Suryaa.co.in

Andhra Pradesh

జీవో 107, 108లతో బడుగులకు వైద్య విద్య దూరం

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలు
విద్యను కూడా వ్యాపారం చేస్తున్న జగన్ సర్కార్
సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ ఫీజుల బాదుడు
2004 నుంచి 2014 కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
– జీవోల రద్దు కోరుతూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

ఉమ్మడి రాష్ట్రం లో 2004 నుంచి 2014 వరకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సాగిన కాంగ్రెస్ పాలనలో అందరికీ సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యంతో కూడా ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ నియామకాలకు సంబంధించి విడుదల చేసిన 107, 108 జీవోల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని నష్టం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఏపీలో డాక్టర్లు తక్కువ..
రాష్ట్రంలో జనాభ ప్రాతిపదికన చాలా తక్కువ మంది డాక్టర్లు ఉన్నారని తెలిపిన గిడుగు రుద్రరాజు, మెరుగైన వైద్య విధానాలతో మంచి డాక్టర్లను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రస్తు వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆరోగ్య శ్రీ ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆం‌ధ్రప్రదేశ్ గా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అవివేక, అనాలోచిత చర్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 107, 108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు విడుదల చేశారు.

రిజర్వేషన్ లకు గండి…
రాష్ట్రంలోని యువతకు తనను తాను మేనమామగా వర్ణించుకునే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాలపై దొంగ దెబ్బ వేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. వైద్య విద్యను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచి లాగేసుకునే విధంగా, దేశంలో ఎక్కడా లేని 107,108 జీవోలను విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. 2023 జులై 19వ తేది ప్రభుత్వం జారీ చేసిన ఈ నూతన జీవోలు రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లతో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా, 107,108 జీవోలతో రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. కొత్త జీవోలపై విద్యార్థి సంఘాలు, కొందరు తల్లిదండ్రులు కోర్టులో కేసు వేసి, న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారని వారితో పాటు కేసులో ఇంప్లీడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వారికి అండగా ఉంటుందని రుద్రరాజు వెల్లడించారు.

750లో 638 ఎంబీబీఎస్ సీట్లు అమ్మకానికే…
మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, నంద్యాలల్లో ప్రారంభమయిన వైద్య కళాశాలల్లో, ఒక్కో కళాశాలకు 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు రాష్ట్రానికి కేటాయించారని పీసీసీ అధ్యక్షులు తెలిపారు. 2023 – 24 విద్యా సంవత్సరానికి గానూ ఈ సీట్లను కన్వీనర్ కోటా కింద బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారమే భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఐదు కళాశాలలకు సంబంధించి మొత్తం 750 సీట్లలో 15 శాతం అంటే 112 సీట్లు జాతీయ కోటా కింద, వివిధ రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేస్తున్నారని చెప్పారు. మిగిలిన 85 శాతం అయిన 638 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా కొత్త జీవోలతో బీ, సీ కేటగిరీలుగా విభజిస్తూ సీట్ల అమ్మకానికి రంగం సిద్ధం చేశారని చెప్పారు.

సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ ప్రైవేటు కళాశాలలతో పోటీగా ఫీజుల వసూళ్లు…
సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ప్రైవేటు వైద్య కళాశాలకు పోటీగా ఫీజులు వసూలుకు రంగం సిద్ధం చేస్తున్నారని గిడుగు రుద్రరాజు మండి పడ్డారు. 107, 108 జీవోల ప్రకారం 638 సీట్లలో 50 శాతం అయిన 319 సీట్లను, సంవత్సరానికి రూ.15 వేల ఫీజు చొప్పున జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. మిగిలిన 319 ఎంబీబీఎస్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ మళ్లా బీ, సీ కేటగిరీలుగా విభజించారని చెప్పారు.

మిగిలిన 50 శాతం (319) సీట్లలో బీ కేటగిరీకి 35 శాతం అంటే 223 సీట్లకు సంవత్సరానికి రూ. 12 లక్షలు చొప్పున, మిగిలిన 15 శాతం అయిన 96 సీట్లను సీ కేటగిరీగా పేర్కొంటూ సంవత్సరానికి రూ.20 లక్షల ఫీజుగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ ఫీజులు బడుగు, బలహీన వర్గాలకు పెను భారం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలలకు పోటీగా ఎంబీబీస్ ఫీజులను ప్రభుత్వానికి చెల్లించాల్సిన దురద్రుష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు ఉన్నా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలకు చెందిన బాగా చదివే తెలివైన విద్యార్థులపైనా లక్షలాది రూపాయిలు ఫీజుల భారం పడుతుందన్నారు.

రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలకూ…
ప్రస్తుతం 2023 – 24 విద్యా సంవత్సరంలో ప్రారంభంకానున్న ఐదు కళాశాలలకు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానమంటూ నూతన ఫీజుల విధానాన్ని ప్రవేశ పెట్టినా, రాబోయే విద్యా సంవత్సరాల్లో పాత ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు కొత్తగా వచ్చే మరో 12 వైద్య కళాశాలలకు కూడా ఇటువంటి జీవోలనే ప్రభుత్వం జారీ చేస్తుందన్న అనుమానాలను పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యక్తం చేశారు.

లక్షలు, కోట్ల రూపాయిలు వెచ్చించి వైద్య విద్యను అభ్యసించిన వారు, సామాన్యులకు ఏ విధంగా సామాజిక స్ర్పహతో వైద్యం చేస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తున్నారు. అందుకే 107,108 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రికి లేఖ రాసామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహాక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మ శ్రీ, డాక్టర్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ చందు సాంబశివుడు, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీ, మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, ఖాజా మోహిద్దీన్ పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE