-సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
ఒంగోలు: భారతీయ ఎన్నికల సంఘం 2009 నుండి ఓటర్ల అవగాహన కోసం స్వీప్ అనే చైతన్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఓటర్లను జాగృతలను చేయటానికి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 5వ తేదీన ఒంగోలులోని సిపిఐ కార్యాలయ హాలులో జరిగిన మీడియా సమావేశంలో వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మావులూరి నాగేశ్వరరావు, ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు,రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ,సుపరిపాలన వేదిక మాజీ అధ్యక్షులు సుంకర సాయిబాబులతో పాటు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ జనవరి 12 వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని జనవరి 22న ఓటర్ల జాబితా విడుదలవుతుందని అప్పటికి ఓటు రాని వారు 15 రోజుల లోపల జిల్లా కలెక్టర్ కు లేదా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.అధికార పార్టీ కార్యకర్తలుగా ఉండి వలంటీర్లుగా ఎంపిక అయిన వారు ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములు అవుతున్నారని వారి సహకారంతో ఇటీవల నియమితులైన ఎలాంటి అనుభవం లేని సచివాలయ సిబ్బంది అత్యధికులు బూత్ లెవల్ ఆఫీసర్స్ గా ఉంటున్నారని వీరిపై స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి,జోక్యం ఉండటం వలన ఓటర్ల జాబితాలో లోపాలు దర్శనమిస్తున్నాయని వీటిని సరిదిద్దే బాధ్యత మరలా తప్పులు చేసిన వారికే ఇవ్వటం భావ్యం కాదన్నారు.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పన లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 9,10 తేదీలలో విజయవాడలో జరిగే సమావేశంలో సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం,మరణించిన వారి ఓట్లు తొలగించడం,డబ్లింగ్ ఓట్లు లేకుండా చూడటంలపై వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.ఇంటి నెంబర్ లేకుండా నమోదు అయిన ఓట్లను తొలగించాలని కోరారు. ఒకే ఇంటి నెంబర్ తో పదికి మించి ఓట్లు ఉన్న వాటిని నిశ్చింతంగా పరిశీలించాలన్నారు.
బల్క్ గా ఫామ్ 7 ను ప్రత్యర్థుల ఓటర్లను తొలగించాలనే దుర్బుద్ధితో ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.అనురాగ్ భరన్ వాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ తీర్పులో ఓటు హక్కు ను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించిందని ఈ పరిస్థితులలో ఓట్లు తొలగించే ముందు సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలన్నారు. నోటీసు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఓట్లను తొలగించరాదని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఓట్లను తొలగించడం శిక్షార్షం అవుతుందన్నారు.
ఫామ్ 8b ద్వారా 80 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఇంటివద్దనే ఓటు వేసుకునే సదుపాయం ఉందని ఫామ్ 6ఏ ద్వారా విదేశాలలో ఉన్న భారతీయ పౌరసత్వం గలవారు ఓటు పొందవచ్చునని,ఫామ్ 8 ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఓట్లు ఒకే పోలింగ్ బూత్ లో ఉండేటట్లు కృషి జరగాలన్నారు.