Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న గృహనిర్మాణ పథకం : అత్యధిక ప్రచారం.. అత్యంత అవినీతిమయం

• 2023 జూన్ నాటికి 28లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకుంటే, ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలి
• పేదల బలహీనతను సెంటుపట్టాల పేరుతో జగన్ అండ్ కో సొమ్ముచేసుకున్నారు

• రాష్ట్రంలో 30లక్షల ఇళ్లు అవసరమన్న జగన్, కేవలం 14.52లక్షల మందికే పనికిరాని సెంటుపట్టాలు ఎందుకిచ్చాడు?
• జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పించాల్సిన జగన్ ప్రభుత్వం, నిధులకోసం కేంద్రాన్ని అర్థించి, ఛీ కొట్టించుకుంది
• చంద్రబాబుకి పేరొస్తుందన్న అక్కసుతో, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 3లక్షల టిడ్కో ఇళ్లను జగన్ పాడుపెట్టాడు
-టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు 

భారతదేశంలోనే గొప్పపథకమని జగన్ ప్రచారంచేసిన ‘జగనన్నగృహనిర్మాణ పథకం’ నిజంగా దేశంలోనే అత్యధికప్రచారంతో అత్యంత అవినీతిమయమైన పథకంగా నిలిచిందని, ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పేరుగొప్ప-ఊరుదిబ్బ అన్నతీరుగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీప్రభుత్వాలు 1983 నుంచి 2011 వరకు రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా, అవినీతికి తావులేకుండా 53లక్షల ఇళ్లు నిర్మిస్తే, జగన్ మాత్రం ఒకేసారి 30లక్షల ఇళ్లునిర్మిస్తానని ప్రజల్ని నమ్మించి, వారిబలహీనతను సొమ్ముచేసుకొని తనపార్టీనేతలకు దోచిపెట్డాడన్నారు.

2023 జూన్ నాటికి 28లక్షలఇళ్ల నిర్మాణం పూర్తిచేయకుంటే, జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాలి
“జగన్ ప్రభుత్వంలో అత్యధికప్రచారంతో, అత్యంత అవినీతిమయంగా మారిన పథకం ‘జగనన్న గృహనిర్మాణ పథకం’. 30లక్షల ఇళ్లు నిర్మిస్తానని, 2023 జూన్ నాటికి రూ.50వేలకోట్లతో 28లక్షలుపూర్తిచేస్తానని జగన్ హామీఇచ్చాడు. చెప్పిన గడువు లోగా రూ.50వేలు కోట్లు ఇళ్లనిర్మాణానికి కేటాయించి, 28లక్షల ఇళ్లు నిర్మించకపోతే, జగన్ తనపదవికి రాజీనామా చేయాలి. జగన్ మాటలునమ్మి, చేతిలో ఉన్నడబ్బుతో రాష్ట్రంలో ఈ మూడేళ్లలో 68వేల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుంటే, వారికి నేటికీ పూర్తిగా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. వారికి కూడా ఎప్పటిలోగా డబ్బులుచెల్లిస్తాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. 30లక్షల ఇళ్లు అవసరమన్న జగన్, కేవలం14.52లక్షల మందికే సెంటు పట్టాలుఇచ్చాడు. జగన్ ఇచ్చే సెంటు పట్టాలు నివాసయోగ్యానికి పనికిరావని చాలా మంది వాటిని తిరస్కరించారు. పట్టాలు తీసుకున్నవారు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుం దన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. విజయవాడలో నివాసముండే సాధారణప్రజలకు, ఎక్కడో దూరంగా అమరావతి ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇస్తే, వారి జీవనోపాధి ఏం అవుతుందన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇళ్లనిర్మాణం పేరుతో జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను దారుణంగా మోసగించాడు.

సెంటుపట్టాల పేరుతో సేకరించిన భూముల్లో వేలకోట్ల అవినీతి… రూ.50వేలకోట్లతో 30లక్షల ఇళ్లునిర్మిస్తానన్న జగన్, మూడేళ్లలో ఖర్చుచేసింది కేవలం రూ.5,900కోట్లు మాత్రమే
జగనన్న గృహనిర్మాణ పథకం కింద రూ.28వేలకోట్లతో ప్రభుత్వం భూసేకరణ చేపడి తే, దానిలో సగానికిపైగా సొమ్ము అవినీతిపరుల పాలైంది. క్షేత్రస్థాయిలో ఎకరం రూ.5 లక్షలు విలువచేసే భూమిని రూ.10లక్షలు, అంతకంటే ఎక్కువకు కొన్నారు. ఆఖరికి భూమిచదును, మట్టితోలకం, లే అవుట్ల నిర్మాణంపేరుతో కూడా వేలకోట్లను వైసీపీ నేతలు స్వాహాచేశారు. ఇళ్లస్థలాలకు మట్టితోలేందుకు ఆఖరికి చెరువులు, కాలువ గట్లను కూడాతవ్వేశారు. జగన్ ప్రభుత్వం ఇంటినిర్మాణానికి ఇచ్చే అరకొర ఆర్థిక సాయంతో ఎక్కడా ఇళ్లు పూర్తిచేసుకోలేని దుస్థితిలో లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం ఇస్తానన్నఇసుక, సిమెంట్, ఇనుము ఏవీఅందక, లబ్ధిదారుల చేతిలో సొమ్ములేక మధ్యలోనే లక్షల ఇళ్లనిర్మాణం నిలిచిపోయింది. రూ.50వేలకోట్లతో ఇళ్లునిర్మిస్తానన్న జగన్, బడ్జెట్లో మాత్రం కేవలం రూ.12వేలకోట్లు మాత్రమే కేటాయించి, మూడేళ్లలో మరీ తక్కువగా రూ.5,900కోట్లు మాత్రమే ఇళ్లనిర్మాణానికి ఖర్చుచేశాడు. ఈ లెక్కన జగన్ హామీ ఇచ్చిన 28లక్షల ఇళ్లనిర్మాణం పూర్తికావడానికి పదేళ్లు పడుతుంది. ఇళ్లనిర్మాణానికి ఏపీప్రభుత్వం కేంద్రాన్ని నిధులుకోరితే, తిరస్కరణ ఎదురైంది. 2019 నుంచి ఇళ్లపట్టాలు ఎందరికి ఇచ్చారు.. ఇళ్లనిర్మాణానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారనే ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం వద్ద సమాధానంలేదు. టీడీపీప్రభుత్వం ఇంటినిర్మాణానికి పల్లెల్లో రూ.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలు సాయంచేస్తే, రూ.లక్ష కేంద్రం ఇచ్చిం ది. టీడీపీప్రభుత్వం 3.13లక్షల టిడ్కోఇళ్లను నిర్మించిందని కేంద్రప్రభుత్వం చెప్పింది. టీడీపీకి పేరు వస్తుందన్న అక్కసుతో నూటికి నూరుశాతం నిర్మాణంపూర్తైన 51వేల టిడ్కోఇళ్లను జగన్ లబ్ధిదారులకు కేటాయించకుండా వాటిని పాడుపెట్టాడు. చంద్ర బాబు పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లు పాడుపెట్టి, తాను నిర్మిస్తానన్న 30లక్షల ఇళ్లు నిర్మించకుండా జగన్ కేవలం కాగితాలకే జగనన్న గృహనిర్మాణ పథకాన్ని పరిమితం చేశాడు. తన భారతి సిమెంట్, తనప్రభుత్వ ఇసుక అమ్ముకోవడానికే జగన్ ఇళ్ల నిర్మాణం అని ప్రజల్ని ప్రలోభపెట్టాడు. రాష్ట్రంలోని ఇసు క రీచ్ లన్నింటినీ గంపగుత్తగా శేఖర్ రెడ్డి అనేవ్యక్తికి అప్పగించిన జగన్, పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఎలా ఇస్తాడు?

ఓటీఎస్ ద్వారా వచ్చేసొమ్ముతో ఇళ్లనిర్మాణం పూర్తిచేయడానికి ప్రయత్నించి జగన్ భంగపడ్డాడు
ప్రజలకు ఇస్తున్న పథకాల జాబితాలో జగన్, తాను ఇచ్చే ఇంటి విలువ రూ.10లక్షలని పేర్కొంటూ కరపత్రాలు కూడా పంచుతున్న జగన్, ఆ పదిలక్షల ఆస్తిని ప్రజలకు ఎప్పుడు ఇస్తాడో సమాధానం చెప్పాలి. ఇళ్లనిర్మాణాన్ని అటకెక్కించిన జగన్, ఆఖరికి ఎప్పుడో 1980లకు ముందు కట్టినఇళ్లన్నీ రెగ్యులరైజ్ చేసుకోవా లంటూ ఓటీఎస్ పేరుతో దాదాపు రూ.4,800కోట్ల వసూలుకు సిద్ధమ య్యాడు. దశాబ్దాలక్రితం ప్రజలు కట్టుకున్నఇళ్లకు జగన్ రెడ్డికి ఎందుకు పన్నుకట్టాలి? ప్రజలంతా ఓటీఎస్ కింద డబ్బుకట్టకపోతే, పథకాలు రేషన్ కార్డులు రద్దుచేస్తామని బెదిరించారు. ప్రజలమెడపై కత్తిపెట్టి, ఓటీఎస్ కింద ఈప్రభుత్వం రూ.500కోట్లవరకు వసూలుచేసింది. ఓటీఎస్ ద్వారా వచ్చేసొమ్ముతో ఇళ్లనిర్మాణం పూర్తిచేయాలని ప్రయత్నించి జగన్ భంగ పడ్డాడు. ఓటీఎస్ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి, క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలపై దాడులకు తెగబడ్డాక, విధిలేక రాష్ట్రప్రభుత్వం వెనక్కు తగ్గింది.” అని అశోక్ బాబు తెలిపారు.

LEAVE A RESPONSE