Suryaa.co.in

Devotional

ఉదర నిమిత్తం బహుకృత వేషం

ఆది శంకరాచార్యులవారు దాదాపు రెండువేల ఐదువందల ఏళ్ళ క్రితం చెప్పిన శ్లోకం ఇప్పటి మన సమాజంలో మనం చూస్తున్న విషయాలకు అద్దంపట్టినట్లు ఉన్నదంటే అతిశయోక్తిలేదు. ఈ రోజులల్లో మనకు చాలామంది సత్గురువులు తారసపడుతున్నారు. వారి ఆకారాలు, వస్త్రధారణలు మనలను వారు సాక్షాతూ భగవానుని అవతారం అనేవిధంగా మభ్యపెడుతున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకొని, ఖరీదయిన భావంతులలో సకల భోగాలను అనుభవిస్తూ, మనలకు వేదాన్తభోదనలను చేస్తున్నారు.

వారి శిష్యగణం అంతా అత్యంత ధనవంతులు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు, ఇంకా ఇతర ధనికవర్గానికి చెందిన గొప్పవారు. వారి దర్శనానికి టికెట్, వారి పాద ప్రక్షాళణానికి టికెట్, మనఇంట్లో వారి పాదాలనుమోపితే టికెట్ ఇలా ప్రతి దానికి ఎంతో ఖరీదైన టికెట్లను వసూలు చేస్తూ వారి పబ్బాలను గడుపుకొని మనలను ఉద్ధరిస్తున్నామని చెప్పుతున్నారు. వారిని చుస్తే “పైన పటారం లోన లొటారం” అన్న సామెతకు సారూప్యంగా వుంటున్నారు. ఒక స్వామిజి విభూతి ఇస్తారు, ఒక స్వామిజి కుంకుమ ఇస్తారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ దీవెనలు ఇస్తూ సామాన్యుల ధనాన్ని దోచుకుంటున్నారు.

కొందరు గుండు చేసుకొని దర్శనమిస్తే కొందరు మీసాలకు, గడ్డాలకు కూడా రంగు వేసుకొని దర్శనమిస్తున్నారు, మరికొందరు జడలు పెంచుకొని వుంటున్నారు. కొందరు ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరిస్తే, కొందరు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు. ఏదో ఒక ప్రేత్యేక గుర్తింపు కలిగి వారే పరమేశ్వరుని అవతారాలని లేక ఈశ్వరుని దూతలమని చెప్పుకొంటూ అనేక విధాలుగా మన మనస్సులను వారి వశం చేసుకొని మననుంచి ద్రవ్యాన్ని కాజేస్తున్నారు. వారి శిష్యులకు ఆ పని జరిగింది ఈ పని జరిగింది అని ప్రచారాలు చేస్తూ అమాయక సామాన్య ప్రజలను వారి శిష్యగణంలో చేర్చుకొని వలసినంత దండుకుంటున్నారు. సమశ్యలలో మునిగి తేలే సగటు మధ్యతరగతి మానవులు వారి ప్రసంగాలకు, వారిగూర్చి ఇతరులు చేసే ప్రచారాలకు లొంగి వారికేదో మేలు జరుగుతుందని భ్రమపడి అప్పులు చేసి మరి వారి దర్శనానికి వెళ్లి వారి వలలో పడుతూ తమ జీవితాలను ఇక్కట్ల పాలు చేసుకుంటున్నారు.

సముద్రంలో కొట్టుకొని వెళ్లే వాడికి చిన్న గడ్డిపరక దొరికినా ఎంతో ఊరట కలిగిస్తుంది అన్నట్లు నిత్యం సమశ్యలలో చిక్కుకొని అనేక కస్టాలు పడే సగటు మానవులకు ఈ దొంగ స్వాములు, గురువులు, దేవతా అవతారమూర్తులు చేసే ప్రసంగాలు, మాటలు వారికి ఎంతో ఆశను కలిగిస్తాయి. అందుకే వారికి ఏదో ఉపశమనం కలుగుతుందనే ఆశతో వారు ఏమిచేస్తున్నారో కూడా తెలియకుండా వారి వశమవుతున్నారు.

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో భగవంతుని అవతారం ఎత్తే సమయం ఇంకా రాలేదని తత్వవిదులు చెపుతున్నారు. నిజానికి భగవంతుడు ఈ భూమి మీద అవతారం ఎత్తితే సమాజాన్ని ఒక శ్రీ రాముడి లాగ లేక ఒక శ్రీకృష్ణుని లాగా ఉద్ధరిస్తారే కానీ వారి వారి స్వార్ధానికి మనలను దోచుకోరనే చిన్న నిజం తెలిస్తే ఎవ్వరు మోసపోరు. శ్రీ రామచంద్రులవారు ఒక సార్వభౌమ కుటుంబంలో జన్మించి కూడా అతి సామాన్యుని వలె నారవస్త్రాలను (చౌకబారు బట్టలు) ధరించి తన భార్య తమ్మునితో అడవిలో గుడిసెలలో (పర్ణశాలలో) నివసించి ఆకులు, అలమలు తిని మనకు తండ్రి మాటను నిలపెట్టుకోవటమే కుమారుని ధర్మం అని బోధించారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మగారు ఇప్పటికి నిత్యనూతనము సదా ఆచరణీయం అయిన శ్రీమత్ భగవత్గీతను మనకు ప్రసాదించారు. ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో మనకు కనబడే బాబాలు, స్వామీజీలు వారి ముందు ఏపాటివారో.
నిజానికి భగవంతుని ఆరాధించటానికి, భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మషమైన మనస్సు, అకుంఠితమైన దీక్ష, శ్రర్ధ మాత్రమే. అవిలేకుండా ఎవ్వరు భగవంతుని కృప కటాక్షాలను పొందలేరు. ధనంతో కొనలేనిది కేవలం భగవంతుడు మాత్రమే. ఇక శ్రీ శంకరాచార్యుల వారు నుడివిన శ్లోకాన్ని పరికిద్దాం.

“జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః|
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః||”

“ఒకానొకడు జడలు ధరించీ, మరొకడు ముండనం చేయించుకునీ, ఇంకొకడు వెంట్రుకలు పెరికేసుకునీ, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించీ ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్టనింపు కోవటానికే అనేకానేక వేషాలు వేస్తూంటారు.”
“జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరికివేయడం, ఆర్భాటమైన వస్త్రాలు ధరించడం – ఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్టనింపుకోవడానికి చేసే ఆడంబరమైన, అర్థరహిత చర్యలు మాత్రమే.

“జ్ఞాని అయినవాడు జడలు పెంచుకోడు, ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణల్లాంటివి చేయడు. ‘మూడవకన్ను’ అంటే ‘దివ్యచక్షువు’ ఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నిత్యమాడుతూన్నా ‘అంధులు’ గా ఉండ నిశ్చయించుకుంటారు మూఢులు.
కాబట్టి ప్రతి సాధకుడు తాను తన సాధన వలన మాత్రమే భగవంతుని కృపకు పాత్రుడు కావలి కానీ ఇతరత్రా ఎంతమాత్రం కాదు అనే యదార్ధాన్ని తెలుసుకోవాలి.

– ఎంబీఎస్ గిరిధర్‌రావు

LEAVE A RESPONSE