ప్రకృతి శాశ్వతం

– అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు.

ప్రపంచ అటవీ దినోత్సవాన్నిపురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ తన భావాలను పంచుకున్నారు. అడవులను సంరక్షించుకునే దిశగా ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం ప్రతి యేడు మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మంత్రి సురేఖ అన్నారు.

అడవుల ప్రాముఖ్యత, అడవులతో మనిషికున్న అనుబంధం, అడవుల సంరక్షణకు అనుసరించాల్సిన కార్యాచరణ, అడవులను సంరక్షించుకోకపోతే తలెత్తె విపత్కర పరిస్థితులను అటవీ దినోత్సవం సందర్భంగా అవలోకనం చేసుకోవాల్సిన అవసరమున్నదని మంత్రి అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ యేడు “అడవులు మరియు ఆవిష్కరణలు : మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు” థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని మంత్రి తెలిపారు.

“పట్టణీకరణ, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి కారణాలతో అడవులు నానాటికీ అంతరించి పోతున్నాయి. భూ విస్తీర్ణానికి అనుగుణంగా అడవుల విస్తరణ లేకపోవడంతో గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ప్రభావంతో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నాం. పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నాం” అని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

మానవ మనుగడకు జీవనాధారాలైన గాలి, ఆహారానికి ఆలవాలమైన అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. మానవాళి మనుగడకు, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా జీవించడానికి అడవులను సంరక్షించుకోవాల్సిన అత్యయిక పరిస్థితి నెలకొందని అన్నారు. వన్య ప్రాణులకు ఆవాసాలైన అడవులను కాపాడుకుంటేనే జీవవైవిధ్యం వర్ధిల్లుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు కూడా తమవంతు సహకారం అందిస్తేనే అడవుల విస్తీర్ణంలో వృద్ధి నమోదవుతుందని, ఈ దిశగా ప్రజలు కలిసి రావాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. ఓ వైపు ఉన్న అడవులను సంరక్షించుకుంటూనే, మరోవైపు అటవీ సంపదను పెంచేందుకు సమర్పణ, సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత యజ్ఞంలో భాగస్వాములైన అటవీ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, ప్రజలకు మంత్రి సురేఖ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply