Suryaa.co.in

Editorial

కన్నీటి ఖాకీవనం.. కష్టాలతో‘రణం’!

– నలుగుతున్న ‘నాలుగో సింహం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

పదేళ్ల క్రితం వరకూ ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులంటే అందరికీ హడల్. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ మన పోలీసులే మార్గదర్శకులు. ఇంటలిజన్స్, కౌంటర్ ఇంటలిజన్స్, కమ్యూనికేషన్, గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ ఇలాంటి విభాగాలవైపే మిగిలిన రాష్ట్రాలు ఆసక్తిగా చూసేవి. అవి ప్రదర్శించిన అద్భుతాలు అలాంటివి మరి. చివరాఖరకు ప్రత్యేక-సమైక్య రాష్ట్ర ఉద్యమాల సమయంలోనూ పట్టుసడలని పోలీసు వ్యూహం-సమర్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే.

అన్ని శాఖల మాదిరిగా పోలీసు శాఖలో నిజాయితీపరులు, సమర్ధులతోపాటు అవినీతిపరులు-అసమర్ధులూ ఉన్నారన్నది నిష్ఠుర నిజం. అయితే.. మిగిలిన శాఖలో అవినీతిపరులుండటం వేరు. ప్రజలను పరిరక్షించే పోలీసుశాఖలో అసమర్ధులు- అవినీతిపరులుండటం వేరు. అసలు తెలుగు రాష్ట్రాల్లో పోలీసింగ్ ఉందా? సమర్ధులకు సరైన పోస్టింగులు వస్తున్నాయా? అక్కడ కూడా కులమతాల కంపు కొడుతోం దా ? అసలు డీజీపీల మాటకు విలువ ఉందా? ఇప్పుడు సమస్యల్లా అదే.

ఇప్పుడు పోలీసే భయపడుతున్నాడు..
ఒకప్పుడు పోలీసులను చూస్తే వణికిపోయిన ముఠాలు, ఇప్పుడు పోలీసులనే నిలువునా వణికిస్తున్నాయి. ఇటీవల ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్ వస్తాదు ఒకరు ఖాకీలపై కన్నెర
mim-corpo చేస్తూ.. ‘నా ఇలాకాలోకి నాకు తెలియకుండా ఎట్లా వస్తారం’టూ ధంకీలు ఇచ్చిన వీడియో, అందులో ఖాకీలు సదరు రాజకీయ వస్తాదుతో ఎంతో ఓపికగా మాట్లాడిన తీరు చూస్తే.. ప్రజల సంగతి పక్కనపెడితే, అసలు పోలీసులకు రక్షణ ఉందా అన్న అనుమానం మెడమీద తల ఉన్న ఎవరికయినా రావడం సహజం. అదే సమయంలో ఆ వర్గం వారితో అంత సహనం, ఓర్పుగా మాట్లాడిన పోలీసులు మిగిలిన వర్గాలతోనూ ఎందుకు అంతే సహనంతో వ్యవహరించన్న ప్రశ్న కూడా సహజంగానే తెరపైకొస్తుంది. వచ్చింది కూడా!

మరి దారికి తెచ్చేదెవరు?
చిన్నప్పుడు తప్పుచేస్తే తలిదండ్రులు సరిచేయాలి. అదికాకపోతే స్కూలుకెళితే ఉపాధ్యాయుడు దండించాలి. అదీకాకపోతే పిల్లవాడు పెద్దవాడయి రోడ్డుమీదకు వచ్చినప్పుడు తప్పుచేస్తే పోలీసు దండించాలి. లేకపోతే వాడు కచ్చితంగా దారితప్పుతాడు. ఇప్పుడు పిల్లలను పట్టించుకునే తీరిక-ఓపిక తలిదండ్రులకు లేదు. స్కూల్లో టీచర్ దండిస్తే, తలిదండ్రులు టీచర్లపై యుద్ధానికొస్తున్నారు. ఈమధ్య స్వయంగా మన చిరంజీవులే పోలీసుస్టేషన్లకు వెళ్లి, టీచర్ల మీద కంప్లయింట్లు ఇస్తున్న అతి తెలివి దృశ్యాలు చూస్తున్నాం.

లాఠీలు లేని ఫ్రెండ్లీ పోలీసింగ్
ఒకప్పుడు పోలీసుల చేతిలో లాఠీలు, ప్లాస్టిక్ పైపులు చూసేవాళ్లం. జనం వాటిని చూసి భయపడేవారు. తప్పుచేయాలన్న ఆలోచన మానుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రెండ్లీ పోలీసు సూత్రం వచ్చిన తర్వాత, పోలీసుల చేతిలో లాఠీలు మాయమయిపోయాయి. వందలమంది జనం రోడ్డుపైకి వచ్చి బీభత్సం
Hyderabad-police సృష్టించినా వారిని అదుపు చేయడానికే ప్రయత్నించడమే తప్ప, లాఠీచార్జితో చెదరగొట్టే దృశ్యాలు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. ఎంత పెద్ద ర్యాలీలు జరిగినా వాటిని అదుపు చేసేందుకు పోలీసులు చేతితో ప్రయత్నించడమే తప్ప, లాఠీలు ప్రయోగిస్తున్న దృశ్యాలు కనిపించవు.

సీపీ ఆదేశించినా నో లాఠీచార్జి..
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై కొచ్చి యుద్ధానికి దిగేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో స్వయంగా పోలీసు కమిషనర్ లాఠీచార్జికి ఆదేశించినా ఎవరూ పాటించలేదు. కారణం ఉద్యోగ అభద్రత. సస్పెన్షన్లు, బదిలీల భయం. అందుకే ఎందుకొచ్చిన పరేషానీ అన్న నిర్లిప్తత. ఈ నిర్లిప్తత పెరిగి వటవృక్షమయి, ఇటీవలి కాలంలో చర్యలకు బదులు కేసులు రాసే సంస్కృతి పెరిగింది. మానవహక్కుల సంఘాలు, మీడియా అత్సుత్సాహంతో.. కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.

బాసుల భరోసా లేకనే..
దీనికి కారణం లేకపోలేదు. నిజానికి గత పదేళ్ల క్రితం వరకూ కింది స్థాయి పోలీసులకు పైస్థాయి అధికారులు దన్నుగా నిలిచేవారు. వారిపై మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చినా, ‘మీపని మీరు చేశారు. మిగిలింది మేము చూసుకుంటామ’ని అభయమిచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకూ ఈ భరోసా కనిపించింది. ఇప్పుడు అలాంటి భరోసా ఇచ్చేవారే లేరు. మీడియాలో కథనాలు, స్క్రోలింగులు రావడమే ఆలస్యం. ఎవరైనా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడమే తరువాయి. వారికి ట్రాన్స్‌ఫర్లో, లేక పోస్టింగులివ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడమో సాధారణమయిపోయింది. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు మీడియాను చూసి భయపడుతున్నారే తప్ప, సొంత బుర్రలు వాడటం ఎప్పుడో మానివేశారన్నది అర్ధమవుతూనే ఉంది. అందుకే పోలీసు లాఠీ వాడటం మానేశాడు.

మీడియాకు భయపడితే ఎలా?
ఉదాహరణకు రోడ్డుపై ఒక తాగుబోతు దారినపోయేవారిని బెదిరిస్తుంటాడు. అటుగా వాహనంలో ఓ సీఐ వెళుతుంటాడు. పక్కనే అంతా ఆ దృశ్యాన్ని చూస్తుంటారు. మరికొందరు సెల్‌ఫోన్‌లో వీడియాలు తీస్తుంటారు. కానీ ఎవరూ తాగుబోతును అడ్డుకోరు. ఆ సీఐ కారు దిగి, తాగుబోతుని నాలుగు తగిలిస్తే అది క్షణంలో సోషల్‌మీడియా ద్వారా మీడియాకు చేరుతుంది. దానితో ఓ గంట సేపు ‘తాగుబోతుపై సీఐ దాష్టీకం’ అంటూ స్క్రోలింగులు నడుపుతారు. పోనీ మనకెందుకులే అని ఆ సీఐ తన దారిన తాను వెళితే, కారులో ఉన్న సీఐ తాగుబోతు వీరంగాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ ఇంకో స్క్రోలింగ్. మీడియా హడావిడి వల్ల చివరకు జరిగేది.. సదరు సీఐని వెంటనే బదిలీ చేయడం. అందుకే మనస్ఫూర్తిగా డ్యూటీ చేయటం ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు జరుగుతోంది ఇదే. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండటం మంచిదే గానీ, అసాంఘిక శక్తులతో కూడా ఫ్రెండ్లీగా ఉండటం కష్టమన్నది పోలీసుల ఉవాచ.

రాజధానిలో పోలీసింగ్ ఉందా?
ఇటీవలి కాలంలో హైదరాబాద్ వంటి నగరాల్లో నిందితులు, ప్రత్యర్ధులను నడిరోడ్లపైనే నరికిచంపేస్తున్న వీడియోలు చూస్తుంటే అసలు పోలీసింగ్ ఉందా? నిద్రపోతోందా అన్న అనుమానం సహజం. గతంలో ఇలాంటి బరితెగింపు కనిపించపోవడానికి పోలీసుల ఆత్మస్థైర్యంలో వచ్చిన తేడాలే. గతంలో సీఐ నుంచి కానిస్టేబుల్ వరకూ రోడ్డుపై కనిపించేవారు. దానితో ప్రజల్లో భయం కనిపించేది. ఇప్పుడు వారంతా పోలీసుస్టేషన్‌లోనో, లేదా ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవాల్లోనే తిరుగుతున్నారు.

ఇప్పుడు పోలీసులనే రాజకీయపార్టీ నేతలు బెదిరిస్తున్న దృశ్యాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. విశాఖలో మంత్రి సీదిరి అప్పలరాజు ఒక సీఐని దూషిస్తే, ఎమ్మెల్యే రోజా కూడా
appalaraju బూతులందుకున్నారు. వారిద్దరూ మళ్లీ ఇప్పుడు మంత్రులవడం విశేషం. మరో ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఇలా చెప్పుకుంటే పోతే పోలీసులను దూషించే అధికారపార్టీ నేతల బరితెగింపునకు పేజీలు చాలవు. ఇటు తెలంగాణలోనూ అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

పరాధీనతే అసలు సమస్య!
అయినా వారిపై కేసులు పెట్టమని చెప్పాల్సిన పెద్దాఫీసర్లు పాలకుల భజనలో మునిగిపోతే, అవమానాలు కిందిస్థాయి పోలీసుల సొంతమవుతున్నాయి. పార్టీలేవన్నది చూడకుండా కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసుబాసులే పాలకపార్టీ అరాచకాలను సమర్థిస్తున్న వైనం మరో నగుబాటు. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై స్వయంగా ఒక ఐపిఎస్ అధికారి చేయిచేసుకున్నారన్న ఆరోపణ పార్లమెంటు వరకూ చేరితే, తెలంగాణలో బండి సంజయ్‌పై చేయిచేసుకుని, తమ హక్కులను కాలరాశారన్న ఆరోపణలతో మరికొందరు ఐపిఎస్‌లు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకావల్సిన దుస్థితి కి కారణం ఎవరు? ఎందుకన్న ఆత్మ పరిశీలన అవసరం. ఇక ఎవరు పాలకులుగా ఉంటే వారికి భజన చేసే పోలీసు అధికారుల సంఘం ఆత్మగౌరవం గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వారి గొంతు ఎప్పుడూ విపక్షాలు పోలీసులను విమర్శించినప్పుడు మాత్రమే పెగులుతుందంతే.

పోస్టింగుల్లో సమిష్టి సిఫార్సులేవీ?
ఒకప్పుడు పోలీసుశాఖలో సీఐ నుంచి డీసీపీ పోస్టింగ్ వరకూ సమర్ధత, చురుకుదనం ప్రాతిపదికన ఇచ్చేవాళ్లు. కమిషనర్/రేంజ్ ఐజి, డీజీపీ కలసి సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. శాంతిభద్రతలు కాపాడేందుకు కఠినంగా వ్యవహరించే మొండివాళ్లతోపాటు, సమస్యను పరిష్కరించే సమర్థులను, గతంలో వారి పనితీరు ప్రాతిపదికన పోస్టింగులుండేవి. ఫలానా జిల్లాలో ఒక సామాజికవర్గం పెత్తనం ఎక్కువగా ఉంటే, అక్కడ మరో కులానికి చెందిన అధికారికి పోస్టింగ్ ఇచ్చేవారు. అందుకే శాంతిభద్రతలు సవ్యంగా ఉండేవి. చంద్రబాబు సీఎంగా ఉండగా హైదరాబాద్‌లో పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారు. సీనియర్ ఐపిఎస్ మహంతి హయాంలో మజ్లిస్ నేతలకు చుక్కలు చూపించారు. పోస్టింగుల్లో మంత్రుల సిఫార్సుకు ప్రాధాన్యం ఉండేది కాదు. అందుకే రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉండేవి.

సిఫార్సు లేఖలుంటేనే పోస్టింగులు
కాంగ్రెస్‌లో వైఎస్ హయాం వరకూ సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత బాబు సర్కారు కూడా ఎమ్మెల్యేల లేఖలకే ప్రాధాన్యం ఇవ్వడంతో, ఆయన కష్టపడి సంపాదించుకున్న ప్రతిష్ఠ పోయేందుకు కారణమయింది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ సర్కారులో కూడా ఎమ్మెల్యేల లేఖలకే ప్రాధాన్యం. సమర్ధులకు స్థానం దక్కకపోవడానికి అదో కారణం. నిజానికి వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తమ సొంత జిల్లాల విషయంలో తప్ప, బదిలీలలో పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదు.

డీజీపీలకు విలువేదీ?
అప్పుడు డీజీపీలకూ ఎంతో విలువ ఉండేది. అధికారుల పోస్టింగ్ ప్రాధాన్యాన్ని వారు పాలకులకు వినిపించి, పోస్టింగ్ ఇప్పించేవారు. ఇంటలిజన్స్ ఏడీజీ, డీజీల సిఫార్సుకూ ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో డీజీపీ స్థాయి అధికారులను పాలకులు గౌరవించే పరిస్థితి లేదు. ఏపీలో డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌ను అవమానకరరీతిలో సాగనంపి, 12 మంది కంటే జూనియర్ అయిన అధికారికి ఆ పోస్టింగ్ ఇచ్చారు. అసలు పోస్టింగులలో డీజీపీల సూచనలు పాటించేవారే కరవు. అంతా ఉత్తర-‘దక్షణ’లకే ప్రాధాన్యం. ఎమ్మెల్యేలు ఎవరికి లెటరిస్తే వారికే పోస్టింగులిస్తున్న పరిస్థితి. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజర యితే, డీజీపీ కూడా గైర్హాజరవడం విమర్శలకు దారితీసింది.

ఏసీపీ పోస్టింగులు కూడా సీఎంఓనా?
ఒకప్పుడు డీఎస్‌పీ/ఏసీపీల పోస్టింగుల గురించి సీఎంలు అసలు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అవి కూడా సీఎం లేదా సీఎంఓ నుంచే వచ్చే దురదృష్టకర సంస్కృతి మొదలయింది. ఆంధ్రాలో అయితే హోంమంత్రిని పక్కకుపెట్టి ఓ సలహాదారే శాఖను చక్కబెడుతున్నారన్న ఆరోపణలు పోలీసుశాఖ ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఏసీపీ పోస్టింగ్ కావాలంటే సీఎం లేదా ఒక కీలక మంత్రి సిఫార్సు అవసరం అనివార్యమయిందన్న వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులకే ఎక్కువ పోస్టింగులిచ్చారన్న విమర్శ లేకపోలేదు.

ఆ 80 మందికి పోస్టింగులేవీ?
గత ఏడాది హైదరాబాద్ నగరంలో 80 మంది ఇన్స్‌పెక్టర్లకు ఏసీపీ ప్రమోషన్లు వస్తే, ఇప్పటివరకూ వారికి పోస్టింగులు లేని దుస్థితి. ఖాళీలున్న వారిని వివిధ జోన్లకు అటాచ్‌చే సిన పరిస్థితి. ఇక సీనియర్ ఐపిఎస్‌లకూ ఇప్పటివరకూ పోస్టింగులు లేని పరిస్థితి తెలంగాణలో కొనసాగుతుండగా, ఏపీలో ఇటీవల జరిగిన పోస్టింగుల్లో సర్కారు రెడ్డి వర్గానికి కీలక పోస్టింగులు ఇచ్చిందన్న విమర్శ ఎదుర్కొంది. తోటి ఐపిఎస్‌లకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఖండించలేని పరిస్థితిలో, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉందన్నది మరో విమర్శ.

మొత్తంగా ప్రజల రక్షణ కు అంకితమయిన పోలీసులకే రక్షణ లేని దయనీయం రెండు తెలుగురాష్ట్రాల్లో కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు ప్రజల ముందే పోలీసులను అవమానిస్తుంటే, ఇక వారికి న్యాయం చేసేదెవర న్నది ప్రశ్న.

LEAVE A RESPONSE