– కుష్టు వ్యాధి రహిత సమాజం నిర్మిద్దాం.
– వ్యాధిగ్రస్తులకు దుస్తులు, పండ్లు పంపిణీ
– అన్ని కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్
– నియోజకవర్గ ప్రజలందరి రుణం తీర్చుకుంటాం.
– సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్
రామచంద్రపురం : సమాజంలో మనిషై పుట్టిన ప్రతి ఒక్కరు సాటి మనిషికి సహాయం చేయాలని, అపుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని, అందుకే మానవ సేవే -మాధవ సేవగా పెద్దలు చెబుతారని “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” చైర్మన్, మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. రామచంద్రపురం సువార్త పేటలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా అంగవైకల్యం, నివారణ మరియు చికిత్స కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
అన్ని జన్మల్లో మానవ జన్మ అతి పవిత్రమైనదని, కష్టంలో, ఆపదలో ఉన్న సాటి వారికి సహాయం చేయడంలో ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. కుష్ఠు వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. లెప్రసి కాలనీలో ఉన్న సమస్యలన్నిటిని తక్షణం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సువార్తపేట కాలనీలో నివాసం ఉంటున్న 36 బాధిత కుటుంబాలకు వారి అనారోగ్యం రీత్యా వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా పది రోజుల్లోగా వేయిస్తానని సత్యం హామీ ఇచ్చారు.
టెన్త్ పైబడి చదువుకున్నవారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇతర ఏ సమస్యలున్న నేరుగా మంత్రి సుభాష్ లేదా తమ ఫౌండేషన్ ను సంప్రదించాలని సూచించారు. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన రామచంద్రపురం నియోజవర్గ ప్రజల ఋణం తీర్చుకునే క్రమంలో పలు సేవా కార్యక్రమాలు మంత్రి సుభాష్ తమ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, మున్సిపల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీకాంత్, లెప్రసీ జిల్లా నోడల్ అధికారి చిక్కాల సూర్యరావు, ఫిజియోథెరపిస్ట్ రంగనాథం, గౌరీ శంకర్, జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.