Home » జైలు.. జనసంద్రం.. ఒక బాబు!

జైలు.. జనసంద్రం.. ఒక బాబు!

– గంటలపాటు సాగిన ప్రజా ప్రస్థానం
– జనసైనికులతో పెరిగిన అనుబంధం
– జైలు జీవితంతో బాబుకు కొత్త పాఠాలు
– తానేమిటో తెలుసుకున్న తెలుగుదేశాధీశుడు
– జనం పల్సు చాటిన ప్రయాణ ప్రస్థానం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి, విపక్ష నేతగా సుదీర్ఘ కాలం పనిచేసి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ఎంపికను నిర్దేశించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు.. జనంలో తనకు ఇంత క్రేజు-ఇమేజ్ ఉందన్న విషయం, బహుశా మొన్నటి వరకూ బహుశా ఆయనకే తెలిసి ఉండకపోవచ్చు. లేకపోతే ఒక వ్యక్తి కోసం 14 గంటల పాటు నిశిరాత్రి కూడా, జనసమూహం నడిరోడ్లపై నిలబడి ఎదురుచూడరు.

జై ఆంధ్రా ఉద్యమంలో జైలు కెళ్లి వారికి, ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తొలినాళ్లలో ఆయనను చూసేందుకు వచ్చిన సందర్భంలోనే ఆ దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఎన్టీఆర్ కోసం అర్ధరాత్రి వరకూ జనం మిద్దెలు, మేడలూ ఎక్కి వేచిచూసిన దృశ్యాలు చూశాం. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు 14 గంటల యాత్రను చూశాం. ఇద్దరిలో ఒకటే తేడా.. ఎన్టీఆర్ హీరో.ఆయన ప్రసంగం అద్భుతం. అనన్యసామాన్యం. చంద్రబాబులో ఆ రెండూ లేవు. అయినా ఆ స్థాయి జనాదరణ. అన్నకు-అల్లుడికీ అదే తేడా!

మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత, అలాంటి అరుదైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికయింది. అంతమంది అభిమానం సంపాదించుకోవడం ఎవరికైనా ఆషామాషీ కాదు. అలాంటి అరుదైన గౌరవం చంద్రబాబుకు లభించినట్లు, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు టు హైదరాబాద్ వయా ఉండవల్లి వరకూ సాగిన జనయాత్ర నిరూపించింది. ఇదంతా ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో, తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న అభిమాన సౌథమే అన్నది నిష్ఠుర నిజం.

నిజానికి చంద్రబాబు మామ ఎన్టీఆర్ మాదిరిగా అందరినీ ఆకర్షించేంత అందగాడు కాదు. జనాలను మెప్పించేలా అనర్గళంగా మాట్లాడే నేత కూడా కాదు. నవ్వుతూ ఉండే ఫొటోలు కూడా కనిపించవు. ఇంగ్లీషు, హిందీ భాషలపై పెద్దగా పట్టు కూడా కనిపించదు. ఏ విషయం సూటిగా తేల్చే నైజం కూడా కాదు. పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కార్యకర్తలు, ఆర్ధికంగా నష్టపోతున్న నాయకులకూ, ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు నచ్చవు. ఆయన అపాయింట్‌మెంట్ వ్యవహారమంతా ఓ నచ్చుమేళం. కానీ నిరంతరం జనంలో నానే కార్యదీక్షాపరుడు. రాజకీయమే ఆశ-శ్వాస-ధ్యాస. అవే ఆయన కోసం తెల్లవారుఝాము వరకూ జనసమూహం వేచి ఉంచేలా చేశాయి.

జనం కష్టాల్లో భాగస్వామిగా మారి, వారిని ఓదార్చే రాజకీయ వేత్త. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రంలో ఉపద్రవం జరిగితే.. ప్రభుత్వం కూడా చేయలేని సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం కంటే ముందే సొంత ఖర్చుతో చేపట్టిన సాహసి. బాధితులకు పార్టీ పక్షాన విమానాలు-రైళ్లు-బస్సులూ పెట్టి, భోజన వసతి సౌకర్యాలు కల్పించి, తిరిగి ఇంటికి భద్రంగా చేర్చే వరకూ బాధ్యత తీసుకున్న మానవతావాది.

తుపాన్లు, వరదలు వస్తే ఇంట్లో కూర్చుని దుప్పటి ముసుగేసుకోకుండా, కార్యరంగంలోకి దూకే దీక్షాదక్షుడు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలు- ప్రత్యర్ధుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పిల్లలు అనాధలు కాకుండా, వారిని సొంత ఖర్చుతో చదువులు చెప్పిస్తున్న మానవత్వం ఆయనలో దర్శనమిస్తుంది.

మారుమూల ప్రాంతాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చే బాధితులకు సమయమిచ్చి మాట్లాడి, భరోసా ఇవ్వడం బాబులో ఉన్న ఒక సుగుణం. మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అగ్రనేతలను సైతం కలవకుండా వారిని దూరంగా ఉంచే ఈ రోజుల్లో.. చంద్రబాబు లాంటి నేత ఒకరు ఉండటం నేతలు – బాధితులకు చాలా గొప్ప ఊరట.

తన వద్దకు వచ్చేవారికి కాఫీ ఇచ్చి, యోగక్షేమాలు విచారించే నేతలు ఇంకా ఉన్నారా అని, చంద్రబాబును చూస్తే అనిపిస్తుంటుంది. ఆ మర్యాద, గౌరవమే చంద్రబాబును వేలాదిమందికి చేర్చింది. నాయకులు సహా ఎవరైనా కోరుకునేది, అలాంటి గౌరవ మర్యాదనే. అది బాబు దగ్గర లభిస్తుందుకే చాలామంది బాబును అభిమానిస్తుంటారు. చంద్రబాబు-జగన్ మధ్య ఉన్న ప్రధాన సారూప్యం అదే.

చాలామందికి జగన్‌తో ఎలాంటి వైరం ఉండదు. కాకపోతే జనబాహుళ్యంలో ఆయన వ్యక్తిగత నైజం గురించి ఉన్న ప్రచారం వల్ల, ఆయనను ఎక్కువమంది ఇష్టపడరు. ఆయన వద్ద ఎవరికీ గౌరవమర్యాదలు దక్కవని, మంత్రులు సహా ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వరన్న ప్రచారం బహిరంగమే. బహుశా ఇలాంటి ప్రచారం వల్లనే చాలామంది జగన్‌ను పోల్చుకుని, చంద్రబాబును అభిమానిస్తుంటారు. అంతే తప్ప జగన్‌తో వారికెలాంటి వ్యక్తిగత వైరం ఉండదు. అలాగ ని ఆ కోణంలో బాబును అభిమానించే వారికి, ఆయన వల్ల వచ్చే ప్రయోజనమూ ఉండదు. ఇదంతా మానసిక భావనే.

దశాబ్దాల నుంచి సంపాదించుకున్న ఆ అభిమానం.. నిరంతరం జనక్షేత్రంలో ఉండి, జనం కష్టాల్లో భాగస్వామి అయినందుకే..బాబు రాజమండ్రి టు హైదరాబాద్ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారన్నది సుస్పష్టం. జనాలకు ఏమీ చేయకపోతే నిశిరాత్రి వేళ కూడా జనం ఎందుకు ఎదురుచూస్తారు? చంద్రబాబు ఏమైనా చిరంజీవి-పవన్-మహేష్-ఎన్టీఆర్ మాదిరిగా సినిమా హీరో కాదు కదా!

లేకపోతే సర్కారు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు.. కారులో ముప్పావుగంటలో పూర్తయ్యే విజయవాడ పర్యటన, ఏకబిగిన 14 గంటలపాటు ఎలా సాగుతుంది? నిజానికి చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, రాజమహేంద్రి నుంచే జన ప్రవాహం పోటెత్తింది. పోలీసులకూ నియంత్రణ సాధ్యం కాలేదు. ముసలి ముతక అంతా రోడ్డుపైకొచ్చిన దృశ్యాల ముచ్చట ఈ మూడు దశాబ్దాల్లో ఎప్పుడైనా విన్నారా? కన్నారా? రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలిచినా, ఓడినా ఇదొక చరిత్ర.

ఇక అక్కడి నుంచి గోదావరి, కృష్ణా జిల్లాల మీదుగా సాగిన బాబు పర్యటనలో జనం పోటెత్తారు. అర్ధరాత్రి దాటి చంద్రబాబు తన ఇంటికి చేరేందుకే తెల్లవారు దాటిందంటేనే బాబుకు జనంలో ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు. ఆ 14 గంటల సమయంలో ఆయన కనీసం కిందకు దిగలేదు. మూత్రవిసర్జనకూ దిగలేదు. తణుకులో ఒకచోట ఆగి కేవలం టమాటాబాత్, కాఫీ మాత్రమే తాగారట. మరి ఏడుపదుల వయసు దాటిన ఒక వృద్ధనేత.. అన్నేసి గంటలు ఏకబిగిన కూర్చున్నారంటే.. జనం ఏ స్థాయిలో ఆయన కాన్వాయ్‌ను ఆపి ఉంటారో..ఎన్ని వేల మంది అడుగడుగునా ఎదురయ్యారన్నది, బుర్రబుద్ధీ ఉన్న ఎవరికయినా ఇట్టే అర్ధమయి తీరాలి.

పోనీ వైసీపేయుల మాటల ప్రకారం, వారంతా పెయిడ్ బ్యాచ్ అనుకున్నా… డబ్బులిచ్చి తీసుకువచ్చిన వారు చలిలో, తెల్లవారే వరకూ నడిరోడ్లపై నిలబడతారా అన్నది.. మెడపై తల ఉన్న వారికెవరికయినా వచ్చే సందేహం. పైగా మహిళలు అర్ధరాత్రి బాబు వచ్చేవరకూ, రోడ్లపైనే సేదదీరిన దృశ్యాలు మీడియాలో చూసినవే. ఎంపి రఘురామకృష్ణంరాజు మాటల్లో చెప్పాలంటే.. అంతమంది అభిమానం సంపాదించుకున్న చంద్రబాబు ధన్యజీవి.

అందుకే… తనకు ఇంతటి ప్రజాభిమానం ఉందని, బహుశా బాబుకు మొన్నటి వరకూ తెలిసి ఉండకపోవచ్చన్నది ఆయనను దగ్గరగా పరిశీలించేవారి వ్యాఖ్య. ఒకరకంగా జైలు జీవితం బాబుకు తనపై తనకు మరింత నమ్మకం పెంచిందనే చెప్పాలి. పార్టీ-నేతల పనితీరును అంచనా వేసుకునేందుకు దొరికిన అవకాశంగా భావించాలి.

ప్రధానంగా ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్న జనసేన కూడా తాజా సంక్షోభంలో దన్నుగా నిలిచింది. బాబు కోసం తమ్ముళ్లు నిర్వహించిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లోనూ జనసైనికులు కలసి వచ్చారు. ప్రధానంగా బాబు విడుదల తర్వాత జరిగిన పర్యటనలో.. పవన్ కల్యాణ్ సభలకు వచ్చినట్లే జనసైనికులూ తరలిరావడం సానుకూల పరిణామం.

ఇక హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం టెకీస్ తమకు తామే నాయకులుగా మారి, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సభ మరో సంభ్రమాశ్చర్యం. క్వార్టర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకుండానే.. దాదాపు 50 వేల మంది టెకీస్, సకుటుంబ సపరివార సమేతంగా తరలిరావడం మరో అద్భుత ఘట్టం. గతంలో జల్లికట్టు ఉద్యమానికి మద్దతుగా తమిళులు బీచ్‌కు రావాలంటూ, ఎవరికి వారు పంపించుకున్న వాట్సాప్ సందేశం బీచ్‌ని జనంతో నింపేశాయి. గచ్చిబౌలి సభ తీరు దానినే తలపించింది.

బాబు బేగంపేట నుంచి ఆయన నివాసానికి వెళ్లేందుకు మహా అయితే పావు గంట పట్టవచ్చు. అయితే అక్కడ కూడా నాలుగుగంటల ప్రయాణం సాగిందంటే బాబుకు జనం ఏ స్థాయిలో బ్రహ్మరథం పట్టారో అర్ధమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఎక్కడా కాలు కిందకు పెట్టకపోవడం గానీ, ప్రసంగించడం గానీ కనిపించకపోవడమే విశేషం. సహజంగా జనాలను చూస్తే బాబు ఒక పట్టాన ఆగరు. అర్ధగంట ప్రసంగాన్ని గంటన్నర పొడిగిస్తారు. ఆయనకు జనం ఓ బలహీనత.

ఎంపి రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు.. తనకు తెలియకుండానే, తనపై ఇంత ప్రజాభిమానం ఉందన్న నిజాన్ని వెలికితీసేందుకు కారణమయిన ప్రత్యర్ధి జగన్‌కూ చంద్రబాబు రుణపడితీరాలి. అంటే చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో ఉంచకపోతే, ఆయనకు తన గురించి ఎప్పటికీ తెలుసుకునే అవకాశం ఉండేది కాదు.

Leave a Reply