ఎందుకు యాడస్తన్నవు? విషయమేమున్నదమ్మా’? అని సీమ యాసలో అడిగారు. దానికి ఆ బాలనటుడు షరీఫ్ ‘‘నిన్ను సూడనీకి ఎండలో చెప్పులు కూడా లేకుండా 5 కిలోమీటరు నడిచి వచ్చినా జగన్ మాయ్య’’ అని బదులిస్తే, మాయ్య సంబరపడ్డారు. పక్కనున్న నాయకులు కూడా ఉదయం నుంచి నిన్ను సూడనీకి వచ్చిండన్నా అంటే.. ‘నన్ను సూడనీకి చెప్పులేకుండా వచ్చినావ్’ అని తలనిమురుతూ ఫొటోగ్రాఫర్‌ను పిలిచి, షరీఫ్‌ను పిలిచి బుగ్గలు నిమిరి ఫొటో దిగారు.

అసలు ఆ షాట్ కోసమే వచ్చిన ఫొటోగ్రాఫర్ కూడా, ఫోటోను క్లిక్కుమనిపించేశాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుగా? వైసీపీ మీడియా చానెల్‌లో బీజీలతో జగన్ మాయ్య ముద్దు పెట్టుకున్న దృశ్యాలు పంచరంగుల్లో టెలికాస్టయ్యాయి. సీన్ బెజవాడయినా, పులివెందులయినా పార్టీ చానెల్ భక్తి భక్తే!

అసలు ఈ బాలనటుల కాన్సెప్ట్‌ను ఎవరు కనిపెట్టారో గానీ, కొంచెం కూడా స్క్రిప్టు మార్చుకోకపోవడమే.. తర్వాత జగన్ మాయ్య మేనల్లుళ్ల ముందు, బద్నామ్ కావడానికి కారణమవుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏడో తరగతి చదువుతున్న బాలనటుడు షరీఫ్.. కాళ్లకు చెప్పుల్లేకుండా, ఉదయం నుంచి హెలిప్యాడ్ వద్ద నిల్చొని ఉంటే పోలీసులు అక్కడి నుంచి ఎందుకు పంపించలేదు? వీపీఐ, జడ్ కేటగిరి ప్లస్ జిల్లా పోలీసుల సెక్యూరిటీలో ఉండే జగన్ మాయ్యను చూసేందుకు ఆ బాలనటుడిని హెలిప్యాడ్ వద్దకు ఎలా అనుమతించారు? సహజంగా జగన్‌మాయ్య దగ్గరకు కొద్దిమందినే అనుమతిస్తారు. మరి ‘పులివెందుల బాలనటుడి’ని, ఎవరు సిఫార్సు చేస్తే హెలీప్యాడ్ దగ్గరకు అనుమతించారన్నదే ప్రశ్న. బహుశా జనం ఈ కోణంలో ‘ఆలోచించరేమో’నన్న ‘ఆలోచన’తో.. కొత్తగా ‘ఆలోచించి’నట్లున్నారు!

సరే అంతా బాగానే ఉంది. తన కోసం ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పాపం 5 కిలోమీటర్లు నడిచి వచ్చిన చిన్నారి షరీఫ్‌ను పిలిచి.. ‘ఇదిగో అల్లుడూ.. ఈ డబ్బులు తీసుకుని, చెప్పులు, పుస్తకాలు కొనుక్కో’మని ఏమైనా ఓ వెయ్యి రూపాయలు జేబులో పెట్టారా అంటే అదీ లేదు. ఫొటో తీసుకుని పండగ చేసుకోమని పంపిన జగన్ మాయ్య దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నది, ఆ ఫోటోలు చూసి తరించిన వారి ఉవాచ.

కాబట్టి జగన్ మాయ్య ప్రెస్టేజీ దెబ్బతినకుండా కొత్త కాన్సెప్టులు వెతకండ్రా బాబూ అని.. మేన ల్లుళ్లు, ఐడియాలజిస్టులకు సూచిస్తున్నారు. సో.. ఈ సారి ఎపిసోడ్‌లో ఏ పాత్రకు ప్రాణం పోసి, ప్రవేశపెడతారో వైసీపీ వెండితెరపై చూడాల్సిందే!

LEAVE A RESPONSE