ప్రగతి పథంలో వరంగల్

– తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఏ పనీ చేయని బిఆర్ఎస్
– మంత్రి కొండా సురేఖ

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వరంగల్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

వరంగల్ జిల్లా కరీమాబాద్ లోని 32, 33 డివిజన్ల పరిధిలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి మంత్రి సురేఖ హాజరయ్యారు. బొడ్రాయిలకు నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప కాలంలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతను చాటుకున్నదని అన్నారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఏ పనీ చేయని బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల అమలు ఏమైందంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జనంలో మరింత దిగజారిపోతున్నదని మంత్రి విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఉజ్వలంగా ఎదుగుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Leave a Reply