కవి సమ్రాట్” బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ…
విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబిస్తుంది. ఆయన రాసిన రచనల్లో వేయి పడగలు, రామాయణ కల్ప వృక్షం, ఏకవీర తెలుగు పాఠక హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.
తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతీ అక్షరంలోను అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించగలిగిన శక్తి ఆయన సొంతం. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాథ వారు స్పృశించని ప్రక్రియలేదు. తన రచనల ద్వారా కులాతీత, మతాతీత విధానాలను ఎండగట్టారు. ఆధునిక తెలుగు రచయితల్లో ఆయన పేరు లేకుండా తెలుగు సాహిత్య చరిత్ర గురించి వివరించలేం.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి – #ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఆయన చేసిన ”రామాయణ కల్పవృక్షము” అనే పుస్తక రచనకు గాను జ్ఞాన్ పీఠ్ అవార్డు అందుకున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబరు 10న కృష్ణా జిల్లాలోని నందమూరులో జన్మించారు. ఆయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి సత్యనారాయణ. తన ప్రసంగాల ద్వారా ఏదైతే చెప్పేవారో అదే ఆచరించి చూపేవారు. ఆయన రాసిన ‘‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’’ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది.. ఆయన రాసిన వరలక్ష్మీ శ్రీశతి అనే స్మృతికావ్యం పాఠకులను మరో లోకంలోకి విహరింపజేస్తుంది. చారిత్రక నవల చద్దెన్న సేనాని ఆయనకు ప్రతిష్ఠ తెచ్చింది.
శ్రీశ్రీకి వీరికి……..
శ్రీశ్రీకి వీరికి చుక్కెదురు.”నా వంటి కవి మరో వెయ్యేళ్ళ వరకూ పుట్టడు” అని విశ్వనాధవారు అంటే, శ్రీ శ్రీ గారు”నిజమే! వారు పుట్టి వెయ్యేళ్ళు అయింది” అనే వారు. అయినప్పటికీ శ్రీశ్రీ గారి మహా ప్రస్తానంలోని “కవితా! ఓ కవితా” అనే గేయాన్ని శ్రీశ్రీ ముఖతః విన్న తరువాత ఆనంద బాష్పాలతో మనసారా శ్రీశ్రీ ని కౌగలించుకొని అభినందించారు.అలాగే శ్రీశ్రీకి కూడా వీరంటే గౌరవం.శ్రీశ్రీ ఇలా విశ్వనాథను పొగిడారు ఒక సందర్భంలో,”నేను చిన్నతనంలో కలం పట్టిన కొత్తరోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు కవులలో విశ్వనాథవారొకరు. నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం. వారంటే నాకు గౌరవ భావం. ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు. అయినా భారతీయ భాషలన్నిటిలోనూ ఒక్క తెలుగులోనే గొప్ప కవిత్వం ఉందనడంలో ఇద్దరమూ ఏకీభవిస్తాం.”
సంచలన రచనలు:
నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితా ధోరణుల మీద ఆయన రాసిన విమర్శనాత్మక వ్యాసాలు ఆణిముత్యాలు. కొన్ని రచనలను రేడియో నాటికలుగా మలిచారు. ఆయన రచనలను ఇతర భాషల్లో కూడా అనువదించారు. ఆయన రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు. అమృత శర్మిష్ఠమ్, గుప్త పాశుపతమ్, అనే నాటకాలను, ఆశనిరాశకు అనే నాటికను, దేవీత్రిశతి, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించారు. వీరిరచనలన్నీ సంచలన రచనలే. సత్యనారాయణ చేపట్టని ప్రక్రియకాని, ప్రయోగం కానీ లేదు.
విశేషమైన ప్రతిభా పాటవాలు:
వారి నవల, కథ , నాటిక, పాట, ఏదైనా తగిన పరిష్కారాన్ని అందించే విధంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన పద్య రచన అపూర్వం. సంస్కృత నాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి ప్రసిద్ధమైనవి. ఆయన కొన్ని పత్రికలకు సంపాదకులుగా కూడా పని చేశారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.
గుర్తింపు..అవార్డులు:
కోల్‌కతా, ముంబయి ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు వంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. 1964లోఆంధ్ర విశ్వ కలా పరిషత్ విశ్వనాథ వారిని కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది.
కవిగా పండితునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడుగా, గాయకుడిగా రాణించిన విశ్వనాథ వారు 1976 అక్టోబరు 18న తనువు చాలించారు. ఆ అద్భుత ప్రతిభాశాలి నడిచిన సాహితీసేవా మార్గంలో నేటి యువత చిత్తశుద్ధితో అడుగులు వేయాలని ఆశిద్దాం.
Collected by
A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu
Amaravathi mandal
Palanadu district.