Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల్లో అక్రమాలపై నిఘా

-రిటైర్డ్‌ అధికారులతో పరిశీలన
-మే 9 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు
-ఇళ్ల దగ్గర పెన్షన్లకు ఏర్పాట్లు చేయాలి
-సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి
-నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నిక ల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో మంగళవా రం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మార్టూరు, శ్రీకారం కళాపరిషత్‌లు ఓటర్లను చైతన్యం చేయడానికి రూపొందించిన లఘు చిత్రాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. లఘు చిత్రాలను రూపొందించిన కందిమళ్ల సాంబశివరావు, జాష్టి అనురాధ, జె.వి.మోహన్‌రావు, ఎస్‌.జయరావు, టి.సాంబశివరావు, ఎం.కోటేశ్వరరావుల బృందాన్ని అభినందించి సత్కరించా రు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. నిమ్మగడ్డ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ తరఫున ఎన్నికల నిఘాలో భాగంగా పరిశీలకులు మే 9 నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు.

ఇంటి దగ్గరే పెన్షన్లకు చర్యలు తీసుకోవాలి
సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కృషి ఫలితంగా వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరం చేయగలిగామని రాజకీయ అబ్ధికోసం వాలంటీర్లను ఉపయోగించుకోవడాన్ని అడ్డుకట్ట వేయ గలిగామన్నారు. మే 1,2 తేదీలలో పెన్షన్‌దారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో జరిగిన విధంగా వృద్ధులని ఇబ్బందిపాలు చేయవద్దని హితవు పలికారు. గ్రామ-వార్డు సచివాలయ సిబ్బందిని, పంచాయతీ సిబ్బందిని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఉపయో గించుకుని వృద్ధుల ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సందేశాత్మకంగా లఘుచిత్రాలు
సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ లఘు చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నా యని, ఓటును అమ్ముకోవద్దని సూచించారు. విద్యావంతులు తప్పకుం డా ఓటింగ్‌లో పాల్గొని మంచి పరిపాలన, అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థులను గెలిపించుకోవాలన్న సందేశాన్ని లఘు చిత్రాల ద్వారా తెలియజేయడం శుభపరిణామన్నారు. ప్రభుత్వాలు సంపద సృష్టికి తోడ్పడుతూ సమాజాన్ని అభివృద్ధి వైపు పురోగమించేటట్లు పనిచేస్తూ సంక్షేమ పథకాల ను అమలు చేయాలన్నారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33 శాతం ఆంధ్రప్రదేశ్‌లో రుణాలు ఉండటం 14 లక్షల కోట్లకు అప్పు చేరి అప్పుల ఊబిలో ఉందని విమర్శించారు. 25 శాతం నిరుద్యోగం, అక్షరాస్యతలో మూడవ స్థానంలో ఉన్నామని, ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్లే అభ్యర్థుల ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కులం, మతం, డబ్బులు, మద్యం వంటి ప్రలోభాలకు లోను కావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రంగయ్య, పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితి కన్వీనర్‌ పి.వి. మల్లిఖార్జునరావు, ప్రముఖ ఇంజనీర్‌ కుర్రి రామసుబ్బారావు, సూర్య ఇన్వెస్టిగేషన్‌ వ్యవస్థాపకు లు కాళహస్తి సత్యనారాయణ, తెలుగు భాషోద్యమ సమాఖ్య కన్వీనర్‌ వి.సింగారావు, ప్రముఖ రంగస్థలం నటుడు నాయుడు గోపి, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, ప్రముఖ దర్శకుడు చిట్టినేని శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE