పార్టీ గేట్లు కాదు…ప్రాజెక్టు గేట్లు తెరిపించండి

-ఫోన్‌ ట్యాపింగ్‌పై కాదు…వాటర్‌ ట్యాప్‌లపై దృష్టి పెట్టండి
-పార్టీ గేట్లు కాదు…ప్రాజెక్టు గేట్లు తెరిపించండి
-ఢల్లీకి సూట్‌కేసులపై ఉన్న శ్రద్ధ…జలవనరులపై లేదు!
-పల్లెల్లో గొంతెండుతుంటే బూతులే పనిగా పెట్టుకున్నారు
-హైదరాబాద్‌లో ట్యాంకర్ల మాటున దందాలు
-సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఫైర్‌

సీఎం రేవంత్‌రెడ్డీ…ఫోన్‌ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టడం కాదు…వాటర్‌ ట్యాప్‌లపై దృష్టి పెట్టండి…పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్ట్‌ గేట్లు తెరిపించండి అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అంటే నీళ్లు, కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు అని 2023లో నవంబరులో స్పష్టంగా చెప్పాం…అదే వాస్తవమన్నారు. పల్లెల్లో సాగునీరు, పట్టణాల్లో తాగునీరు లేక నేడు అలమటిస్తున్నారని, ప్రతి పట్టణంలో బిందెల తో ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు, ప్రజల గొంతు ఎండుతున్న దుస్థితి కనిపిస్తుందని…అదేమని అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి బూతులు తిట్టడమే పనిగా పెట్టుకు న్నారన్నారు. ధన వనరులను ఢల్లీికి తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తెలంగాణ కు తేవడంతో లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

హైదరాబాద్‌లో ట్యాంకర్ల దందాలు మొదలయ్యాయని, ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచి నీళ్ల ట్యాంకర్లు పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని విమ ర్శించారు. బీఆర్‌ఎస్‌ను ఎలా ఓడగొట్టాలి. ఎలా బెదిరించాలి, ఢల్లీికి డబ్బు సూట్‌ కేసులు ఎలా తరలించాలి అనే యావ తప్ప మంచి చేద్దామన్న ఆలోచన లేదన్నారు. కరువు వల్ల వచ్చిన కొరత కాదు…కాంగ్రెస్‌ సృష్టించిన కృత్రిమ కొరత ఇది అని ఎద్దేవాచేశారు.

నిజాయితీ ఉంటే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వు
కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో ఓటు వేయరు. అది అందరికీ తెలుసు. అందుకే హైదరాబాద్‌ లో ప్రజలపై కక్ష కట్టావా రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. నీళ్ల ట్యాంకర్‌ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు…ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్‌ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయని, నిజాయితీ ఉంటే ఉచితంగా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో దుష్ప్రచారం చేస్తున్నారు…ఎవరినీ వదిలిపెట్టం
రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్‌ రెడ్డి కి పంపిస్తాం. ఫోన్‌ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్‌ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము..నేను ఎవరికీ భయపడను తాట తీస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.
నేను భయపడను.

కడియం శ్రీహరి, దానంపై కోర్టుకు వెళతాం
ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని, కచ్చితంగా కడియం శ్రీహరి, దానంపై కోర్టుకు వెళతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయమన్నారు. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.

Leave a Reply