-కర్నాటకకు వెళ్లి పెట్రోల్ పోయించుకుంటున్న అనంతపురం ప్రజలు
-అక్కడ పెట్రోల్ ధరలు తక్కువ కావడమే కారణం
-ఆంధ్రా సరిహద్దుల్లో పెరుగుతున్న పెట్రోలు బంకుల మూత
-ఇదో ఇం‘ధన’ వైచిత్రి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎవరైనా తక్కువ రేటుకు ఇస్తున్నారంటే కొంచెం కష్టపడయినా అక్కడికి వెళ్లి, నాలుగు రాళ్లు మిగిలించుకుంటారు. డిస్కౌంట్లు ఇస్తున్నారంటే ఎగబడతారు. అది మానవ నైజం. మరి లలితా జ్యూవెలర్స్ గుండాయన చెప్పినట్లు.. డబ్బులు ఎవరికీ ఊరకనే రావు కదా? సగటు జీవి ఆలోచనాధోరణి అది. కానీ అదే ఇప్పుడు ఆంధ్రా-కర్నాటక సరిహద్దులోని ప్రెటోలుబంకుల యజమానులకు శాపంగా మారింది. సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నాటకకు వెళ్లి, ప్రజలు తమ వాహనాలకు పెట్రోలు పోయించుని జేబు ఆదా చేసుకుంటున్నారు. కారణం కర్నాటకలో పెట్రోల్‌ధరలు తక్కువగా ఉండటం.
అక్కడి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించిన ఫలితంగా, ఆంధ్రాలో కంటే రేట్లు తక్కువగా ఉన్నాయి. ఏపీలో మాత్రం వ్యాట్ తగ్గించకపోగా, రోడ్డు సెస్సు కూడా విధించింది. ఈ కారణాలతో ఆంధ్రా-కర్నాటక సరిహద్దుల్లో.. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పెట్రోల్‌బంకులు మూతబడుతున్నాయి. వాటిని కొన్న వారు అక్కడ గడ్డివాములు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇదీ సరిహద్దుల ఇం‘ధన’ వైచిత్రి.
మీరు చూస్తున్నది.. నిన్న మొన్నటి వరకూ వాహనాలతో కళకళలాడిన పెట్రోల్ బంకు ఇది.శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులో చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్టు సమీపంలో ఉంది. ఐదేళ్ల క్రితం ధర్మవరానికి చెందిన ఒక వ్యక్తి దీన్ని ఏర్పాటు చేశారు. రెండు మూడేళ్లు వ్యాపారం బాగానే సాగింది. వైసీపీ అధికారంలోకొచ్చాక క్రమంగా పెట్రో ధరలు పెరిగాయి. ఏపీలో పెట్రోల్, డీజిల్ పై సెస్, పన్నులు అధికంగా ఉండటం, కర్ణాటకలో తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం వ్యాపారంపై పడింది. ఇటీవల పెట్రోల్, డీజిల్ పై లీటరుకి రూ.10 నుంచి రూ.12 వరకూ వ్యత్యాసం వచ్చింది. ఈ బంకు నుంచి కర్ణాటక సరిహద్దు 3 కి.మీ. దూరమే ఉంటుంది. దీంతో వాహనదారులు కర్ణాటకకు వెళ్లి పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. ఫలితంగా .. ఈ బంకులో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఈ బంకుని మూసేసిన యజమాని స్థలాన్ని కూడా అమ్ముకున్నాడు. దీన్ని కొనుక్కున వ్యక్తి గొర్రెల పెంపకానికి అనువుగా గడ్డివాము వేసుకున్నాడు.
పెట్రోల్‌బంకులో గడ్డివాము ఏమిటని అటుగా వెళ్లినవారంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే విచిత్రంగా సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో అన్నీ ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయట. ఏపీ ప్రభుత్వం పెట్రోమ్‌పై వ్యాట్ తగ్గించని పుణ్యమిది!
బోర్డులు పెట్టి మరీ ఆకర్షణ
పైగా.. ఆంధ్రా నుంచి వచ్చేవారు.. ఆంధ్రాకు వెళ్లేవారిని ఆకర్షించేందుకు కర్నాటక రాష్ట్ర పెట్రోలు బంకుల యజమానులు.. ‘‘మీ రాష్ట్రంలో కంటే మా దగ్గర పెట్రోలు-డీజిల్ రేట్లు తక్కువ’’ అని
బోర్డులు పెడుతున్నారు. దానితోపాటు.. రేట్ల తేడా వివరించే పట్టిక కూడా ఏర్పాటుచేశారు. ఫలితంగా.. ఏపీ వైపు వెళ్లే లారీలు, కార్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లంతా, కర్నాటకలోనే పెట్రోల్-డీజిల్ పోయించుకుని డబ్బు ఆదాచేసుకుంటున్నారు. ఇక ఏపీ సరిహద్దు గ్రామాలు, మండలాల్లో టూవీలర్లు నడిపే వారి సంగతి చెప్పనక్కర్లేదు.
లిక్కరు మాదిరిగా సేమ్ టు సేమ్..
ఏపీలో బ్రాండెడ్ మద్యం లేకపోవడంతో.. కృష్ణా, గుంటూరు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లా సరిహద్దు రాష్ట్రాలయిన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిషాకు వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ విధంగానే.. పెట్రోలు-డీజిల్ కూడా కొంటున్నారన్నమాట. సరిహద్దు గ్రామాలు, మండలాలకు చెందిన జనం ఎంచక్కా బోర్డరు దాటి.. తమకు కావల్సిన బ్రాండు మద్యం తాగి వస్తున్నారు. ఇప్పుడు పెట్రోలు-డీజిల్ వంతు! ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఏపీకి రావలసిన ఆదాయమంతా పక్కరాష్ట్రాల పాలవుతోందన్నమాట!!