Suryaa.co.in

Andhra Pradesh

తల్లి, చెల్లితో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవించడం లేదు

– ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రేమగా చూసుకునే మహిళలు ఆయన శ్రీమతి, ఇద్దరు కుమార్తెలు మాత్రమే
– షర్మిల స్పృశించిన అంశాన్ని పరిశీలిస్తే జగన్ ఓటు బ్యాంకుకు బ్యాండ్ పడినట్టే లెక్క
– వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల రెండవ జాబితాలో
ఎస్సీ, బీసీ, ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే అన్యాయం
– ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకటి, అర మార్పులు తప్పితే, ఎటువంటి ట్రాన్స్ఫర్లు లేవు
– హై కోర్ట్, సుప్రీంకోర్టులలో ముఖ్యమంత్రికి తప్పని ఎదురు దెబ్బలు
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

తల్లి, చెల్లి తో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవంగా చూడడం లేదు. నిరాదరణకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రేమగా చూసుకునేది ఆయన శ్రీమతి, కూతుర్లను మాత్రమేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. తల్లిని, చెల్లిని వెళ్ళగొట్టి నాకు ఎవరూ లేరు మొర్రో అని ఆయన అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తల్లిని, చెల్లిని జగన్మోహన్ రెడ్డి దారుణంగా నిర్లక్ష్యం చేశారు. అయినా రాష్ట్రంలోని మహిళలలో తల్లిని చెల్లిని చూసుకుంటున్నారని అనుకున్నాం. కానీ అది కూడా ఉత్తి భ్రమేనని తేలిపోయింది. రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో పాటు మున్సిపల్ కార్మికులు రోడెక్కారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంగన్వాడీలను ఆదర్శంగా తీసుకోవాలి.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ, వారు అంగన్వాడీల తరహాలో తమ నిరసనను తెలియజేయలేక పోతున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చంకలు నాకడానికి ఉన్నట్టు వ్యవహరించడం దారుణం . అంగన్వాడీలకు పెంచుతామని చెప్పిన జీతాలను పెంచకుండా మోసగించడం అన్యాయం. వారిని ఈ రకంగా వేదనకు గురి చేయడం క్షమించరాని తప్పు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే, నిలబెట్టుకోకుండా లక్షలాది మంది మహిళలు రోడెక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు.

రాష్ట్రంలోని మెజారిటీ మహిళకు అంగన్వాడీ లు
ఏదో ఒక సమయంలో సేవ చేసిన వారే. గర్భిణిగా ఉన్నప్పుడైనా వారు బాలింతగా ఉన్నప్పుడైన అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను పొందిన వారే అధికం. 1975లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమును ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు చేసిన సేవలు వెలకట్టలేనివి. అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమం అంగన్వార్ ను తలపిస్తోంది. మహిళల అన్న జాలి కూడా లేకుండా, అంగన్వాడీలను, ఆశా వర్కర్లను, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను వేధించడం సబబు కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

మైనార్టీ ఓట్లపై షర్మిల గురి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, తన తొలి ప్రసంగం ద్వారానే ఆమె రానున్న రోజుల్లో గట్టిగా పోరాడనున్నారని అర్థమయింది. తన తొలి ప్రసంగంలోనే ఆమె స్పృశించిన అంశాన్ని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకు బ్యాండ్ పడేలా ఉంది.

మణిపూర్ అల్లర్లను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన సహాయ సహకారాలను అందించింది. ఏ ఒక్క వర్గానికి అన్యాయం చేయలేదు. ఏ మతాన్ని ప్రోత్సహించలేదు. మణిపూర్ లోని తెగల మధ్య అంతర్యుద్ధంగా అల్లర్లు పరిణమించాయి. ఆ అల్లర్లు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. అయినా, అక్కడ చర్చిల ధ్వంసం గురించి షర్మిల మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు స్పృశించని అంశాన్ని, తాను స్పృశించడం ద్వారా ఒక వర్గం ఓట్లకు గండి కొట్టాలన్నదే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది.

గత వారం, పది రోజులుగా రచ్చబండ కార్యక్రమంలో ఇదే అంశం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సాలిడ్ ఓటు బ్యాంకు గా ఉన్న ఒక వర్గం ఓట్లను గండి కొట్టే దిశగా షర్మిల తొలి అడుగు వేసిందనే చెప్పుకోవచ్చు. ఇక రాజకీయాలు పక్కన పెడితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి ని షర్మిల క్యాంపు కార్యాలయంలో కలిశారా?, ఇంట్లో కలిశారా?? అన్న విషయం తెలియదు. వారిద్దరు కలిసినట్లుగా ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా మీడియాకు విడుదల చేయలేదు.

కచ్చితంగా వారిద్దరూ కలిసే ఉండవచ్చు. ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు అందరినీ పిలుచుకోవడం ఆనవాయితీ కాగా , పిలిచినవారు వెళ్లడం అన్నది రివాజు. ఆ సాంప్రదాయాలు ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో తల్లి కాంగ్రెస్ లో చెల్లి కాంగ్రెస్ కలిసిపోయిన తరువాత, ఊహించుకున్న దాని కంటే స్ట్రాంగ్ గానే సీన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ను దూషించిన వారికి ఒక్క కాపు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించిన వారికి ఒక్క కాపు కులస్తుడు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సత్తెనపల్లి, అనకాపల్లి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపులదే ఆధిపత్యం. మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి పేర్ని నానిలతో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ దారుణంగా తిట్టించారు. గతంలో వీరికి ఓట్లు వేసి గెలిపించిన కాపులు, పవన్ కళ్యాణ్ ను దారుణంగా తిట్టినందుకు… ఇప్పుడు ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు.

పవన్ కళ్యాణ్ ను దారుణంగా తిట్టించిన జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాలలో సర్వే చేయించారు. ఆ సర్వేలో స్థానిక శాసనసభ్యులకు ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. జగన్మోహన్ రెడ్డి కక్షకు పాపం అమర్నాథ్, అంబటి రాంబాబులు బలి కాబోతున్నట్లు పత్రికల్లో వార్తా కథనాలు చూశాం. ప్రజలకు అందుతున్న సమాచారం మేరకు గుడివాడ అమర్నాథ్ కు సీటు లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయడమే ఆయన చేసిన నేరం. ఏ కులం వారిని ఆ కులం నాయకుల చేత తిట్టించడంలో భాగంగా కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ ను, క్షత్రియ నాయకుల చేత నన్ను జగన్మోహన్ రెడ్డి తిట్టించారు.

గతంలో నన్ను తిట్టిన వారి నియోజకవర్గాలలోనూ సర్వే అంచనాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. వారిని ఉంచుకుంటారా?, టాక్స్ బర్డెన్ పెంచి చెంతకు చేర్చుకుంటారా?? అన్నది చూడాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు నన్ను తమ తిట్ల దాడితో టార్గెట్ చేశారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని అందరి పైన దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

అందరి పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి తిట్టమని చెప్ప గానే, తిట్టిన వారిపై అధిక వ్యతిరేకత నెలకొంది. ఇప్పుడు నా ప్రస్తుత పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీట్లను మారుస్తామని చెబుతున్నారు. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల రెండవ జాబితాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులకే తీవ్ర అన్యాయం జరిగింది. ఎవరికైతే ఈ నాలుగున్నర ఏళ్లలో మంచి పదవులు, సలహాదారుడి పోస్టులు, పదవుల పొడిగింపు చేపట్టిన సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సీట్లలో ఒకటి అర మార్పులు చేశారే తప్పితే, ఎటువంటి ట్రాన్స్ఫర్లు చేయలేదు.

ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారే ఎందుకు మార్చబడ్డారు. అగ్రవర్గాలలో కూడా కేవలం కాపు నాయకులను మాత్రమే ఎందుకు మార్చారు . అలాగే కమ్మ కులానికి సంబంధించిన వారికి కూడా మినహాయింపు నివ్వలేదు. ఏ కులానికి లేని ప్రాధాన్యతను జగన్ తన సామాజిక వర్గమైన రెడ్డి కులానికి ఇచ్చి ఉంటారు. మరో నాలుగు ఏళ్ల పాటు పదవీకాలం ఉన్నప్పటికీ సి. రామచంద్రయ్య మాట్లాడుతూ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయానని చెప్పారు. ద్వారకానాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా లో చేరారు.

తమ కుటుంబంలో విజయ సాయి రెడ్డి, తన సోదరి మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా తెదేపాలో చేరుతారేమోనని పేర్కొనడం పరిశీలిస్తే, వైకాపా పని అయిపోయినట్టేనని అర్థమవుతుంది. నాలుగేళ్ల పాటు పదవీకాలం ఉండగానే ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు సీటు లేదని చెప్పగా, ఆయన రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. వైకాపాపై ఇంత వ్యతిరేకత దేనికి ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఒకరిద్దరిపై మాత్రమే ఉంటుంది.

ఇంతటి వ్యతిరేకతకు కారణం పార్టీ అధినేత అవుతారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జగన్మోహన్ రెడ్డి చెప్పారని గతంలో ఎక్స్ట్రాలు మాట్లాడారు. ఇప్పుడు ఆయనకు హిందూపురం లోక్ సభ సీటు లేదని చెప్పగానే, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తో ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లుగా నీలి మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. నీలి మీడియాను కంట్రోల్ చేసేది సజ్జలనే. అదే నీలి మీడియాలో వార్తా కథనం వెలువడిందంటే అది నిజమేనని స్పష్టమవుతుంది. అబ్బబ్బె అటువంటిదేమీ లేదని మాధవ్ ఖండించినప్పటికీ, అక్కడ ఘర్షణ పెట్టుకుంటే అంత ఈజీగా పంపించరు. ఘర్షణ పడినందుకు పర్యవసానంగా ప్రాయశ్చిత్తం జరిగిందని తెలిసింది. ఆ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ప్రెస్ మీట్ లో కనిపించింది.

వైకాపా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటానని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన శివాజీ చిత్రములో బ్లాక్ మనీ కలిగిన పెద్దల సహాయకులు రూమ్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత తమ మనసును మార్చుకున్నట్లుగా, తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి వచ్చినవారు తమ మనసును మార్పుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

వైకాపా టికెట్లు దక్కని వారి సంతోషానికి ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొలమానాలు ఉండవని చెప్పారు. డ్యాన్స్ వచ్చిన రాకపోయినా తమకు నచ్చిన పాటను డీజే లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. టికెట్లు దక్కిన వారు ఓడిపోయి బావురుమంటే, టికెట్లు దక్కని వారు గెలిచిన తెదేపా, జనసేన, బిజెపి అభ్యర్థుల కంటే రెట్టింపు సంతోషంతో డాన్సులు చేస్తారని రఘురామకృష్ణం రాజు తెలిపారు .

మూడు రాజధానుల ఆర్డర్ విరమించుకున్నాం
గతంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఆర్డర్ ఇచ్చాము. దాన్ని విరమించుకున్నాము. ఆర్డర్ విరమించుకున్న తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఇచ్చిన జీవో విరమించుకున్న తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఎకాడమిక్ అవుతుందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పిల్ చేసిన పిటిషన్ ను వెంటనే టేకప్ చేయాలని ఆయన న్యాయమూర్తిని కోరారు.

ఎకాడమిక్ తీర్పు కొట్టి వేయకపోతే, మేము అనుకున్న కార్యక్రమాలను చేయలేమని చెప్పారు. అయితే న్యాయమూర్తి డీటెయిల్ గా స్టడీ చేయాలని చెప్పి ఏప్రిల్ కు కేసు వాయిదా వేశారు. అదే సమయంలో అమరావతి రైతుల పక్షాన న్యాయవాది దేవదూత్ కామత్ జోక్యం చేసుకొని కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హైకోర్టు సుప్రీంకోర్టులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.

భూమి హక్కు చట్టాన్ని తీసుకువచ్చి బొమ్మలు వేసుకోవాలని భావించిన జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టింది. భూమి హక్కు చట్టంలోని తగాదాలను పరిష్కరించే హక్కులను సివిల్ కోర్ట్ కు తీసివేయడం జరిగింది. దీనితో న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కేసును స్వీకరించి , భూ హక్కు చట్టం అమలును నిలిపివేయాలని, యధావిధిగా సివిల్ కోర్టులో తగాదాలను పరిష్కరించే హక్కులను కల్పించింది.

ఒకవైపు న్యాయస్థానంతో పాటు మరొకవైపు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కాకినాడ బహిరంగసభలో ఖాళీ కుర్చీలు ఎక్కువగా దర్శనమిచ్చాయి. బిజెపి సమావేశంలో తాము జనసేనతో కలిసి ఉన్నట్లుగా తీర్మానించారు.

ఇక జనసేన టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. ఏడవ తేదీ ఆచంట నియోజకవర్గంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయన్న రఘురామకృష్ణం రాజు, ఈరోజు జరిగే బిజెపి సమావేశంలో ఆదిశగా తీర్మానం వెలువడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE