* నేటి (నవంబర్ 3) నుంచి 34 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో ఆత్మీయ సమావేశాలు
* మంత్రి సవిత ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు నిర్వహణ
* విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో…
* కుల, చేతివృత్తుదారులకు గౌరవ ప్రదమైన జీవనమే కూటమి లక్ష్యం
* ఆధునిక పరికరాలతో కుల, చేతివృత్తులకు ఊతమిచ్చేలా ప్రణాళికలు
* జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధుల కేటాయింపుపైనా చర్చ
* చైర్మన్లు, డైరెక్టర్ల విధులు, బాధ్యతల రూపకల్పనపై నిర్ణయం
అమరావతి : మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కుల, చేతివృత్తులకు ఆధునిక హంగులు సమకూర్చుతూ, చేతివృత్తుదారులకు గౌరవప్రదమైన జీవనంతో కూడిన ఆర్థిక భరోసా కల్పించే దిశగా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఆదరణ 3.0తో పాటు స్వయం ఉపాధి పథకాల కింద కుల, చేతివృత్తిదారులకు అత్యాధునిక పరికరాలు అందించాలని యోచిస్తోంది. దీర్ఘకాలిక ఉపాధి అందించాలనే సంకల్పంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లతో సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశాల్లో ఆయా చేతివృత్తిదారులకు ఎటువంటి ఆధునిక పరికరాలు అందించాలనే విషయమై ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత భేటీ కానున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా కార్పొరేషన్ల పాలకమండళ్ల సభ్యులకు, కుల సంఘ పెద్దలకు సమాచారమందించారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కులాలకు చెందిన 57 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో 34 కార్పొరేషన్లకు పాలక మండళ్లను కూటమి ప్రభుత్వం నియమించింది. త్వరలో మిగిలిన పాలక మండళ్లను సైతం నియమించే ప్రక్రియ ఇప్పటికే చేపట్టింది.
అత్యాధునిక పరికరాలతో శాశ్వత ఉపాధి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం సబ్సిడీ రుణాలు అందజేయడంతో పాటు ఆదరణ పథకాన్ని కూడా అమలు చేశారు. చేతివృత్తిదారులకు, కులవృత్తిదారులకు అవసరమైన పరికరాలను అందజేశారు. 2019 ఎన్నికల తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం సబ్సిడీ రుణాలు, ఆదరణ పథకాన్ని నిలిపేసింది. అదే సమయంలో వచ్చిన కోవిడ్ కూడా కులవృత్తులు, చేతివృత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వివిధ ఆయా వృత్తులపై ఆధారపడిన బీసీల జీవనం నరకప్రాయంగా మారింది. రోజులు గడవడమే భారంగా మారింది. ఈ సమయంలో నాలుగో పర్యాయం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు శాశ్వత ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయసాగారు. తూతూ మంత్రంగా పరికరాలు అందజేసి చేతులు దులుపుకోకూడదని నిర్ణయించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో కుల, చేతివృత్తుదారులు నిలదొక్కుకునేలా అత్యాధునిక పరికరాలు అందజేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా సబ్సిడీ రుణాలు అందజేయడంతో పాటు ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఏవిధమైన పరికరాలు కావాలో క్షేత్రస్థాయిలో నేరుగా లబ్ధిదారుల నుంచే వివరాలు సేకరించారు. విజయవాడలో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లు, డెరెక్టర్లు, కుల సంఘాల పెద్దల నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఆయా కార్పొరేషన్లకు జనాభా ధామాషా ప్రకారం ఎంతమేర నిధులు కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. చైర్మన్ల బాధ్యతలు, విధులు వంటి విధానాల రూపకల్పనపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
మొదటిరోజు 10 కార్పొరేషన్ చైర్మన్లతో…
సోమవారం మూడ్రోజుల పాటు విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఆత్మీయ సమావేశానికి 10 కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను, ఆయా కుల సంఘాల పెద్దలను బీసీ సంక్షేమశాఖ అధికారులు ఆహ్వానించారు. శెట్టి బలిజ, కళింగ, కురుబ/కురుమ, పద్మశాలి, నగరాలు, గవర, వన్యకులక్షేత్ర, కుమ్మరి శాలివాహన, గౌడ, రజక కార్పొరేషన్లకు చెందిన పాలక మండళ్లతో మంత్రి సవిత భేటీ కానున్నారు.
రెండో రోజున ఏడు పాలక మండళ్లతో…
రెండో రోజైన మంగళవారం నాయీబ్రాహ్మణ, అగ్నికులక్షత్రియ, వడ్డెర, కొప్పుల వెలమ, వాల్మీకి/బోయ, తూర్పు కాపు/గాజుల కాపు, యాదవ కార్పొరేషన్ పాలక మండళ్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.
మూడో రోజు 17 పాలక మండళ్లతో…
చివరిది మూడో రోజైన బుధవారం 17 పాలక మండళ్లతో మంత్రి సవిత భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అరెకాటికా, ముదలియార్, కృష్ణ బలిజ / పూసల, కురాకుల / పొందార, కుంచిటి వక్కలిగ, వీరశైవ లింగాయిత్, దాసరి, బొందలి, నాగవంశం, పలా-ఏకారి, జంగం, వడ్డేలు, బెస్తా, సగర/ఉప్పర, నూర్ భాషా/దూదేకుల, మస్త్యకర, విశ్వ బ్రాహ్మిణ్ కార్పొరషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు, కుల పెద్దలు పాల్గొననున్నారు.
బీసీల గౌరవప్రదమైన జీవనమే లక్ష్యం
టీడీపీ ఆవిర్భావం నుంచి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ బీసీలకు మేలు చేసే పథకాలనే టీడీపీ ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నారు. స్వయం ఉపాధి రుణాలు, ఆదరణ పథకాలతో కుల, చేతివృత్తులకు అండగా నిలిచారు. మారుతున్న కాలానుగుణంగా కుల, చేతివృత్తులకు సాంకేతిక అందించేలా అత్యాధునిక పరికరాలను అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే స్వయం ఉపాధి యూనిట్లు, ఆదరణ 3.0 పథకంలో శాశ్వత ఉపాధి అందజేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి ఏ ఆధునిక పరికరాలు కావాలో..? ఇప్పటికే అభిప్రాయాలు సేకరించాం.ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకోడానికి మూడ్రోజుల పాటు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కార్పొరేషన్లకు నిధులు, విధులు కేటాయింపుపైనా నిర్ణయాలు తీసుకోనున్నాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుల, చేతివృత్తిదారులకు గౌరవప్రదమైన జీవనంతో పాటు ఆర్థిక భరోసా కలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ఎస్.సవిత,
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు