ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన అంగోతు మంగు కుటుంబ సభ్యులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రమాదంలో తమ తండ్రిని కోల్పోయి ఒక రోజు గడిచినా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఏ విధమైన సహాయం అందలేదని జనసేన ద్వారా తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుని కుమారులు ఉమేష్, గణేష్ పవన్ కళ్యాణ్ ని అభ్యర్థించారు.
తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జరిగిన సంఘటన చాలా బాధకరమని, కుటుంబ పెద్దను కోల్పోతే కలిగే బాధను అర్థం చేసుకోగలనని, బాధిత కుటుంబాలు అందరికీ న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
సంఘటన జరిగిన చీమలపాడు ప్రాంతాన్ని జనసేన తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్ గౌడ్ , రాష్ట్ర నాయకులు తాళ్ళూరి రామ్ ,రాధారం రాజలింగం సందర్శించిన అనంతరం మరణించిన వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులు కావ్య, శిరీష, రామకృష్ణ, రవీందర్, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.