Suryaa.co.in

Andhra Pradesh

ఖుర్దా రోడ్‌-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్‌

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఒడిషాలోని ఖుర్దా రోడ్‌ నుంచి విజయనగరం మధ్య మూడవ రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

ఖుర్దా రోడ్‌ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్‌ నిర్మాణంతోపాటు భద్రక్‌-విజయనగరం సెక్షన్‌లో నెర్గుడి – బరంగ్‌ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యవయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.

ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద పైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడవ రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్‌ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు.

రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్‌ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్‌ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి.

ప్రాజెక్ట్‌ సైట్‌లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్‌ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్‌ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు.

LEAVE A RESPONSE