Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు జన”నీరాజనం”

చంద్రబాబును తిలకించేందుకు రోడ్డు పక్కనే పడుకున్న ప్రజలు
గతంలో ఎన్టీ రామారావును తిలకించేందుకు పోటీపడిన జనం
ఇప్పుడు మళ్లీ అదే దృశ్యం పునరావృతం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన తరువాత ఆయనకు ప్రజలు స్వాగతం పలికేందుకు పోటెత్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాజమండ్రి నుంచి రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టిందంటే… ఎంతగా జనం నీరాజనం పట్టారో ఇట్టే అర్థమవుతుందన్నారు.

1982లో ఎన్టీ రామారావు ను తిలకించడానికి రోడ్డు పక్కనే జనం పడుకొని ఉండేవారట… జైలు నుంచి బెయిల్ పై విడుదలై వస్తున్నా నారా చంద్రబాబు నాయుడు ని కూడా చూసేందుకు ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాగానే ఆయనకు స్వాగతం పలికేందుకు కొన్ని చోట్ల రోడ్డు పక్కనే పురుషుల, మహిళలు అన్న తేడా లేకుండా పడుకున్నారు.

చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన వారిలో తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలతో పాటు వైకాపా నాయకత్వంతో విసుగెత్తిపోయిన నాలాంటి వారు కూడా ఉన్నట్లుగా కనిపించింది. చంద్రబాబు నాయుడు పై ప్రేమతోనే కాకుండా, ఇప్పుడున్న ప్రభుత్వంపై ద్వేషంతో, కోపంతో, అసహ్యం తో ప్రజలు రోడెక్కారని రఘురామకృష్ణం రాజు అన్నారు .

చంద్రబాబు నాయుడు జన్మ ధన్యమైంది
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మ ధన్యమైంది. మంచి చేస్తే ఒక వ్యక్తిని ప్రజలు ఎంతగా ఆరాధిస్తారో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన ప్రజలను చూస్తే అర్థమయింది. రాజకీయాలు అనేవి థాంక్స్ లెస్ జాబ్స్ అని అంటారు. కానీ మంచి చేస్తే అదే ప్రజలు బ్రహ్మరథం పడతారని స్పష్టమయ్యింది. 52 రోజులపాటు జైల్లో ఉంచి చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల తన ప్రజా జీవితంలో, ప్రజలకు చేసిన మంచిని విస్తృత స్థాయిలో చర్చించుకునే విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందించాల్సిందేనని ఎద్దేవా చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఒకటనుకుంటే మరొకటి జరిగింది. వామనడు చిన్నవాడే కదా అని మూడు అడుగుల స్థలాన్ని ఇస్తే బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కినట్లుగా… జనాలను బలిచ్చే ఈ అభినవ బలి చక్రవర్తిని ప్రజలు తమ పాదాలతో తొక్కి వేస్తారేమోనని రఘురామకృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు నాయుడుకు ప్రజలిచ్చిన అపూర్వ ఘన స్వాగతాన్ని పరిశీలిస్తే, రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి విజయం తద్యమని స్పష్టమైపోయిందని అన్నారు..

కోర్టు తీర్పు అనుసరించే పెనాల్టీని రద్దు చేస్తే కేసులు పెడతారా?
ఇండస్ట్రియల్ ప్రమోషన్ లో భాగంగా కోర్టు తీర్పును అనుసరించి ఎస్పీవై రెడ్డి కంపెనీ పై విధించిన పన్నును రద్దు చేస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కార్బోహైడ్రేడ్స్ నుంచి ఆల్కహాల్ ఉత్పత్తి చేసే కంపెనీని ఎస్ పి వై రెడ్డి ప్రారంభించారు. ఈ కంపెనీ పై విధించిన పెనాల్టీని గత ప్రభుత్వ హయాంలో వేవ్ చేయడం జరిగింది. కంపెనీలపై పెనాల్టీలు పడినప్పుడు వేవ్ చేయడం సహజం.

ఈ కేసులో అప్పుడు విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినప్పటికీ, పరోక్షంగా ఆయన్ని భయపెట్టడానికి జమోరె అండ్ గ్యాంగ్ వేసిన ఎత్తుగడేనని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర కమిషనర్ గా ఆయన వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయినా న్యాయస్థానం ముందు ఈ కేసు ఐదు నిమిషాలు కూడా నిలబడదు. మద్యం లో సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలకు కన్నాలు వేస్తూ, తగుదనమ్మా అంటూ రివర్స్లో మద్యం కుంభకోణం జరిగిందని కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. అడాన్ డిస్టలరీస్ ఎవరిది? వారు ఎంత సరుకు అమ్ముతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అడాన్ డిస్టలరీస్ యజమాని అప్రూవర్ గా మారిన మాట నిజం కాదా?

. పారదర్శకంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి అధికారి నగేష్ పై కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది. దొంగ ఓట్లు నమోదు చేయాలనుకున్న మా పార్టీ నాయకులకు ముఖేష్ కుమార్ మీనా అడ్డంకులను సృష్టించడం వల్లనే ఆయనకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భయపెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ కేసు విచారణ 20వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా 28వ తేదీ వరకు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయబోమంటూ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు.

ఈనెల ఏడవ తేదీ తరువాత చంద్రబాబు నాయుడుని టచ్ చేసే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించిన వెంటనే, హైకోర్టు న్యాయమూర్తి వద్దకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వెళ్లి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది. దీనితో న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తనకు తెలుసునని, ఈ కేసులో అవసరమైతే సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్ళమని సూచించినట్లుగా సమాచారం అందిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన తర్వాత ఎటువంటి రాజకీయ సభలు, సమావేశాలలో పాల్గొనవద్దని న్యాయస్థానం షరతులు విధించింది. అలాగే మీడియా సమావేశాలలో కూడా పాల్గొన వద్దని స్పష్టం చేసింది . చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరి అనంతరం షరతులను విధించడం పరిశీలిస్తే, మా పార్టీ నాయకత్వం ఎంత ఆత్మరక్షణలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో పాల్గొంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు.

వై నాట్ 175 అని ప్రగల్బాలను పలికిన వారికి 17 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని భయం పట్టుకుంది. నిజంగానే 175 స్థానాలకు 175 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటే… ఏమి మాట్లాడుతారో మాట్లాడుకోవాలని అని ఉండేవారు. చంద్రబాబు నాయుడు పై నమోదు చేసింది ఒక బోగస్ కేసు… మనీ ట్రయల్ లేదు. దమ్మిడి సాక్ష్యం కూడా లేదు. అయినా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు అంటే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

ఇటువంటి పనికిమాలిన ఆరోపణలతో ఆయన ఖ్యాతిని రెట్టింపు చేసేందుకు దోహదపడండి అని ఏద్దేవా చేశారు . చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయ్యారని మంత్రి అంబటి రాంబాబు, మిల్లెట్ రెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గత పదేళ్లుగా బెయిల్ పైనే ఉన్న విషయాన్ని విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు.

నాకేదైనా జరిగితే ఆ ముగ్గురిదే బాధ్యత… ప్రధానికి రఘురామకృష్ణం రాజు లేఖ
నాకు ఏదైనా జరిగితే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆయన పక్కనే ఉండే ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులదే బాధ్యత అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు తెలిపారు. గతంలో నన్ను వీరు లాకప్ లో హత్య చేయాలని చూశారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను. ఇప్పటికీ నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. న్యాయస్థానాలలో కేసుల విచారణ ఆలస్యం జరుగుతోంద ని, అందుకే సంబంధిత పార్లమెంట్ కమిటీ విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరాను. గతంలో జరిగిన సంఘటనలను పేర్కొంటూ, లోక్ సభ స్పీకర్ కు కూడా లేఖ రాశాను. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రధానమంత్రికి రాసిన లేఖ పట్ల , ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఋషికొండపై భవన నిర్మాణాలలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన
ఋషికొండపై గతంలో ఉన్న కాటేజీల స్థానంలో మాత్రమే నూతన నిర్మాణాలను చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని ఉల్లంఘించడం పట్ల ఎం ఓ ఎఫ్ తప్పు పట్టింది. ఏదైనా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించిన రాష్ట్ర హైకోర్టు, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయమై నవంబర్ 20వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించి, కేసును నవంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. విశాఖలో ముఖ్యమంత్రికి అనువైన నివాస భవనాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గతంలో నేను చెప్పినట్లుగానే, ఋషికొండపై నిర్మించిన భవనాన్ని సిఫార్సు చేసినట్లుగా తెలిసింది.

త్రిసభ్య కమిటీ ప్రతిపాదన చేసిన రెండు గంటల వ్యవధిలోనే ఈ తీర్పు వెలువడింది. సుప్రీం కోర్టు గత ఏడాది జూన్ 1వ తేదీన రుషికొండపై నిర్మాణాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో కాటేజీలు ఉన్నచోటే నిర్మాణాలు చేపట్టాలని చెప్పగా, చెప్పినచోట కాకుండా కొండకు గుండు కొట్టారు. కాన్ఫరెన్స్ హాల్లో ఎక్కడైనా బాత్ టబ్ ఉంటుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

రిషికొండపై నిర్మాణాలలో ఉల్లంఘనలు జరిగాయని, తన తరపు న్యాయవాది, సివిల్ ఇంజనీర్ కు శని, ఆదివారాలలో పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ టూరిజం శాఖ ఎండి కన్నబాబుకు లేఖ రాసినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఋషికొండ పై నిర్మాణాలలో ఉల్లంఘనలను పరిశీలించి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందన్న ఆయన, తన తరపు న్యాయవాది, సివిల్ ఇంజనీర్ ను పరిశీలించడానికి అనుమతించాలని కోరాను. అనుమతి ఇస్తే సరే సరే.. లేకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తాను. ఋషికొండపై నిర్మాణాలలో ఉల్లంఘనలు జరిగాయి అన్నది వాస్తవం.

హైకోర్టు తీర్పు వెలువడే వరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఆక్యుపేషన్ ఇవ్వటానికి వీలులేదని లేఖ రాశాను. ఋషికొండపై భవన నిర్మాణాలలో ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి శర్మ, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి కి లేఖ రాశారు. సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించి కేరళలో నిర్మించిన అపార్ట్మెంటును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారని, ఋషికొండపై కూడా సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన తన లేఖలో పేర్కొన్నారన్నారు.

కేరళ అపార్ట్మెంట్ నిర్మించుకున్న వారు చేసుకున్న పాపమేమిటి… ఋషికొండపై భవన నిర్మాణాన్ని చేపట్టిన వారు చేసుకున్న పుణ్యం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఎన్నో పర్యావరణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘించడం ఏమిటని నిలదీశారు. ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా ఋషికొండపై భవన నిర్మాణాన్ని చేపట్టారని భావిస్తే, టూరిజం శాఖ కార్యకలాపాలను నిర్వహించడానికి మాత్రమే వినియోగించాలి. అంతేకానీ ముఖ్యమంత్రికి నివాస భవనంగా కేటాయిస్తామంటే సరికాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

LEAVE A RESPONSE