Suryaa.co.in

Andhra Pradesh

తుది శ్వాస వరకు రాష్ట్ర అభివృద్ధి కోసమే తపించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

– సహచర మిత్రుడిని కోల్పోవడం బాధాకరం
– మేకపాటి భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళి
– కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి కొడాలి నాని

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి తుది శ్వాస వరకు రాష్ట్ర అభివృద్ధి కోసమే తపించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) అన్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ లోని ఇంటి దగ్గరకు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని మంత్రి కొడాలి నాని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మేకపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. కేబినెట్లో సహచర మిత్రుని కోల్పోవడం బాధాకరమని అన్నారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం మేకపాటి గౌతమ్ రెడ్డి సొంతమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
21-PHOTO-2 మరణించడం ప్రభుత్వానికి, రాష్ట్రానికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. అనుకున్న లక్ష్యం చేరుకునే వరకూ విశ్రమించని అరుదైన రాజకీయ నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారన్నారు. ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగిన దుబాయ్ ఎక్స్పోలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చారని కొనియాడారు. ఏపీ పెవిలియన్స్ ను స్వయంగా పర్యవేక్షించారని చెప్పారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో లో పాల్గొని ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారని చెప్పారు. దుబాయ్ ఎక్స్పోలో 11 సెక్టార్లలో 70 ప్రాజెక్టులకు సంబంధించి రూ.5,150 కోట్ల పెట్టుబడులకు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. దీనివల్ల 3,440 మందికి ప్రత్యక్షంగా, 7,800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దుబాయ్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న 24 గంటల లోపే మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచి వేసిందని చెప్పారు. దుబాయ్ ఎక్స్పో గురించి రాష్ట్ర ప్రజలతో స్వయంగా పంచుకోకుండానే మరణించడం బాధాకరమని తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి కొడాలి నాని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A RESPONSE