న్యాయ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని పునర్జీవింప చేసిన తీర్పు ఇది

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ మంజూరీ చేయడం ద్వారా, న్యాయ స్థానాలపై ప్రజలకున్న నమ్మకాన్ని పునర్జీవింపజేసే తీర్పు న్యాయమూర్తి ఇచ్చారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం పై ఉన్న నమ్మకం, న్యాయస్థానాలపై ఉన్న గౌరవంతో ఆలస్యం జరిగినప్పటికీ, న్యాయమే గెలుస్తుందని నేను బలంగా విశ్వసించాను. ఇదే విషయాన్ని హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబు నాయుడు కు తోడు మేము అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చెప్పాను.

సోమవారం నాడు న్యాయస్థానాలలో న్యాయానికి పరీక్షని, సోమవారమే న్యాయం జరుగుతుందని లేనిపక్షంలో మంగళవారం నాడు న్యాయం జరుగుతుందని పరిపూర్ణ విశ్వాసంతో ఉండాలని సభకు హాజరైన వారికి సూచించాను. నేను అదే విశ్వాసంతో ఉన్నాను. అక్టోబర్ 31 వ తేదీ తనకు మరపురాని రోజు అని, అదే రోజు తన కుమార్తె జన్మదినం అని పేర్కొన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా హైకోర్టులో చంద్రబాబు నాయుడు చేసిన న్యాయపోరాటం ఫలించి ఆయనకు మద్యంతర బెయిల్ లభించడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

ఎన్నో కుయుక్తులు పన్ని చంద్రబాబు నాయుడు ని జైలులో నిర్బంధించారు. ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. వైద్యులు ఇచ్చిన నివేదికను కూడా తారుమారు చేసి చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను చేశారు. న్యాయస్థానాన్ని నమ్ముకున్నందుకు అంతిమంగా న్యాయమే గెలిచిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ని జడ్జిగా నియమించి చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను విచారించమని చెప్పిన, ఆయన కూడా ఇటువంటి తీర్పే ఇవ్వక తప్పదు. చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి కాట్రాక్ ఆపరేషన్ చేయించుకున్నారు. కుడి కంటికి కూడా కాట్రాక్ ఆపరేషన్ చేయించుకోవాలని అప్పుడే వైద్యులు సూచించారు. శరీరంపై దద్దుర్లు వచ్చాయి. గుండె సంబంధిత సమస్యతో కూడా ఆయన బాధపడుతున్నారు. వీటన్నింటికీ తక్షణమే మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.

న్యాయస్థానానికి కళ్ళు లేకపోయినా, ఈ తీర్పు ద్వారా హృదయం ఉన్నదని నిరూపించారు. నక్కలు, తోడేళ్ల వంటి వ్యక్తులతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన ఉండే ఇద్దరూ సీనియర్ ఐపీఎస్ అధికారుల బారి నుంచి చంద్రబాబు నాయుడుని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామీనే కాపాడారు. ఇంకా కొన్ని రోజులు జైలులోనే ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ప్రమాదం కలిగించి ఉండేవారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఉన్న నారావారి పల్లె లో జన్మించిన నారా చంద్రబాబు నాయుడు పై ఆయన కృపా కటాక్షాలు మెండుగా ఉన్నాయి. అందుకే, ఆ వెంకటేశ్వర స్వామినే న్యాయమూర్తి ద్వారా న్యాయం పలికించారని నేను నమ్ముతున్నాను.

అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, వెంటనే తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని చంద్రబాబు నాయుడుకు రఘురామకృష్ణం రాజు సూచించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం మెరుగైన వైద్య చికిత్స తో సంపూర్ణ ఆరోగ్యవంతుడై, పునర్ యవ్వనంతో ప్రజల మధ్యకు అడుగు పెట్టాలని కోరారు . వెంకటేశ్వర స్వామి దర్శనంతో చంద్రబాబు నాయుడుకు అన్ని శుభాలే జరుగుతాయని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే నేను కూడా తిరుమల వెంకన్నను దర్శించుకోవాలని భావించాను. ఇప్పటికీ నా మొక్కు అలాగే పెండింగులో ఉంది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నాపై 16 నుంచి 18 కేసులను నమోదు చేయించారు. అందుకే అమెరికాలోని వెంకటేశ్వర స్వామి తో పాటు, దేశం నలుమూలలా ఉన్న దేవాలయాలను దర్శించుకున్నాను. కానీ, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రస్తుతానికి దర్శించుకోలేకపోతున్నానని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు .

ఈ నాలుగు వారాలపాటు ఏమి చేయలేరు… అయినా ఆ కేసు నిలబడే చాన్సే లేదు
చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన మద్యం అవకతవకల కేసు న్యాయస్థానంలో నిలబడే అవకాశమే లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు . చంద్రబాబు నాయుడు పై మోపిన మద్యం అవకతవకల కేసు లో ఆయన్ని వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా … చంద్రబాబు నాయుడుకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా నాలుగు వారాలపాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నమోదు చేయగానే, ఆయన అనారోగ్యం కాస్త… ఆరోగ్యంగా మారదు కదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు ఎలాగో పోతుందని తెలిసే, చంద్రబాబు నాయుడు తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మరొక వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేశారని ఎఫ్ఐఆర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… అప్పుడు మీరు మనుషులా?, జగనాసురులా అంటూ ధర్మాసనం మండిపడుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పై వరుస కేసులు నమోదు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం, నాలుగున్నర ఏళ్ల తర్వాత వరుసగా కేసులను నమోదు చేస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చంద్రబాబు నాయుడు పై ఫిర్యాదు చేస్తున్న వారంతా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు అజయ్ రెడ్డి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి గౌతమ్ రెడ్డి. అంగళ్ళులో తెదేపా నాయకులు విధ్వంసానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన వ్యక్తి ఉమాపతి రెడ్డి. మద్యం డిస్టలరీల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన వ్యక్తి వాసుదేవ రెడ్డి.

ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేస్తుంటే, అదే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారి స్వీకరిస్తున్నారు. నేను ఖులము చూడను… మథము చూడను అని ముఖ్యమంత్రి అంటుంటారు. చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన ఐదు కేసులలో ఫిర్యాదుదారులంతా ఎందుకని ఆయన సామాజిక వర్గానికి చెందినవారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిఐడి నమోదు చేసిన కేసులను కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న రఘురామిరెడ్డి ఎందుకని విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పై ఇదంతా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తున్న కుట్రగా భావించాల్సి వస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఎస్పీవై రెడ్డి డిస్టలరీస్ కి అనుచితంగా లబ్ధి చేకూర్చారని భావించి చంద్రబాబు నాయుడు పై సిఐడి కి , రాష్ట్ర బేవరైజర్స్ కార్పొరేషన్ కార్యదర్శి వాసుదేవ రెడ్డి ఫిర్యాదు చేశారట. ఎస్పివై రెడ్డి డిస్టలరీని దొంగ లీజుతో నిర్వహిస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు ఆ వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమలుకు జీవో జారీ చేసిన అజయ్ కల్లం రెడ్డి పై, ప్రతిపాదించిన ప్రేమ్చంద్రారెడ్డి పేర్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేవని నిలదీశారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు కేవలం ఫిర్యాదుదారులు గానే ఉంటారా?, నిందితులుగా ఉండరా?? అని రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.

హవ్వ…జగన్ కడిగిన ముత్యంలా వచ్చాడా?… సజ్జల??
జగన్మోహన్ రెడ్డి తనపై మోపిన ఆర్థిక నేరాభియోగ కేసుల నుంచి కడిగిన ముత్యంలా వచ్చారని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు . జగన్మోహన్ రెడ్డి పై నమోదు చేసిన ఆర్థిక నేరాభియోగ కేసులన్నీ పెండింగ్ లో లేవా అంటూ ప్రశ్నించారు. న్యాయస్థానాల నుంచి తప్పించుకొని తిరగడంలేదా… కడిగిన ముత్యంలా బయటపడడమా అంటూ నిలదీశారు. రెండు మూడు రోజుల తర్వాత రాష్ట్ర హైకోర్టులో ఏమి కేసులు వస్తాయో చూడు… అని అన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 3, 180 సార్లు కోర్టును వాయిదా అడిగారు. కేవలం 77 సార్లు కోర్టును వాయిదా అడిగితేనే సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అటువంటి మీరు, మీకు మీరే కడిగిన ముత్యమని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఎవరీ…వాసుదేవ రెడ్డి? అత్యంత అవినీతిపరుడైన అధికారి
రాష్ట్ర బెవరైజర్స్ కార్పోరేషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వాసుదేవ రెడ్డి అత్యంత అవినీతిపరుడైన అధికారి అని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఒక జూనియర్ మోస్ట్ ఐ ఆర్ టి ఎస్ అధికారి అయిన వాసుదేవ రెడ్డి పై అప్పటికే రెండు విజిలెన్స్ కేసులు ఉండడం తో రైల్వే శాఖ అధికారులు ఆయన్ని పక్కన పెట్టారు. రైల్వే శాఖ అధికారులను ఎలాగో మేనేజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తెచ్చి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ కార్యదర్శిగా నియమించారు. వాసుదేవ రెడ్డి, పుల్లారెడ్డి అనే వ్యక్తికి అల్లుడు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడికి ఈ వాసుదేవ రెడ్డి తోడల్లుడు.

వాసుదేవ రెడ్డికి, వైకాపా నేతలతో ఉన్న సంబంధాలు ఇవని పేర్కొన్నారు. రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ కార్యదర్శిగా వాసుదేవ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్ష కోట్ల రూపాయల అవినీతికి ఆయన సహకరించారు. అటువంటి వాసుదేవ రెడ్డి సమీక్ష చేస్తుండగా, ఎస్పీవై రెడ్డి డిస్టలరీస్ కు అనుచితంగా లబ్ధి చేకూరే విధంగా, ప్రభుత్వానికి 1300 కోట్ల రూపాయల నష్టం వచ్చే విధంగా పెద్దగా డిమాండ్ లేని బ్రాండ్లకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొనుగోలుకు అనుమతినిచ్చారని తెలిసిందట.

మూర్ఖులారా… మిమ్మల్ని అడుగుతున్నాను… రాష్ట్రంలో విక్రయిస్తున్న తొకడ, బొకడ బ్రాండ్లకు ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు. మెక్ డోవల్స్ వంటి పాపులర్ బ్రాండ్లు ఎందుకు లభించడం లేదు. ఇదే విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ప్రశ్నిస్తే, ఆమెపై ఒక పనికిమాలిన వాడు వ్యక్తిగత దాడి చేస్తున్నాడు. రాష్ట్రంలో అసలు బ్రాండ్ ఏదైనా ఒకటే సరుకును విక్రయిస్తున్నారు. ఏ టెండరు లేకుండానే ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలను తిప్పుతున్నందుకు అరబిందో సంస్థ కు 27.5 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నారు. అదే కంపెనీకి రెండు పోర్టులను అప్పజెప్పారు.

వీటన్నింటిపై విచారణ చేపట్టాలని కేసులు వేశాం. మద్యం కుంభకోణం పై దగ్గుబాటి పురందరేశ్వరుని, నేను ప్రశ్నిస్తుండడంతో, ముందుచూపుతో మాజీ ముఖ్యమంత్రి పై ఒక కేసు పెట్టించారు. నీతి నిజాయితీకి మారుపేరైన తాము మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసినందు, ఈ విధంగా ప్రశ్నిస్తున్నారని ప్రచారం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇది.

న్యాయస్థానం ముందు ఈ కేసు నిలబడే ప్రశ్న లేదు. నవంబర్ ఏడవ తేదీలోగా నారా చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు లో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని, రిమాండ్ రిపోర్టును క్వాష్ చేసే అవకాశం ఉందన్నారు. ఇదే తీర్పు వెలబడుతుందన్న ఆయన, న్యాయ వ్యవస్థ పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడించారు . స్కిల్ డెవలప్మెంట్ కేస్ కే కాకుండా అన్ని కేసులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఒక్క అంగళ్లు కేసులో మాత్రమే గవర్నర్ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అయినా బుద్ధి ఉన్నవారు ఎవరైనా ఆ కేసును కొట్టేస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

బ్రాండ్ల బాగోతంపై సిబిఐ విచారణ కోరుతాం
రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల బాగోతంపై సిబిఐ విచారణను కోరుతామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఏ బ్రాండ్ కు ఎందుకు అప్రూవల్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆల్కహాల్ ను ఏ ఫ్యాక్టరీ ఎంత ఉత్పత్తి చేసిందో వివరించాలన్నారు. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే… సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. డిస్టలరీస్ వద్ద నుంచి ఆల్కహాల్ ఎంత కొనుగోలు చేశారు. ఎంత సరుకు అమ్మారు. వాటిపై లేబుల్స్ ఎవరు ఇచ్చారు.

రాజ్ కసిరెడ్డి కంపెనీనే లేబుల్స్ ఇచ్చిందా?,. అందులో దొంగ లేబుల్స్ ఏమైనా ఇచ్చారా?. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మద్యంలో అన్ డ్యూటీ పెయిడ్ సరుకు ఎంత??, వీటన్నింటిపై విచారణ జరగాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. నీతికి నిజాయితీకి విలువ ఇచ్చే వ్యక్తులమని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతుంటారు. మీ నీతి నిజాయితీ ఏమిటో విచారణకు ఆదేశించి నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి, మతానికి చెందిన అధికారులు కాకుండా, ఇతర అధికారులతో విచారణ చేయించాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే చంద్రబాబు నాయుడుని చంపేస్తారు
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన తర్వాత చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే ఆయన్ని ఈ ప్రభుత్వం చంపేసే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకనే మిలిటరీ ఆసుపత్రిలో నేను చికిత్స చేయించుకున్నాను. ఆ మిలిటరీ ఆసుపత్రిలోనూ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారి, కొండమీద ఉండే రెడ్డి, గుంటూరు కు చెందిన అమ్మిరెడ్డి అనే వ్యక్తులు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేశారు.

ఇవన్నీ పెద్ద రెడ్డి నాయకత్వంలో జరిగినప్పటికీ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయవల్ల బ్రతికి బయటపడ్డాను. ఆ దేవుడే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గొంతులో ప్రవేశించి, న్యాయం చేశారు. అయినా చంద్రబాబు నాయుడు తనకిష్టమైన ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చునని హై కోర్ట్ తన తీర్పులో పేర్కొంది. నాలుగు వారాల్లో ప్రజలందరికీ దీవెనలతో చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని రఘురామకృష్ణం రాజు ఆకాంక్షించారు. ఏడవ తేదీలోగా ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తప్పక ఆయనకు న్యాయం జరిగి తీరుతుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

హ్యాట్సాఫ్… నారా లోకేష్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంటి కొడుకు ఉండడం చంద్రబాబు నాయుడు అదృష్టం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అనంతరం అతను పడిన తపనను నేను స్వయంగా చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా కుమారుడు, భార్య కూడా ఇదే విధంగా తపనపడ్డారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరమే నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలువాలి అని యాత్రను చేపట్టారు. చివరకు నిజమే గెలిచింది. నారా కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థనలే కాకుండా, ప్రజలంతా దేవుళ్లకు చేసిన ప్రార్థనలు ఫలించాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఋషికొండపై హైకోర్టులో తీర్పు ప్రతికూలంగా వస్తే… సుప్రీం కోర్టు ఆశ్రయిస్తాం
ఋషికొండపై అక్రమ భవన నిర్మాణ సముదాయాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పకుండా తప్పు పడుతుంది. అయినా నిర్మించారు కదా.. ఏమి చేస్తామని అంటే, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు కూల్చి వేయమంటే , కూల్చి వేయడం మన సంస్కృతి కాదు కాబట్టి… టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మానసిక వైద్యశాల గా మారుస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ పై నిర్మించిన భవనంలో నివాసం ఉండడానికి వీలు లేకుండా న్యాయస్థానం నుంచి ఆర్డర్ తీసుకువస్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు ..

Leave a Reply