Home » దారుణంగా పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్

దారుణంగా పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్

-పాత మేనిఫెస్టో నే అటు, ఇటు చేసి మూడింటిని తీసేశారు తప్ప…
-వైకాపా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదు
-ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు
-గత రెండు రోజుల క్రితం నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో తేట తెల్ల మైన జగన్మోహన్ రెడ్డి దారుణమైన పరాజయం
-ఓటర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోన్న తెదేపా మేనిఫెస్టోలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ పథకం
– నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘు రామ కృష్ణంరాజు

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు.

వైకాపా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదన్న ఆయన, పాత మేనిఫెస్టో నే అటు ఇటుగా రెండు, మూడు తీసేశారు తప్ప అంటూ అపహాస్యం చేశారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సమాజంలోని ఏ ఒక్క వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే పరిస్థితే లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రజల్ని కలుసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల ఒక ఉపాధ్యాయురాలిని కలిసి ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించగా, ఎనిమిదేళ్ల క్రితం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరిన తనకు రెండు లక్షల రూపాయల ఏరియర్స్ రావలసి ఉందని చెప్పారన్నారు. ఈ లెక్కన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామిరెడ్డి, అల్లరి, చిల్లర రెడ్డి లు మద్దతు తెలిపినంత మాత్రాన ఉద్యోగులంతా సపోర్ట్ చేసినట్టు కాదన్నారు. ఉద్యోగులంతా నిర్వేదంలో ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 40 లక్షల మంది ఉద్యోగులు వ్యతిరేకమే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రంలోని 40 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉద్యోగులు వారి కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేదన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పురుషులు ఉంటే, ఒక అంచనా ప్రకారం వారిలో 60 శాతం మంది మద్యం సేవించేవారు ఉంటారన్నారు.

జనాభాలో 30% అంటే, రాష్ట్ర జనాభాలోని కోటి మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం, నాణ్యతలేని మద్యాన్ని ప్రతీ రోజూ క్వార్టర్ సేవిస్తూ తమ జేబును, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారన్నారు . రాష్ట్రంలో మద్యం సేవించే ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవకాశం లేదన్నారు. ఇల్లును, ఒళ్ళును గుల్ల చేసుకున్న సాధారణ ప్రజలతో పాటు, ఉద్యోగులతో కూడా కలుపుకుంటే కోటి 20 లక్షల మంది ఉంటారన్నారు.

యువకులకు జాబ్ క్యాలెండర్ లేదు… ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు
రాష్ట్రంలోని యువకులకు జాబ్ క్యాలెండర్ లేదు. యువతకు సాంకేతిక శిక్షణ సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం అందుబాటులో లేకుండా చేసిందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు . ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పక్క ఊర్లకు వలస పోతున్నారు . తెలంగాణలో గత ఏడాది 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు పెరిగితే, రాష్ట్రంలో తగ్గిపోయాయని అన్నారు. రాష్ట్రం నుంచి మూడు లక్షల కుటుంబాలను వలస వెళ్లే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు.

ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు దాదాపు 50 లక్షల మంది ఉంటారన్న ఆయన, చదువుకోని వారికి ఏ సమస్య లేదని, ఎందుకంటే వారికి ఏదో ఒక ఉపాధి దొరుకుతుందన్నారు. బీ టెక్, ఎంటెక్ చదివిన వారికి మాత్రం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంభించిన అభివృద్ధి నిరోధక విధానం వల్ల, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు.

అమర్ రాజా బ్యాటరీ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి వేశారని, పారిశ్రామిక అభివృద్ధి గురించి అడిగితే… బటన్ నొక్కానని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న వారిని తరిమి వేస్తున్నారన్న ఆయన, ఎవరైనా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డిని కచ్చితంగా కలుసుకోవాలని షరతును విధిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టడానికి పారిశ్రామికవేత్తలు రెడీ అయినప్పటికీ, వారితో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరన్నారు.

పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ని కాదని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అధికారికి క్లియర్ చేసే ధైర్యం లేదన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను జగన్మోహన్ రెడ్డి కలవరని, రాష్ట్రంలో పరిశ్రమలను గొంతు నులిమి చంపేశారన్నారు. రాష్ట్రానికి రావలసిన వందలాది పరిశ్రమలను, వాటి ద్వారా లక్షలాదిమందికి లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువతకు దూరం చేశారన్నారు.

ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలోని యువత తీవ్ర నిరాశ నిస్సృహలో ఉన్నారని, వారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమే లేదన్నారు. మద్యం మహమ్మారి కారణంగా మహిళలు ఓటు వేసే అవకాశం లేదన్న ఆయన, గత ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమ పథకాలకు, ఇంకా ఏదో చేస్తానని భ్రమలు కలిగించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు ఆ భ్రమలు తొలగిపోతున్నాయన్నారు.

మహిళలకు ఆ భ్రమలు తొలగిపోతే, వైకాపా అడ్రస్ గల్లంతవుతుందన్నారు. సమాజంలోని ఏ వర్గం ప్రజలను తీసుకున్న వారంతా జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ఉద్యోగులకే కాకుండా, పోలీసులకు కూడా బకాయిలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని ఎద్దేవా చేశారు.

అన్ని వర్గాలను రాచిరంపాన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎలా నెగ్గుతానని అనుకుంటున్నారో తెలియదన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిన తరువాత గత రెండు రోజుల క్రితం నిర్వహించిన ఫ్లాష్ సర్వే లో జగన్మోహన్ రెడ్డి దారుణమైన పరాజయాన్ని ఎదుర్కోబోతున్నారన్నారు.

గుంటూరు పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలలో కూటమిదే గెలుపు
గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి గెలవబోతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గుంటూరు -1 అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించనున్నారన్నారు .

గుంటూరు -1 అసెంబ్లీ నియోజకవర్గంలో సాంప్రదాయ ముస్లిం ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని అందరూ అనుకుంటున్నప్పటికీ, ఈసారి మాత్రం ఫలితం భిన్నంగా ఉండబోతుందని చెప్పారు.. నర్సాపురం పార్లమెంటరీ స్థానంలో, కాకినాడ, అమలాపురం, నెల్లూరు తో పాటు అన్ని పార్లమెంటరీ స్థానాలలోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారని చెప్పారు.

రాయలసీమలోనూ చాలా మార్పు కనిపిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతీ కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత, ప్రజల్లో దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందన్నారు. కుటుంబ ఇన్సూరెన్స్ పథకం ప్రజలలో తీవ్ర ఇంపాక్ట్ చూపిస్తోందన్నారు..

రాయలసీమ ప్రాంతంలో రైతాంగానికి 90% బిందు సేద్యం పథకం అందే విధంగా కృషి చేస్తామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత, దాని ప్రభావం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అయితే కొంతమంది కులం, మత జాడ్యం తో ఇంకా జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తున్నారన్నారు. అయితే వారు కేవలం 20 శాతానికి మించి ఉండరన్నారు. రాష్ట్రంలో 55 నుంచి 60 శాతం మంది చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో పోటాపోటీ గా ఉన్న స్థానాలలోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ దెబ్బతో జగన్ మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అన్న ఆయన, నెల రోజుల క్రితం అయితే యుద్ధానికి సిద్ధమేమో కానీ ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమేనని అన్నారు.

సిద్ధము లేదు… యుద్ధము లేదు అంటూ అపహాస్యం చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల ఇళ్లపై వైకాపా నాయకులు జెండాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, బహుశా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారనే నమ్మకం లేదన్నారు.

ఉభయ గోదావరి జిల్లాలలో ఇంటింటికి మంచి నీటి పథకానికి అనూహ్య స్పందన
ఉభయగోదావరి జిల్లాలలో ఇంటింటికి మంచినీటి పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చుట్టూ నీళ్లు ఉన్నప్పటికీ ఆక్వా కల్చర్ కారణంగా తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉభయగోదావరి జిల్లాలలో నెలకొందన్నారు. ఇప్పుడు స్థానికులకు తాగు నీటి ని సరఫరా చేయడానికి ఇంటింటి మంచినీరు అందించే పథకం ఎంతో దోహదపడుతుందన్నారు.

విద్వేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి పైపులైను ద్వారా ఇంటింటికి మంచి నీరును అందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు ఆశపడి ఈ పథకాన్ని నీరు కార్చారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఇప్పటికీ గోడల పైన హర్ ఘర్ కి జల్… ఇంటింటికి మంచినీరు అన్న రాతలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

అప్పటి జిల్లా కలెక్టర్ రాజు, నేను ఈ పథకం అమలు కోసం తీవ్రంగా కృషి చేశామని చెప్పారు. కానీ ప్రభుత్వ పెద్దలు 50% కమిషన్ కు ఆశపడి, ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని, అలాగే చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలోను ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు.

ఇది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన పథకమని, ఈ పథకం మన ప్రాంత ప్రజలను తీవ్రంగా ఆకర్షించిందన్న రఘురామకృష్ణంరాజు, ఉభయగోదావరి జిల్లాలలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎస్సీ సామాజిక వర్గాన్ని తడి గుడ్డతో గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి
నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూనే ఎస్సీ సామాజిక వర్గాన్ని తడిగుడ్డతో జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల కొన్ని ప్రశ్నలను సంధించారని గుర్తు చేశారు.

ఏ సామాజిక వర్గం అయితే మిమ్మల్ని నమ్ముకుందో ఆ సామాజిక వర్గాన్ని తడి గుడ్డతో గొంతు కోసిన మాట నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారన్న రఘురామకృష్ణం రాజు, ఇదే విషయమై తాము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నామని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నాకేసిన మాట నిజం కాదా అంటూ షర్మిల ప్రశ్నించారని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను, నిజంగానే జగన్మోహన్ రెడ్డి దారి మళ్ళించారని తెలిపారు.

అమ్మ ఒడి పథకం పేరిట దళిత విద్యార్థులకు ఇచ్చే నిధులను, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఖర్చు చేసినట్లుగా చూపించారన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అన్నదే లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎత్తేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో వ్యవసాయం చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేసి, దళితులకు భూములను ఇచ్చే వారని, జగన్మోహన్ రెడ్డి ఆ పథకానికి మంగళం పలికారన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఎంత చదివారో తెలియదు కానీ అంబేద్కర్ పేరిట ఉన్న విదేశీ విద్య పథకానికి ఆయన పేరును తొలగించి, తన పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అయినా ఇంకా ఎస్సీలను మోసం చేయగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇస్తారో, భాస్కర్ అవార్డు ఇస్తారో ప్రజలే నిర్ణయించాలన్నారు. ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నది లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఈ స్కీం ను, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా కొనసాగించారని గుర్తు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దళిత విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరిట 50 నుంచి 60 వేల రూపాయల లబ్ధి చేకూరే పథకాన్ని ఎత్తివేసి, అమ్మ ఒడి పేరిట 13వేల రూపాయలను ఇచ్చి సరిపెడుతున్నారన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేయడానికి ఒకరు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం నుంచి తిరిగి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేస్తామని న్యాయస్థానానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విన్నవించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి , శవాన్ని పార్సిల్ చేసిన ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి తన చుట్టే పెట్టుకుంటాడన్నారు. మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని నడిరోడ్డుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్య చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలన్నీ ఇప్పుడిప్పుడే ప్రజలకు పూర్తిగా తెలుస్తున్నాయని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గంలోనూ కొంత చైతన్యం వచ్చిందని, అయినప్పటికీ మతం మత్తులో కొద్ది శాతం మంది ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడే అవకాశం ఉందన్నారు.

ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలను జగన్మోహన్ రెడ్డి తడి గుడ్డతో గొంతు కోశారని, దాని ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందన్నారు. రాత్రికి, రాత్రి అద్భుతాలను ఆశించడం లేదు కానీ, ప్రజల్లో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైకాపా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలను పరిశీలించిన తర్వాత ప్రజలు కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సీట్లను కట్టబెట్టబోతున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు.

విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు
విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రాష్ట్రానికి నూతన పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించగలిగిన సమర్థత నారా చంద్రబాబు నాయుడు కే ఉన్నదని ప్రజలు భావిస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే మన పిల్లలు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని యోచిస్తున్నారన్న ఆయన, అనంతపురం జిల్లాలో ఏర్పాటు అయిన కియా పరిశ్రమ దానికి ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పారు. కియా పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.

గతంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటుకు కృషిచేసి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విశ్వసనీయత చంద్రబాబు నాయుడుకు ఉన్నదని తెలిపారు. అందుకే ప్రజలు ఆయన్ని విశ్వసిస్తున్నారని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చేస్తానని మాయ మాటలు చెబితే ప్రజలు విశ్వసించి మోసపోయారన్నారు.

సిబిఐ న్యాయస్థానం జడ్జి బదిలీని నిలిపివేయాలని కోరాం
జగన్మోహన్ రెడ్డి పై కొనసాగుతున్న కేసులను త్వరితగతిన విచారించాలని, కేసుల విచారణ ఆలస్యం కాకుండా అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఏడాదిన్నర క్రితమే 1170 సార్లు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణకు కోర్టుకు హాజరు కాకుండా వాయిదాలను కోరారన్నారు.

కేసుల విచారణకు ఆయన కోర్టుకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు తెలిపారు. పిటిషన్ విచారించి, సిబిఐ ని కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారన్నారు . 2013లో జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ మొదలైనప్పటి నుంచి ఇప్పటికే ఆరు మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారని సిబిఐ తన కౌంటర్లో పేర్కొంది. రెడ్డోచ్చే ఆట మొదలు అన్నట్టు… పరిస్థితి తయారయ్యిందని, జగన్మోహన్ రెడ్డి కేసులను విచారించడానికి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, రోజువారి విచారణకు ఆదేశించాలని సిబిఐ కోరింది.

పొరుగు రాష్ట్రానికి కేసులు బదిలీ చేస్తే, సాక్షులు అంతా ఒక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే ఇబ్బందని తెలియజేసింది అన్నారు. సుప్రీంకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే, తెలంగాణ హైకోర్టు సిబిఐ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఆదేశాలను జారీ చేసిందన్నారు.

ఈ కేసుల విచారణ పూర్తి అయ్యేవరకు సిబిఐ న్యాయమూర్తి బదిలీ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇండిపెండెంట్ అభ్యర్థి కాదు… ఆయన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థి కాదని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ప్రజల్ని తప్పు దోవ పట్టించే విధంగా తనకు తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

ఒకవైపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, మరొకవైపు కలిదిండి రామచంద్ర రాజు ఫోటోలను తన పోస్టర్లపై ముద్రించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వామపక్ష భావజాలం కలిగిన పార్టీ అని, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివరామరాజు వామపక్ష భావాలున్న నాయకుల ఫోటోలను తన పోస్టర్లపై ముద్రించికోవాలన్నారు. అంతేకానీ ఇంకా తాను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడునని నమ్మించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు ఫోటోను ముద్రించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

2009లో శివరామరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కలిదిండి రామచంద్ర రాజు అబ్బాయి శ్రీనివాసరాజుకు 2014లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి, చివరకు సీటును అమ్ముకున్నారన్నారు.చివరకు తన పదవీకాలంలో ఏ ఏం సి మార్కెట్ చైర్మన్ పదవిని కూడా కాసులకు అమ్మేసుకున్నారని ఉండి ప్రాంత ప్రజలు చెబుతున్నారన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో కలిదిండి రామచంద్ర రాజు, అబ్బాయికి దారుణమైన అన్యాయం చేసి ఇప్పుడు ఆయన ఫోటో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు . ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తో పొత్తు పెట్టుకోలేదన్నారు.

శివరామరాజు పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న శివరామరాజుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. శివరామరాజుపై తగిన చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

గుర్తింపు పొందిన ఒక పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తిపై పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని, శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించే అవకాశం కూడా లేకపోలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

వైకాపా ఆర్థిక సహాయం, సాక్షి దినపత్రిక మద్దతుతో శివరామరాజు ప్రజలని మభ్య పెట్టే విధంగా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలకు వివరించడానికే తప్ప, ఆయనకు ఓట్లు పడతాయని ఇదంతా చెప్పడం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అంబేద్కర్, అల్లూరి విగ్రహాలకు దండలు వేస్తున్నాను… నాలుగు కూడళ్లలో ప్రజలతో మమేకమవుతున్నాను
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడ అంబేద్కర్ విగ్రహం, అల్లూరి సీతారామరాజు విగ్రహం కనిపించినా వాహనం దిగి వెళ్లి పూలమాలలు వేసి ఆ మహానుభావులకు నివాళులు అర్పిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నాలుగు కూడళ్లలో ప్రజలతో మమేకమవుతున్నాను. ఎండలు సైతం లెక్కచేయకుండా ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాను.అయినా ఇవేమీ సాక్షి దినపత్రిక కంటికి కనిపించడం లేదని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

వ్యాన్ లో నుంచి నేను దిగలేకపోతున్నానని సాక్షి దినపత్రికలో రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. తమ పార్టీ అభ్యర్థుల గురించి సాక్షి దినపత్రిక రాయడం లేదన్న ఆయన, పివిఎల్ నరసింహారాజు పేలుతున్న అవాకులు, చవాకులకు గురించి రాస్తున్నారన్నారు. కళ్ళెదురుగా దారుణమైన పరాభవం కనిపిస్తుంటే మతిభ్రమించి సాక్షి దినపత్రిక అడ్డగోలు రాతలు రాస్తుందన్నారు. అక్రమ సంబంధం గురించి అంతగా బయట పెట్టుకోవడం మంచిది కాదని, సక్రమ సంబంధానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ రఘురామ కృష్ణంరాజు సెటైర్ వేశారు.

పివిఎల్ నరసింహారాజు గురించి రాస్తే బాగుంటుందని ఆయన సాక్షి దినపత్రిక యాజమాన్యానికి తెలిపారు. అంతేకానీ ఏకపక్ష రాతల ద్వారా ప్రజలని మభ్య పెట్టాలనుకుంటే, ప్రజలు మోసపోరని సాక్షి దినపత్రిక యాజమాన్యం గుర్తించాలన్నారు.

Leave a Reply