– వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయి
– విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ప్రాథమిక సమస్యలపై దృష్టి
– మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయసేకరణ
– పాఠశాల విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లిః జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయి అనేందుకు జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికే నిదర్శమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్యపై ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించిన మంత్రి.. అసర్ నివేదికపై ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ఫ్యాన్సీ కార్యక్రమాలు కాకుండా ప్రాథమిక సమస్యలైన ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ(FLN) కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాల మదింపునకు తరగతి ఉపాధ్యాయులతో చర్చించాలి. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపైనా సమావేశంలో చర్చించారు. ఐవీఆర్ఎస్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. బాలికల స్వీయరక్షణ తర్ఫీదు కోసం శిక్షకులను నియమించాలని ఆదేశించారు.
విద్యారంగంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపైనా సమావేశంలో చర్చించారు. ప్రతి పాఠశాలలోని లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగపర్చుకునే విధంగా ఉండవలసిన పుస్తకాలను ఆయా రంగాల నిపుణులతో చర్చించి పాఠశాల లైబ్రరీలను ఏర్పాటుచేయాలని, విద్యార్థులు వినియోగించుకునే తీరును పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులు, పీఈటీల అభీష్టం మేరకు పాఠశాలల్లో క్రీడా సామాగ్రిని సమకూర్చాలి.
పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటుచేయడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ప్రభావాన్ని విశ్లేషించాలని ఆదేశించారు. పది, ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.