Suryaa.co.in

Andhra Pradesh

జగన్ సర్కారు అరాచకంపై లోకేష్ “శంఖారావం”

-11నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన
-రోజుకు 3 నియోజకవర్గాల్లో కేడర్ తో సమావేశాలు

అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర స్పూర్తితో యువనేత లోకేష్ ఈనెల 11వతేదీనుంచి “శంఖారావం” పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి యువనేత పర్యటన సాగనుంది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11రోజులపాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టడం, అదే సమయంలో వివిధవర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.

నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యువనేత లోకేష్ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్ తో సమావేశమవుతారు. 58నెలలుగా ఉత్తరాంధ్రలో జగన్ అండ్ కో చేసిన విధ్వంసం, ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కరానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు.

శంఖారావం యాత్ర సందర్భంగా వైసిపి పాలనలో తప్పుడు కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలు, వివిధవర్గాల ప్రజలకు యువనేత లోకేష్ భరోసా కల్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు, మహిళలపై మారణహోమం సృష్టించారు. వైసిపి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 80మంది టిడిపి కార్యకర్తలకు హత్యలకు గురయ్యారు.

వీరితోపాటు 188మంది దళితులు, 63మంది ఎస్టీలు, 40మంది బిసిలు, 23మంది మైనారిటీలను జగన్ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కేడర్ పై 2లక్షలు, బిసిలపై 26వేలు, ఎస్సీలపై 11వేల భౌతిక దాడులు జరిగాయి. జగన్ అరాచకపాలనలో రాష్ట్రంలో మహిళలపై 52,587 నేరాలు జరిగాయి. అంటే రోజుకు సగటున 50, గంటకు రెండు నేరాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బి) గణాంకాలు చెబుతున్నాయి.

మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 గా నిలిచింది. ఇక జగన్ అసమర్థ పాలన కారణంగా 4వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేనికారణంగా 50వేలమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. ధనదాహంతో జగన్ ప్రవేశపెట్టిన జె-బ్రాండ్ల మద్యం తాగి 30వేలమంది మృత్యువాతపడ్డారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వ హత్యలే.

గత ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. అధికారపార్టీ పెద్దల అవినీతి, దౌర్జనాలను ఎండగడుతూ 226రోజులపాటు 3132 కి.మీ.లు కొనసాగిన యువగళం… అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జగన్ పాలనలో బాధితులు మారిన అన్నివర్గాల ప్రజలకు నేనున్నాని భరోసా ఇస్తూ రాయలసీమ, కోస్తాంధ్రలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర జైత్రయాత్రలా సాగింది.

ఈ యాత్ర ద్వారా సుమారు కోటిమంది ప్రజలను యువనేత లోకేష్ నేరుగా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో కూడా యువగళం పాదయాత్ర కొనసాగాల్సి ఉన్నప్పటికీ అధికారపార్టీ కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో 79రోజులపాటు యాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వతేదీన యువనేత లోకేష్ యువగళం పాదయాత్రను అనివార్యంగా ముగించారు. యువగళం ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం పేరుతో నిర్వహించిన బహిరంగసభ ఈ దశాబ్ధంలో అతిపెద్ద సభగా చరిత్ర సృష్టించింది.

తొలుత నిర్ణయించిన ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువగళం పాదయాత్ర కొనసాగకపోవడంతో… ఆ ప్రాంతప్రజలు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు శంఖారావం పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతున్నారు. శంఖారావం మొదటి మూడు రోజుల షెడ్యూల్: 11-2-24 న ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి 12-2-24 న నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస,13-2-24 న పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరగనుంది.

LEAVE A RESPONSE