Suryaa.co.in

Telangana

జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన

– మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్: ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్‌ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్పు కొత్తగా ఉంటుందని ప్రజలు భ్రమ పడ్డారని 2014కు ముందు దుస్థితి వస్తుందని వాళ్లు అనుకోలేదని జగదీశ్‌ రెడ్డి అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు మహిళలకు ఏడాదికి లక్ష ఇస్తామని మళ్లీ హామీ ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన వారిని పక్కన పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు నీతులు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాలు విసిరారు.

వంద రోజుల్లో రాష్ట్రంలో వసూళ్లు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. కుర్చీని కాపాడుకునేందుకు మంత్రులు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. మిల్లర్లు, క్రషర్‌ యజమానులు, కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లకు కష్టపడుతున్నారని అన్నారు. మిల్లర్ల దయాదాక్షిణ్యాల పై రైతులను వదిలేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రులకు ఐపీఎల్‌ చూడటానికి ఉన్న ప్రాధాన్యం రైతులపై లేదని అన్నారు.

జేబు దొంగలు, పగటి దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందని మండిపడ్డారు. 2014 కంటే ముందు ఉన్న ఆరాచకాలు అన్నీ మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడితే కేసులు పెడతాం.. జైలులో పెడతామని కాంగ్రెస్‌ నేతలు ఉడత ఊపులకు పోతున్నారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఇలా కేసులు పెడతామని బెదిరించారా? అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE