– జగన్‌పై ఆరోపణలతో తటస్తులలో కూటమిపై సానుకూల వైఖరి
– మోదీనే జగన్ ఓడిపోతున్నారని చెప్పిన తర్వాత మారిన మధ్య తరగతి మనసు
– చంద్రబాబు సీఎం అవుతున్నారన్న మోదీ
– దానితో ఓడిపోయే జగన్ పార్టీకి ఓటు ఎందుకన్న భావన
– తటస్తులు, విద్యావంతులు, మార్వాడీలు, బ్రాహ్మణ, వైశ్య వర్గాల్లో కూటమిపై సానుకూలత
– ఏపీలో మోదీ ప్రచారంతో పెరగనున్న కూటమి సీట్లు
– తెలంగాణలోనూ ఇదే వైఖరి
– తెలంగాణలో అభ్యర్ధులపై వ్యతిరేకత ఉన్నా మోదీని చూసే ఓటు
– కిషన్‌రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత.. అయినా మోదీపై సానుకూలత
-పదవులు వచ్చిన తర్వాత ఎంపీలలో అహంకారం పెరిగింద ంటున్న సొంత పార్టీ క్యాడర్
– తమను చూసి కాకపోయినా మోదీని చూసి ఓటేస్తారన్న ధీమా
– మధ్యతరగతి మనసు గెలిచిన మోదీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రధాని మోదీ రెండో దశ ప్రచారం ఏపీలో కూటమి ఎక్కువ సీట్లు పెంచేందుకు కారణమవుతోంది. తెలంగాణలో కూడా తటస్థులు, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలతోపాటు.. బ్రాహ్మణ, వైశ్య, మార్వాడీ, ఉత్తరాది ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు, మోదీ ప్రచారం దోహదపడనుంది.
సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సగటు బీజేపీ కార్యకర్త తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. కార్యకర్తలను పట్టించుకోకపోవడం, అందుబాటులో లేకపోవడం, సరైన విధంగా స్పందించకపోవడం వంటి కారణాలే దానికి కారణం. అయితే వారంతా మోదీని చూసి పార్టీకి పనిచేసే పరిస్థితి. కార్యకర్తలు ఓటేయకపోయినా మధ్యతరగతి ప్రజలు బీజేపీకి ఓటేసేందుకు సిద్ధపడుతున్న వైనం. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. ఆ రకంగా మోదీ మంత్రంతో బీజేపీ బయటపడేలా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి.. ఏపీలో ఈసారి బీజేపీ అసెంబ్లీ-పార్లమెంటులో ఖాతా తెరిచేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో ఇప్పుడున్న స్థానాలకు ఒకటి, రెండు అదనంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ప్రధాని మోదీ ప్రచారం. నిజానికి తెలంగాణలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలలో ధర్మపురి అర్వింద్ తప్ప, మిగిలిన వారందరిపైనా సొంత పార్టీలోనే, తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలామందికి మంత్రులు-ఎంపీలయిన తర్వాత, అహంకారం వచ్చిందనే విమర్శ క్షేత్రస్థాయి కార్యకర్తల్లో బలపడింది.
ప్రధానంగా కేంద్రమంత్రి-సికింద్రాబాద్ ఎంపి గంగాపురం కిషన్‌రెడ్డిపై, కింది స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గస్థాయి నాయకుల దాకా, పీకల్లోతు ఆగ్రహం-అసంతృప్తి నెలకొంది. ఎవరికీ పనులు చేయకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, సీనియర్లను గౌరవించకపోవడం, సరైన విధంగా స్పందించకపోవడం, ఎవరికీ అందుబాటులో లేకపోవడం, ఇప్పటిదాకా సీనియర్లకు చిన్నపాటి నామినేటెడ్ పదవులు కూడా ఇప్పించకపోవడం, గత కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టపడిన వారికి, సీట్లు ఇవ్వకపోవడం వంటి కారణాలతో కిషన్ రెడ్డిపై అసంతృప్తి తీవ్రంగా ఉంది.
సికింద్రాబాద్‌లో కంటే, ఆయన ఢిల్లీలోనే ఎక్కువ ఉండటం దానికి ఒక కారణం. కేంద్రమంత్రి అయిన తర్వాత ఆయన తీరు మారిందని, ఎమ్మెల్యేగా ఉన్న కిషన్‌రెడ్డికి-కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి చాలా తేడా ఉందని, పార్టీ నేతలు బహిరంగంగానే విశ్లేషిస్తున్నారు. అదే గతంలో ఎంపీ- మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయ, ఢిల్లీలో తక్కువ-స్ధానికంగా ఎక్కువగా ఉండేవారు.
అప్పట్లో ఆయనను సికింద్రాబాద్ సెంట్రల్ మినిస్టర్ అని పిలిచేవారు. దత్తాత్రేయ సగటు కార్యకర్తకు సైతం అందుబాటులో ఉండటంతోపాటు, పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించారు. అనేకమందిని ప్రోత్సహించి వారిని కార్పొరేటర్లు, నియోజకవర్గ నేతలను చేశారు. కానీ కిషన్‌రెడ్డి మాత్రం పార్టీలో, తాను తప్ప ఎవరినీ ఎదగనీయకుండా వ్యవహరిస్తున్నారన్న భావన, పార్టీ వర్గాల్లో స్థిరపడింది. పైగా సొంత కులాన్ని బాగా ప్రోత్సహిస్తారన్న విమర్శలు కూడా లేకపోలేదు.
ఈ క్రమంలో గత కొద్దిరోజుల క్రితం, పార్టీ కార్యకర్తలే సోషల్‌మీడియాలో ఆయనను ట్రోల్ చేసి, కామెంట్లు పెట్టిన వైచిత్రి. ఇలాంటి పరిస్థితిలో కార్యకర్తలు.. కిషన్‌రెడ్డి కోసం మనస్ఫూర్తిగా పనిచేయకుండా, ఫొటో ప్రచారాలకు పరిమితమవుతున్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణ చేయించి, చేతులు దులిపేసుకుంటున్నారు. దాదాపు 7 నియోజకవర్గాల్లో కార్యకర్తలు-నేతలు కలసి నటిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ‘‘బిజీగా ఉన్న కిషన్‌రెడ్డిని ఫ్రీ చేయిస్తే అందరికీ అందుబాటులో ఉంటార’’న్న వ్యంగ్య వ్యాఖ్యలు నేతల నుంచి వినిపిస్తుండటం ప్రస్తావనార్హం. దానితో ఆయన గెలుపుపై సహజంగానే సందేహాలు ఏర్పడ్డాయి.
అదీగాక నియోజకవర్గంలో ఉన్న దాదాపు నాలుగులక్షల మంది మైనారిటీలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అటు హిందువుల ఓట్లను కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్, బీఆర్‌ఎస్ అభ్యర్ధి పద్మారావు చీల్చుకుంటున్న పరిస్థితి. గత ఎన్నికల్లో అంటే టీఆర్‌ఎస్-కాంగ్రెస్ అభ్యర్ధులిద్రూ యాదవ కులానికి చెందిన వారు కావడంతో, కిషన్‌రెడ్డి విజయం సులభమైంది. ఇప్పుడు అధికారంలో కూడా ఉన్న కాంగ్రెస్ బలంగా ఉంది. అంటే కాంగ్రెస్‌కు సానుకూల పరిస్థితి అన్నమాట.
ఈ క్రమంలో జరిగిన మోదీ పర్యటన కూటమి ఆశలను చిగురింపచేశాయి. ప్రధానంగా తటస్తులు, మధ్య తరగతి, విద్యావంతులు, బ్రాహ్మణ-వైశ్య-మార్వాడీ వర్గాలు బీజేపీ వైపు చూస్తుండటం, కొంత సానుకూల అంశంగా మారింది. అంటే అభ్యర్ధులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, మోదీపై ఉన్న అభిమానమే అభ్యర్ధులను కాపాడుతున్నట్లు కనిపిస్తోంది. అటు కిషన్‌రెడ్డి వర్గం కూడా.. ఆయనపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మోదీని చూసి, మధ్యతరగతి వర్గాలు పార్టీకి ఓటేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అంతటా బీజేపీ పరిస్థితి ఇదే.
అటు ఏపీలో దీనికి కొంచెం భిన్నమైనప్పటికీ, మోదీ పర్యటన తర్వాత కూటమికి 10 నుంచి 20 సీట్లు పెరిగే అవకాశాలు కనిపించాయి. నిజానికి మోదీ చిలకలూరిపేట సభలో జగన్‌పై కించిత్తు విమర్శ చేయలేదు. దానితో బీజేపీ కూటమిలో ఉన్నా వైసీపీతోనే ఉందన్న భావన మధ్యతరగతి, విద్యావంతులు, బ్రాహ్మణ-వైశ్య-మార్వాడీ వర్గాల్లో ఏర్పడింది. డీజీపీ-సీఎస్‌ను బదిలీ చేయకపోవడం కూడా ఆ అనుమానాలు మరింత పెంచాయి.
కానీ రెండవ విడత ప్రచారానికి వచ్చిన మోదీ, సీఎం జగన్‌పై నేరుగా విమర్శల దాడి ప్రారంభించడంతో పరిస్థితి మారింది. జగన్ అవినీతిని తూర్పారపట్టడం, అవినీతి, రౌడీరాజ్యాన్ని అంతం చేస్తామని ప్రకటించటంతో, అప్పటివరకూ ఊగిసలాడుతున్న మధ్యతరగతి-విద్యావంతులు-బ్రాహ్మణ-వైశ్య-మార్వాడీ వర్గాలు- ప్రధానంగా తటస్థులు, కూటమి వైపు మొగ్గు చూపేందుకు కారణమయ్యాయి.
ముఖ్యంగా టీడీపీతో పొత్తు ఇష్టం లేని బీజేపీ వర్గాలు కూడా, గెలుపు కోసం పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి. మోదీ- అమిత్‌షా ప్రచారం ఫలితంగా, కూటమి ఖాతాలో దాదాపు 20 సీట్లు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్ధులు సుజనాచౌదరి, సత్యకుమార్, విష్ణుకుమార్‌రాజు, సీఎం రమేష్, పురందీశ్వరి వంటి అగ్రనాయకుల విజయానికి మోదీ-షా పర్యటనలు టానిక్‌లా పనిచేశాయి.
‘మోదీ అంతటి నాయకుడే జగన్ ఓడిపోతున్నాడు. చంద్రబాబు సీఎం అవుతున్నాడు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడబోతోంది అని విస్పష్టంగా ప్రకటించిన తర్వాత సహజంగానే పరిస్థితి మారుతుంది. తటస్తుల ఆలోచన మారుతుంది. మోదీ చెప్పిన తర్వాత కూడా తటస్థులు జగన్‌కు ఎలా ఓటేస్తారు? మోదీ మాటల ప్రభావం బ్రాహ్మణ-వైశ్య-మార్వాడీ వర్గాల్లో బలంగా ఉంటుంది. వారి సంఖ్య తక్కువైనప్పటికీ అవి కనీసం 20 నియోజకవర్గాల్లో ఫలితాన్ని మారుస్తాయి’ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.