అమరావతి : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్న స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సాయంత్రం సందర్శించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితిలను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ముందస్తు సమాచారాన్ని అధికారులకు, ప్రజలకు సకాలంలో అందజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సంభవించబోయే భారీ తుఫాను నేపథ్యంలో ఎటువంటి ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం గాని జరగకుండ మందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులు నిరంతరం శిబిరాల వద్ద ఉండి వరద బాధితులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులను, తుఫాను ప్రభావాన్ని టీవీ మానిటర్లలో పరిశీలించారు.