Suryaa.co.in

Devotional

ఆంజనేయ స్వామివారి తోక

చెన్నైలోని నంగనల్లూర్ శ్రీ ఆరుళ్ మిగు ఆది వ్యాధి హర భక్త ఆంజనేయ దేవాలయం, ముప్పైరెండు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రసిద్ధి. నంగనల్లూర్ వాసులైన శ్రీ రమణి అన్న ఈ దేవాయలం కట్టాలని సంకల్పించారు. కంచి మఠానికి వెళ్లి పరమాచార్య స్వామివారి అనుమతి, ఆశీస్సులు పొందారు.

చాలా వ్యప్రయాసలకోర్చి ఒక పెద్ద ఏకశిలను వెదికి పట్టుకుని, శిల్పి తన పనిని మొదలుపెట్టాడు. పని మొత్తం పూర్తయిన తరువాత ఒకరోజు ఉదయంవేళ ఆ బృహత్ ఆంజనేయ విగ్రహాన్ని నంగనల్లూర్ కి తెచ్చి దేవాలయం వద్ద ఉంచారు. ప్రతిష్ట పూర్వక అధివాసాలను (ధాన్యాధివాసం, జలాధివాసం. . .) సిద్ధం చేశారు.

ఈలోగా రమణి అన్న కంచికి వెళ్లి ఆంజనేయ స్వామివారు నంగనల్లూరుకు విచ్చేశారు అనే విషయాన్ని తెలిపి, తరువాత జరుగవలసిన కార్యక్రమములను గురించి పరమాచార్య స్వామి వారిని అడగదలిచాడు. వినాయకుని వలె హనుమంతులవారు అంటే కూడా మహాస్వామివారికి ఎక్కువ మక్కువ. స్వామివారు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతి అణువు గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారికి సంతృప్తి కలిగే విధంగా రమణి అన్న కూడా అన్నింటికీ సంపూర్ణ సమాచారం ఇచ్చారు. చివరగా ఆంజనేయ స్వామివారి తోక గురించి అడిగారు.

“స్వామి వారి వాలము గుండ్రని ఆకృతితో తలపై నుండి పక్కలకు ఉంటుంది పెరియవ” అని స్వామివారి ప్రశంసల కోసం చూశాడు. స్వామివారి కాసేపు మౌనంగా ఉండిపోయారు. రమణి అన్న కాస్త దిగులు పడ్డాడు. చివరకు స్వామివారు “ఆంజనేయ స్వామివారి మూర్తి ఎదురుగా శ్రీరాముల వారిని కూడా ప్రతిష్ట చేయ్యదలచుకున్నామని చెప్పావు. కాని రాములవారి ముందు హనుమంతుడు ఎప్పుడూ అలా తోక ఎత్తుకుని నిలబడి ఉండడు” అని చెప్పారు. రమణి అన్న ఆందోళన ఎక్కువ కాసాగింది.

“పెరియవ! ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? విగ్రహం మొత్తం తయారయ్యింది. అధివాసాలు కూడా మొదలుపెట్టాము. ప్రతిష్టాపన తేది, ముహూర్తం కూడా నిర్ణయం అయ్యింది. ఇప్పుడు ఆ తోకను మారిస్తే అధివాసాలు, కుంబాభిషేకం మరలా చెయ్యాలి. మరి నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ట చెయ్యడం కుదరదు కదా! మిరే నాకు ఒక దారి చూపించాలి” అని వేడుకున్నాడు.

మహాస్వామివారు ప్రశాంతంగా ఉన్నారు. రమణి అన్నతో, “నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. అంతా సర్దుకుంటుంది. ఆంజనేయ స్వామివారే మనల్ని కాపాడుతారు” అని ప్రసాదం ఇచ్చి పంపారు. రమణి అన్న నంగనల్లూరుకు తిరిగొచ్చారు. ఆలోచనలన్నీ తోక చుట్టూనే తిరుగుతున్నాయి. అధివాసాలు ముగిసిన తరువాత, హోమములు, క్రతువులు పూర్తిచేసి, ముహూర్త సమయానికి పీఠంపై స్వామి విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద క్రేన్ తీసుకుని వచ్చారు.

అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆంజనేయ స్వామి వారి తోక సరైనచోట తెగి ఉండడం గమనించారు. ఎటువంటి మచ్చాలేకుండా ఎవరో శిల్పి చేసినట్టుగా అగుపిస్తోంది.
రమణి అన్న మరియు ఇతర సంఘ సభ్యుల ఆనందం వర్ణించడానికి కుదురుతుందా? కళ్ళ నిరు వర్షిస్తుండగా అందరూ చేతులు పైకెత్తి కంచి వైపు తిరిగి నమస్కారం చేశారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

– శ్రీ రమణి అన్న

( కంచిపరమాచార్య వైభవం)

LEAVE A RESPONSE