Suryaa.co.in

Editorial

పొత్తుకు వేళాయెరా!

– అమిత్‌షా-నద్దా-చంద్రబాబు భేటీ ఫలితం
– టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు బీజం పడినట్లే
– ఇక తర్వాత సీట్ల లెక్కలు- సర్దుబాట్లు
– ఆంధ్రా-తెలంగాణలో లాభ నష్టాలపై బేరీజు
– టీడీపీతో వెళితే లాభమన్న ఇద్దరు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు?
– అమిత్‌షాకు జిల్లాల వారీ గణాంకాలు అందించిన ఆ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు
– అంతకుముందే టీడీపీతో పొత్తు అవసరం వివరించిన తెలంగాణ బీజేపీ నేతలు?
– హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకు సహకరిస్తుందని అమిత్‌షాకు నివేదిక
– ఏపీలో బీజేపీ వల్ల 6 శాతం ఓట్లు లాభమని టీడీపీ అంచనా
– మైనారిటీ ఓట్లు దూరమైనా, తటస్థుల ఓట్లతో టీడీపీకే లాభమంటున్న కమలదళాలు
– ఢిల్లీ బిల్లుపై మద్దతు ఇవ్వాలని కోరిన అమిత్‌షా
– అంగీకరించిన చంద్రబాబునాయుడు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్నది సామెత. కర్నాటక ఫలితాలతో కమలదళం దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు, నిన్నటి అమిత్‌షా-బాబు భేటీతో స్పష్టమయింది. టీడీపీ-బీజేపీ-జనసేన కలసి ఎన్నికల వైతరణి దాటతాయన్నది, చాలాకాలం నుంచీ వస్తున్న వార్తలు. మధ్యలో మళ్లీ ఆ పొత్తు టీడీపీ-జనసేనకే పరిమితమవుతుందని వినిపించిన మరో చర్చ.

జగనన్న వైసీపీ పార్టీకి బీజేపీ తెరచాటు మద్దతునివ్వడం, ఏపీలోని కొందరు బీజేపీ పెద్ద తలలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తుండటమే, బహుశా ఆ చర్చకు కారణం కావచ్చు. కానీ అంతిమంగా కమలదళాలకు కర్నాటక ఫలితాలు కనువిప్పు కలిగించినట్లు, నిన్నటి అమిత్‌షా-బాబు గంటన్నర భేటీ స్పష్టం చేసింది.

నిజానికి బీజేపీలో నెంబర్ టూ అమిత్‌షాను, చంద్రబాబు కలసి ఐదేళ్లయిపోయింది. మధ్యలో మోదీతోనే భేటీ వేశారు. అది కూడా ఒక సామూహిక కార్యక్రమంలో మాత్రమే. మోదీ అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు చాలాసార్లు ప్రయత్నించినా, వారి కలయిక ఆ రూపంలో జరిగింది. ఇక నిన్నటి అమిత్‌షా భేటీ ఊహించనిదే. ఢిల్లీలోని టీడీపీ వర్గాలకు సైతం, రాత్రి వరకూ బాబు పర్యటనపై సమాచారం-స్పష్టత లేదంటే, బాబు పర్యటన ఎంత గోప్యంగా జరిగిందో అర్ధమవుతుంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో.. కమలానికి ఎదురుగాలి వీస్తోందన్నది ఇప్పుడున్న సమాచారం. బీజేపీకి బలమే ఉత్తరాది. మరి అక్కడ బలం తగ్గితే, దానిని దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఉందా అంటే లేదు. ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రమైన కర్నాటకలో, స్వయంకృతాపరాధంతో పార్టీ ఓడింది. అధికారం ఉన్నప్పుడు అహంకారం సహజం. అంతా పాజిటివ్‌గానే కనిపిస్తుంది. పార్టీ పల్లకీ మోసిన సైనికులు గుర్తుకురారు. తర్వాత ‘ఫలితం’ అనుభవిస్తుంది. అందుకు బీజేపీ ఏమీ అతీతురాలు కాదు. కర్నాటకలో కూడా జరిగింది అదే.

ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న భావనతో ఉన్న బీజేపీ నాయకత్వం, ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మోదీ నుంచి కేంద్రమంత్రుల వరకూ అంతా వరసపెట్టి పర్యటలు చేస్తున్నారు. అటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్‌ఎస్ సర్కారుపై మాటల దాడి పెంచుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ‘ఇవన్నీ బీజేపీ అధికారంలోకి రావచ్చన్న ఆశలు’ కల్పిస్తున్నాయి.

కానీ ఆ హడావిడి అంతా మీడియాలో తప్ప, క్షేత్రస్థాయిలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. నిజానికి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ను తట్టుకుని.. నిలబడేంత స్థాయిలో బీజేపీకి అభ్యర్ధులే కరవు అన్నది, మనం మనుషులం అన్నంత నిజం. మహా అయితే 25-30మంది అభ్యర్ధులు దొరకవచ్చేమో?! రోజూ మీడియాలో కనిపించే చాలామంది పెద్ద తలలు, ప్రత్యక్ష పోటీకి ఆసక్తిగా లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ అభ్యర్ధులను తట్టుకోవాలంటే.. ఆ రెండు పార్టీల నుంచి ఎవరైనా వచ్చి చేరి, బీజేపీలో పోటీ చేయాల్సిందేనన్నది సుస్పష్టం. అందుకే చేరికపైనే ఆశలు పెట్టుకోవలసిన పరిస్థితి. కానీ బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనన్న భావన-అనుమానంతోనే బీజేపీలో చేరికలు నిలిచిపోతున్నాయి. అది వేరే విషయం!

ఈ పరిస్థితిలో తెలంగాణలో దాదాపు 45 నియోజకవర్గాల్లో, విజయాన్ని ప్రభావితం చేయగల టీడీపీ ఓట్లు.. బీజేపీ లక్ష్యానికి అత్యవసరం. సుమారు 45 నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం ఓట్లు, ఫలితాలను ప్రభావితం చేసేవే. 5 నుంచి 50 వేల ఓట్ల వరకూ ఉన్న నియోకవర్గాల సంఖ్య అవి.

గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌లో పూర్తి స్థాయిలో.. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో విజయంలో కొంత శాతం ప్రభావితం చేసే ఓట్లు టీడీపీకి ఇప్పటికీ లేకపోలేదు. పైగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డిలోని సెటిలర్లు చంద్రబాబు తెలంగాణ నుంచి వెళ్లిపోయినా, ఇప్పటికీ ఆయనను అభిమానిస్తుంటారన్నది నిర్వివాదం.

ఈ పరిస్థితిలో పార్టీ నావ విజయతీరాలకు చేరాలంటే.. తెలంగాణలో టీడీపీ దన్ను అవసరం అని, తెలంగాణ బీజేపీ నేతల గట్టి నమ్మకం. అలాగైతేనే పార్టీ పూర్తి స్థాయిలో, బీఆర్‌ఎస్‌తో యుద్ధం చేస్తుందనేది వారి వాదన. ఆ మేరకు తెలంగాణ బీజేపీ పార్టీలో ముఖ్య నాయకుడు, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న మరో ఎంపీ ఇద్దరూ.. హోంమంత్రి అమిత్‌షాకు వాస్తవ పరిస్థితి వివరిస్తూ, నివేదిక సమర్పించినట్లు సమాచారం.

నిజానికి చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుదన్న వారిద్దరి సూచన మేరకే అమిత్‌షా-బాబు భేటీ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. దానితో ఎవరూ ఊహించని విధంగా, చంద్రబాబుకు రాత్రి వేళ అమిత్‌షా నుంచి పిలుపురావడం, బాబు ఢిల్లీ వెళ్లి కలవడం చకచకా జరిగిపోయాయి.. అంతకుముందే మరికొందరు పార్టీ కీలక నేతలు కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి, తెలంగాణలో పార్టీ వాస్తవ బలాలలపై చర్చించారు.

నిజానికి ఈ భేటీ వారిద్దరికే పరిమితమైతే, చర్చల ఊహాగానాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఏదో ఏపీకి సంబంధించి, జగన్ సర్కారుపై ఫిర్యాదు చేయడానికి బాబు వచ్చారనుకునే అవకాశం ఉండేది. కానీ మధ్యలో బీజేపీ అధ్యక్షుడు నద్దా కూడా వారి చర్చల్లో పాల్గొనడంతోనే చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. నద్దా వచ్చారంటే అది, పార్టీకి సంబంధించిన వ్యవహారమేనని మెడ పై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. ఆ ప్రకారంగానే రెండు రాష్ట్రాల్లో పొత్తు కోసం ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం.

దానికితోడు… త్వరలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కేంద్రం, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఢిల్లీ బిల్లును సమర్ధించాలని అమిత్‌షా టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఎన్డీఏ వ్యతిరేక కూటమి దన్నుగా నిలిచింది. దానితో ఆ బిల్లును నెగ్గించుకోవడం బీజేపీకి ప్రతిష్ఠగా మారింది. అందులో భాగంగానే చంద్రబాబును చర్చలకు పిలిపించారన్నది, బీజేపీలో వినిపిస్తున్న మరో వాదన. పనిలో పనిగా పొత్తు వ్యవహారం కూడా, చర్చకు రావడం సహజమేనన్నది బీజేపీ సీనియర్ల విశ్లేషణ.

తొలి భేటీలోనే, పొత్తు ఖరారయిపోయిందని చెప్పడం కష్టం. అయితే ఆ మేరకు పొత్తు చర్చలకు, బీజం పడిందనేది నిజం అన్నది, టీడీపీ-బీజేపీ నేతల వ్యాఖ్య. ఇక తర్వాత కాగలకార్యం తీర్చే గంధర్వులు, ఎలాగూ ఉన్నారు కాబట్టి.. సీట్ల సంఖ్య, బలాబలాల వ్యవహారం వంటి కూడికలు-తీసివేతలను, వారే పూర్తి చేస్తారన్నది బహిరంగమే.

అయితే.. బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీ ఓట్లు దూరమవుతాయన్నది, టీడీపీలోని ఒక వర్గం ఆందోళన. అందువల్ల జనసేనతో పొత్తు పరిమితమైతేనే మంచిదన్నది వారి వాదన. కానీ ఆ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ, బీజేపీకి 6 శాతం ఓటు బ్యాంకు ఉందని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. తటస్థులు-దేశం కోసం ఆలోచించే మేధావుల ఓట్లు కలిస్తే.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి హిట్టవుతుందన్నది బీజేపీ సీనియర్ల విశ్లేషణ.

తాజా అమిత్‌షా భేటీతో.. టీడీపీ-బీజేపీ-జనసేన కలసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న సంకేతాలయితే, క్షేత్ర స్థాయికి వెళ్లాయి. తాజా పరిణామాలతో ఏపీ బీజేపీలో, టీడీపీని సదా వ్యతిరేకించే ఆ నలుగురైదుగురి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A RESPONSE