Suryaa.co.in

Editorial

జగన్ ను తెగిడి.. బాబును పొగిడిన షర్మిల

-సర్కారుకు సిగ్గుందా అని కడిగేసిన షర్మిల
-బాబు పాలన కంటే జగన్ అన్న పాలన ఘోరం
-బాబు పాలనే నయమని షర్మిల కితాబు

-దగా డీఎస్సీపై అన్నను దునుమాడిన చెల్లి షర్మిలారెడ్డి
-పోలీసుల దౌర్జన్యంపై షర్మిల ఆగ్రహం
-షర్మిల వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో వైసీపీ
-నిరుద్యోగులు, మేధావులు, తటస్థులపై ప్రభావితం చేస్తాయన్న ఆందోళన
( మార్తి సుబ్రహ్మణ్యం)

అన్న పాలనపై చెల్లి మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్ అన్న పాలన అధ్వానంగా ఉందని, జగన్ పాలన కంటే గత చంద్రబాబు పాలన మెరగని, వైసీపా పాలన అధ్వానంగా ఉందంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి విరుచుకుపడ్డారు. ఇవి వైసీపీని సహజంగానే ఆత్మరక్షణలోకి నెట్టాయి.

నిరుద్యోగ సమస్య, దగా డీఎస్సీని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు.. కాంగ్రెస్ చేసిన చలో సెక్రటేరియట్ ను, పోలీసులు భగ్నం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ‘చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ అన్న పాలన అధ్వానంగా ఉంది. సచివాలయాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు చూపించి 6 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పడానికి సిగ్గుండాలి. జగన్, సకలశాఖామంత్రి సజ్జల గొప్పలు చెప్పుకుంటున్నారు. దమ్ముంటే ఉద్యోగ కల్పనపై వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

మెగా డీఎస్పీ పేరుతో దగా డీఎస్సీసరైనది కాదని, జగన్ అన్న చెప్పిన జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిర్వహించే తమ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమన్న షర్మిల.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ హక్కులు కూడా కాపాడాలన్నారు.

కాగా కీలకమైన ఎన్నికల సమయంలో.. బాబు పాలన నయమంటూ షర్మిల చెప్పకనే చేసిన వ్యాఖ్యలు, వైసీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా నిరుద్యోగుల సమస్యను ప్రస్తావిస్తూ షర్మిల చేసిన విమర్శలు.. అదే అంశంపై సర్కారుపై

సమశంఖారావం పూరిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల ఉద్యమానికి నైతిక బలం చేకూర్చినట్టయింది. ఆ అంశంపై చివరకు జగన్ చెల్లి షర్మిల కూడా గళం విప్పడం.. బాబు పాలనే నయమంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, ప్రజల్లో వైసీపీని ముద్దాయిగా నిలబెట్టాయి.

ఇది సహజంగానే వైసీపీని ఆత్మరక్షణలో నెట్టాయి. దీనితో నిరుద్యోగులు-యువత-మేధావులు ఎన్నికల్లో గంపగుత్తగా టీడీపీ వైపు చూస్తే, పార్టీ కొంప కొల్లేరవుతుందని బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ఇది కాంగ్రెస్కు సానుకూల పరిణామమేనని, షర్మిల వచ్చిన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు, పార్టీని జనంలోకి తీసుకువెళుతున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు పాలనపై షర్మిల చేసిన వ్యాఖ్యలు అటు విద్యాధికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతతో పాటు తటస్థులను టీడీపీ వైపు నడిపించేందుకు దోహదపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి ఇప్పటివరకూ చంద్రబాబుకు వ్యక్తిగతంగా యువత, తటస్థులు, మేధావులలో సానుకూల వాతావరణం ఉంది. చంద్రబాబునాయుడు పార్టీని వదిలిపెట్టి, ప్రభుత్వంపై దృష్టి పెట్టడం వల్ల చాలాసార్లు ఓడిపోయారని, పార్టీ-ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోనందుకే ఓడిపోయారన్న భావన.. అటు కార్యకర్తలు-ఇటు తటస్థులు, మేధావుల్లో ఉంది. అయినప్పటికీ బాబు పాలనావిధానాలే బాగుంటాయన్న అభిప్రాయం విద్యాధికులు – తటస్థుల్లో ఇప్పటికీ బలంగా నాటుకుపోయింది.

ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలు.. ఏపార్టీకీ చెందని మేధావులు – తటస్థులు – నిరుద్యోగులు – యువతపై ప్రభావం కచ్చితంగా చూపిస్తాయంటున్నారు. ఆయా వర్గాల అడుగులు, టీడీపీ వైపు వేసేందుకు షర్మిల వ్యాఖ్యలు దోహదపడటం ఖాయమని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా అన్న పాలన అధ్వానమంటూ.. చంద్రబాబు పాలన మెరుగని కితాబునిచ్చిన, షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సంకటంలో పడింది.

LEAVE A RESPONSE